కేసీఆర్ స‌ర్కారులో ఐపీఎస్‌లు డమ్మీలట...ఎవ‌రంటున్నారంటే

Update: 2022-04-27 07:30 GMT
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప‌రిపాల‌న విధానం గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. త‌న‌దైన శైలిలో ఆయ‌న ముందుకు వెళుతుంటారు. తాజాగా అట్ట‌హాసంగా నేడు టీఆర్ఎస్ ప్లీనరీ నిర్వ‌హించ‌నున్నారు. పార్టీ పండుగా సందర్భంగా హైదరాబాద్ గులాబీమయమైంది.

సిటీలో ఎక్కడ చూసినా ఆ పార్టీ బ్యానర్లు, ఫ్లెక్సీలు, కటౌట్లే కనిపిస్తున్నాయి. అయితే, ఈ ప్లీన‌రీ స‌మ‌యంలోనే ఓ ఐపీఎస్ తీరు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఆయ‌నే జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విశ్వజిత్.

గులాబీ పార్టీ ప్లీనరీ కోసం పెద్ద ఎత్తున ఫ్లెక్సీల ఏర్పాటు, మ‌రికొన్నిచోట్ల ట్రాఫిక్ సిగ్నల్స్కు అడ్డంగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. సిటీ అంతటా మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు ఫ్లెక్సీలు భారీగా పెట్టారు. సిటీలో ఎటు చూసినా గులాబీ పార్టీ ఫ్లెక్సీలు, బ్యానర్లే కనిపిస్తున్నాయి.

టీఆర్ఎస్ ప్లీనరీ సందర్భంగా సిటీ అంతటా బ్యానర్లు ఏర్పాటు చేయడంపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలో టీఆర్ఎస్ పార్టీ బ్యానర్లు పెట్టినప్పుడల్లా జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విశ్వజిత్ లీవ్ లో వెళ్తున్నారని అన్నారు.

గతంలో కూడా ఆ పార్టీ బ్యానర్లు, కటౌట్లు పెట్టినప్పుడు ఆయన సెలవుపై వెళ్లిపోయిన విషయాన్ని రాజాసింగ్ గుర్తు చేశారు. బహుశా బీజేపీ ప్రశ్నిస్తుందనే కారణంతోనే ఆయన లీవ్ పెట్టి వెళ్లిపోతుండొచ్చని అన్నారు.

నగరంలో ఫ్లెక్సీలు, బ్యానర్లు పెడితే తొలగిస్తామని చెప్పిన మంత్రి కేటీఆర్.. జీవో కూడా విడుదల చేశారని రాజాసింగ్ అన్నారు. దాన్ని చూపుతూ గతంలో బీజేపీ బ్యానర్లు తొలగించినట్లు చెప్పారు. ఆ జీవో కేవలం బీజేపీకి మాత్రమే వర్తిస్తుందేమోనని సందేహం వ్యక్తంచేశారు. వాటిని చూస్తే సదరు జీవో టీఆర్ఎస్కు వర్తించదేమోనన్న అనుమానం కలుగుతోందని అన్నారు. ఐపీఎస్‌లు అంటే టీఆర్ఎస్ పార్టీ పాల‌న‌లో డ‌మ్మీలుగా మారిపోయార‌ని మండిప‌డ్డారు.
Tags:    

Similar News