సూదిగాళ్ల కన్నా..సూదిపోటు సందేహాలే ఎక్కువ

Update: 2015-09-08 04:40 GMT
రెండు తెలుగు రాష్ట్రాల్లో సూదిగాళ్ల కలకలం రోజురోజుకీ పెరిగిపోతోంది. ఒకరి తర్వాత ఒకరుగా తమపై సూదిదాడి జరిగిందని ఫిర్యాదులు చేస్తున్నారు. అక్కడా.. ఇక్కడా అన్న తేడా లేకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో సూదిపోటు ఘటనలు ఒకటి తర్వాత ఒకటిగా వెలుగులోకి రావటం.. అందులో చాలావరకూ ఎలాంటి ఆధారాలు లభించకపోవటం ఇప్పుడు తలనొప్పిగా మారింది.

గోదావరి జిల్లాల్లో మొదలైన సూదిగాళ్ల కలకలం.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో చోటు చేసుకోవటం గమనార్హం. అయితే.. తమపై సూదిపోటు దాడి జరిగిందని సోమవారం ఫిర్యాదు చేసిన పలు ఉదంతాల్లో చాలావరకూ ఆధారాలు లభించకపోవటం.. సూదిపోటు జరిగినట్లుగా ఆనవాళ్లు లేకపోవటం గమానార్హం.

చూస్తుంటే.. బస్సుల్లో ప్రయాణించే సమయంలోనో.. మరో ప్రయాణంలోనూ.. ఏదైనా నొప్పి కలిగినా.. లేదంటే.. చురుక్కుమన్నా.. వెంటనే తమపై సూదిదాడి జరిగినట్లుగా ఫీలవుతున్నారా? అన్న సందేహం కలిగేలా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

సోమవారం వెలుగులోకి వచ్చిన సూదిపోటు వ్యవహారాల్లో.. మెదక్ జిల్లా యాచారం నివాసి స్వామినాయక్ తనపై సూదిదాడి జరిగిందంటూ సోమవారం దిల్ షుక్ నగర్ లో కలకలం రేపాడు. బస్సులో వెళుతున్న అతడు.. తన మోకాలిపై ఏదో గుచ్చినట్లుగా అనిపించటంతో ఎల్ బీ నగర్ లో దిగి.. ఆరంజ్ ఆసుపత్రికి వెళ్లాడు. అక్కడి వైద్యులు అతన్ని పరీక్షించి.. అతనిపై ఎలాంటి సూదిదాడి జరగలేదని తేల్చారు. దాదాపు ఇలాంటివే మరికొన్ని చోట్ల చోటు చేసుకోవటం గమనార్హం.  సందేహాలతో సూదిపోటు జరిగిందని భావించి భయపడే కన్నా.. కొద్దిరోజులు జాగ్రత్తగా ఉండటం మంచిదన్న సూచన పోలీసు అధికారులు చేస్తున్నారు. అందుకే.. బహిరంగ ప్రదేశాల్లో ఉన్నప్పుడు కాస్తంత జాగ్రత్తగా ఉంటే బెటర్.
Tags:    

Similar News