చిచ్చు రేపిన అడారి.. ఎలా చేర్చుకుంటారని అయ్యన్న ప్రశ్న!
అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని బీజేపీ చేర్చుకోవడంపై మిత్రపక్షం టీడీపీ తీవ్రంగా పరిగణిస్తోంది.
విశాఖ డెయిరీ చైర్మన్ అడారి ఆనంద్ కుమార్ బీజేపీ చేరడం ఏపీలోని ఎన్డీఏ కూటమిలో చిచ్చు రేపింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని బీజేపీ చేర్చుకోవడంపై మిత్రపక్షం టీడీపీ తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ విషయమై అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. అడారిని బీజేపీ ఎలా తీసుకుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రశ్నించినట్లు తెలిసింది. దీనిపై స్పందించిన సీఎం కూడా అన్నీ తెలిసి బీజేపీ ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకుంటుందని విస్మయం వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు.
ఏడు నెలలుగా ఎలాంటి పొరపొచ్చాలు లేకుండా సాగుతున్న కూటమి ప్రయాణంలో చిన్నపాటి కుదుపు మొదలైంది. విశాఖ డెయిరీ చైర్మన్ అడారి ఆనంద్ కుమార్ బీజేపీలో చేరడం రాజకీయంగా ఇరుపార్టీల మధ్య దుమారం రేపింది. కూటమి పార్టీల్లో ఎవరు చేరాలన్నా ముందుగా మూడు పార్టీలు చర్చించి నిర్ణయం తీసుకోవాలని గతంలో నిర్ణయం తీసుకున్నామని, కానీ, అడారి విషయంలో బీజేపీ ఆ నిర్ణయాన్ని అతిక్రమించిందని స్పీకర్ అయ్యన్నపాత్రుడు రగిలిపోతున్నారని సమాచారం. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ శాసనసభాపక్ష విచారణ ఎదుర్కొంటున్న విశాఖ డెయిరీ చైర్మన్ అడారి ఆనంద్ ను బీజేపీ చేర్చుకుంటే ఎలాంటి సంకేతాలు వెళతాయో చెప్పాలంటూ అనకాపల్లి బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ ను స్పీకర్ అయ్యన్నపాత్రుడు నిలదీసినట్లు చెబుతున్నారు. అయితే తనకేమీ తెలియదని, ఆనంద్ చేరుతున్నట్లు ఒక రోజు ముందే రాష్ట్ర కమిటీ నుంచి తనకు సమాచారం వచ్చినట్లు ఎంపీ సీఎం రమేశ్ చెప్పినట్లు తెలిసింది.
కొద్దిరోజుల క్రితం వరకు వైసీపీలో కొనసాగిన విశాఖ డెయిరీ చైర్మన్ అడారి ఆనంద్ పై విశాఖ ఉమ్మడి జిల్లా టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. టీడీపీకి కంచుకోటలాంటి డెయిరీపై ఇంకోపార్టీ జెండా ఎగరడాన్ని తొలి నుంచి టీడీపీ పెద్దలు జీర్ణించుకోలేకపోతున్నారు. విశాఖ డెయిరీలో అడారి కుటుంబం పెద్దరికం కొనసాగేలా తామంతా సహకరిస్తే, ఆనంద్ కుమార్ తన స్వార్థం కోసం వైసీపీలోకి వెళ్లిపోయాడని, గత ప్రభుత్వంలో టీడీపీ మద్దతుదారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేశాడని టీడీపీ నేతలు చెబుతున్నారు.
అలాంటి వ్యక్తి తిరిగి పార్టీలోకి వస్తామంటే క్యాడర్ అంగీకరించడదే ఉద్దేశంతోనే తాము తిరస్కరించామని, పైగా తన అవినీతి మరక కూటమి ప్రభుత్వానికి అంటించే అవకాశం ఉందని వద్దన్నామని, కానీ బీజేపీ మాత్రం ఎలాంటి ఆలోచన లేకుండా చేర్చుకోవడం సరికాదని టీడీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడైతే బీజేపీ నిర్ణయాన్ని సూటిగా ప్రశ్నిస్తూ టీడీపీ, బీజేపీ ముఖ్యనేతలను నిలదీస్తున్నట్లు సమాచారం.
అయ్యన్న ఆగ్రహాన్ని, ఆవేదనను అర్థం చేసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఈ విషయాన్ని బీజేపీ పెద్దల దృష్టికి తీసుకువెళతానని అయ్యన్నకు నచ్చజెప్పినట్లు సమాచారం. ఇక విశాఖ టీడీపీ నేతలు సైతం ఇదే అభిప్రాయంతో ఉన్నట్లు చెబుతున్నారు. టీడీపీలో అడారి కుటుంబానికి ఎంతో ప్రాధాన్యమిస్తే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వెళ్లిపోయారని, ఇప్పుడు మళ్లీ ప్రభుత్వంలోకి రావడంతో అధికారం పంచన చేరేందుకు ప్రయత్నించారని చెబుతున్నారు. అంతేకాకుండా అడారిపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఉన్నాయని, ఇప్పటికే శాసనసభాపక్ష విచారణ జరుగుతుండగా, మధ్యలో కూటమిలోకి రావడంతో ప్రజలకు ఎలాంటి సమాధానం చెప్పాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మొత్తానికి టీడీపీ నేతల వైఖరి చూస్తుంటే, అడారి బీజేపీలో చేరినా ఆయనపై విచారణను కొనసాగించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయంటున్నారు. ఏ విచారణలను అయితే అడ్డుకోవాలనే ఉద్దేశంతో ఢిల్లీ పెద్దల ఆశీస్సులతో కమలం కండువా కప్పుకున్న డెయిరీ చైర్మన్ ఆనంద్ కుమార్ ఇప్పుడు టీడీపీ నేతల ఆగ్రహాన్ని ఎలా చల్లార్చుతారనేది ఆసక్తి రేపుతోంది. ఏదిఏమైనా విశాఖ డెయిరీ ఎపిసోడ్ పొలిటికల్ గా ఇంట్రెస్టింగ్ గా మారింది.