బాబు...కాస్త పార్టీని ప‌ట్టించుకోండి!

Update: 2016-09-22 06:22 GMT
రండి బాబు రండీ అన్న‌ట్లుగా పార్టీలో చేరిక‌ల‌కు గేట్లు ఎత్తేసిన తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ అధినేత ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు అందుకు ఊహించ‌ని ప్ర‌తిస్పంద‌న చ‌విచూస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఒకపుడు క్రమశిక్షణకు మారుపేరుగా పేరుబడిన అధికార తెలుగుదేశం పార్టీలో ప్రస్తుతం అది మ‌చ్చుకైనా క‌నిపించ‌డం లేద‌నేది ఇపుడు ఏపీ రాజ‌కీయాల్లో ఓపెన్ టాక్. బాబు సొంత జిల్లా చిత్తూరు మొద‌లుకొని ఏ జిల్లాలో చూసినా వర్గ పోరు, ఆధిపత్య పోరాటాలు ఎక్కువైపోయాయని చెప్తున్నారు.13 జిల్లాల అంధ్రప్రదేశ్‌లో తమ్ముళ్ళ మధ్య ఆధిపత్య పోరాటాలు లేని జిల్లాలు దాదాపు లేవంటే అతిశయోక్తి కాదేమో. కొన్ని జిల్లాల విషయంలో సర్దుబాటు కాక చంద్రబాబే చేతులెత్తేసినట్లు కనబడుతోంది. పార్టీలో నేతల మధ్య ఆధిపత్య పోరాటాలు ఈ స్ధాయికి చేరుకోవటంలో ఒక విధంగా అధినేతే కారణమనే వారు కూడా ఉన్నారు. మొదటి నుండి చంద్రబాబు అవలంభిస్తున్న వైఖరి వల్లే పార్టీలో వివాదాలు బాగా పెరిగిపోయినట్లు పలువురు పేర్కొంటున్నారు.

ఆధిపత్య గొడవలు బాగా ఎక్కువగా ఉన్న జిల్లాలు ప్రకాశం, విశాఖపట్నం, కడప, అనంతపురం, కర్నూలు అనే ప్రచారం సాగుతోంది. శ్రీకాకుళం, నెల్లూరు, తూర్పుగోదావరి జిల్లాలు తరువాత వరసలో ఉన్నాయి. మిగిలిన జిల్లాల్లో కూడా ఆధిపత్య గొడవలున్నప్పటికీ ఇప్పటికైతే అధినేతను ధిక్కరించే స్దాయిలో అయితే లేవని పార్టీ వర్గాల సమాచారం. మొదటి ఐదు జిల్లాలు గడచిన ఎన్నికలైన తర్వాత, అందులోనూ ఆపరేషన్ ఆకర్ష్ మొదలైన తరువాత పెరిగిపోయినవే. అనంతపురం జిల్లా తీసుకుంటే, ఎంపి జెసి దివాకర్‌రెడ్డి, రాప్తాడు ఎంఎల్ఏ, మంత్రి పరిటాల సునీత, అనంతపురం ఎంఎల్ఏ ప్రభాకర్ చౌదరి వర్గాలకు ఉప్పు నిప్పులా ఉంది. ఎన్నికల సమయంలో దివాకర్‌రెడ్డికి టిడిపి తరపున ఎంపి టిక్కెట్టు ఇవ్వటంతోనే ఒక సమస్య మొదలైతే, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభాకర్‌చౌదరి-పరిటాలసునీత-జేసీ దివాకర్‌రెడ్డిలు గెలిచిన తర్వాత అసలు కథ మొదలైంది. ఆయా వర్గాల మధ్య బాగా పెరిగిపోయిన ఆధిపత్య గొడవలు చంద్రబాబు చెప్పినా సర్దుబాటు చేసుకోలేనంత స్ధాయికి పెరిగిపోయాయి. ఇక, కర్నూలు జిల్లాను తీసుకుంటే, పార్టీ అధికారంలోకి వచ్చినపుడు చిన్న చిన్న సమస్యలు మాత్రమే ఉన్నాయి. అయితే, ఆపరేషన్ ఆకర్ష్‌తో ఇది పీక్ స్టేజీకి చేరింది. వైసీపీ తరపున గెలిచిన భూమా నాగిరెడ్డిని టిడిపిలోకి చేర్చుకోవటంతో ఆధిపత్య గొడవలు మొదలయ్యాయి. భూమాతో పడని వారిలో అత్యధికులు టీడీపీలో ఉండటంతో సమస్యలు ఎదురుకాలేదు. ఎప్పుడైతే భూమా టీడీపీలో చేరారో అప్పటి నుండే ఆధిపత్య గొడవలు మొద లై బాగా పెరిగిపోయింది. దానికితోడు చాంద్ పాషా, మణిగాంధి లాంటి ఎమ్మెల్యేలు కూడా వైసీపీని వీడి టీడీపీలోకి రావటంతో గొడవలు బాగా పెరిగిపోయాయి.

ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌ప‌లో బ‌ల‌ప‌డేందుకు బాబు చేస్తున్న ప్ర‌య‌త్నాలు పూర్తిగా బెడిసికొడుతున్నాయ‌ని అంటున్నారు. వైసీపీ ఎమ్మెల్యే ఆది నారాయణ రెడ్డిని చంద్రబాబు టీడీపీలోకి చేర్చుకున్నది మొద‌లు పార్టీలో గొడవలు రోడ్డున పడ్డాయి. దానికితోడు బద్వేలు ఎమ్మెల్యే జయరాములు కూడా టీడీపీలో చేరటంతో ఆ నియోజకవర్గంలో ఆధిపత్య పోరాటాలు ర‌చ్చ‌కెక్కాయి. పై వర్గాల మధ్య చంద్రబాబు కూడా సయోధ్య చేసే పరిస్ధితి కనబడటం లేదు. అదే విధంగా, ప్రకాశం జిల్లాలోని కరణం బలరాం-గొట్టిపాటి రవిల మధ్య ఆధిపత్య గొడవలు బాగా పెరిగిపోయాయి. వైసీపీ నుండి గొటిపాటి సైకిల్ ఎక్క‌డంతో ఆధిపత్య రాజకీయాలు మొదలైంది. మొదటి నుండి ఈ రెండు వర్గాల మధ్య ఉప్పు-నిప్పు అనే ప‌రిస్థితి ఇపుడు అధికారంలో పై చేయి సాధించేందుకు సాగుతున్నాయి. విశాఖపట్నం జిల్లాను చూస్తే, మంత్రులు చింతకాయల అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాస్‌రావు మొదటి నుండి టీడీపీ వారే అయినప్పటికీ గంటా మధ్యలో కాంగ్రెస్-టీడీపీ-ప్రజారాజ్యంలోకి వెళ్ళి మళ్ళీ కాంగ్రెస్‌లోకి దూకి ఇపుడు మళ్ళీ టీడీపీలో ఉన్నారు. అదే సమయంలో పార్టీ ఆవిర్భావం నుండి చింతకాయల టీడీపీలోనే కొనసాగుతున్నారు. అందుకనే పార్టీలోని నేతలు, కార్యకర్తల మద్దతు పూర్తిగా చింతకాయలకే ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయిన‌ప్ప‌టికీ ఇద్దరి మంత్రుల మధ్య గొడవలు బాగా పెరిగిపోయాయి.

చంద్ర‌బాబు సొంత జిల్లా చిత్తూరులో ఆయ‌న ప్రాతినిధ్యం వ‌హిస్తున్న కుప్పం నియోజ‌కర్గంలో వార్డు మెంబ‌ర్లు వ‌ర్సెస్ వైస్ చైర్మ‌న్ అన్న‌ట్లుగా మారింది. స‌త్య‌వేడు ఎమ్మెల్యేకు, అక్క‌డి ప్ర‌జాప్ర‌తినిధుల‌కు మ‌ధ్య ఉప్పు-నిప్పు అనే ప‌రిస్థితి మొద‌లైంది. చంద్రబాబు ఎన్ని మార్లు సర్దుబాటు చేసినా వివాదాలు కొనసాగుతూనే ఉండటం గమనార్హం. ఒకర‌కంగా కాంగ్రెస్ నేత‌లు టీడీపీలో చేర‌డంతో ఆ పార్టీ వ‌లే టీడీపీలోనూ క్ర‌మ‌శిక్ష‌ణ క‌ట్టుత‌ప్పుతోంద‌ని వ్యాఖ్యానిస్తున్నారు.
Tags:    

Similar News