ఛీ.. ఛీ.. టిక్కెట్ల బుకింగ్ లోనూ ఆంక్షలేనా?

Update: 2016-01-29 05:55 GMT
ఒకటి తర్వాత ఒకటిగా రైల్వేశాఖ తీసుకుంటున్న చర్యలు చూస్తే.. దేశ ప్రజల మీద రైల్వేశాఖ ఏమైనా పగబట్టిందా? అన్న ప్రశ్న ఉదయించక మానదు. ఒకటి కాదు రెండు కాదు.. ఈ మధ్య కాలంలో తరచూ తీసుకుంటున్న నిర్ణయాల్ని పరిశీలిస్తే.. రైల్వే ప్రయాణికుల మీద రైల్వేశాఖ గుర్రుగా ఉందనిపించక మానదు. సౌకర్యాల లేమి.. డిమాండుకు తగినన్ని రైళ్లను ఇవ్వలేని రైల్వే శాఖ.. ప్రతి నెలా ఏదో ఒక కొత్త నిర్ణయం తీసుకొని ప్రయాణికుల మీద భారం మోపటమో.. లేదంటే పరిమితులు విధంచటమో చేస్తోంది. తాజాగా అలాంటి నిర్ణయమే మరొకటి తీసుకుంది.

ఆన్ లైన్లో రైల్వే టిక్కెట్లను బుక్ చేసుకోవాలంటే ఐఆర్ సీటీసీ ద్వారా బుక్ చేసుకునే వీలుంది. ఇప్పటివరకూ నెలకు పది టిక్కెట్లు (ఒక్కో టిక్కెట్లో గరిష్ఠంగా ఆరుగురు వరకూ) టిక్కెట్లు బుక్ చేసుకునే వెసులుబాటు ఉంది. దీనిపై తాజాగా ఆంక్షలు విధించింది రైల్వే శాఖ. ఫిబ్రవరి 15 నుంచి వెబ్ సైట్ ద్వారా కేవలం ఆరు టిక్కెట్లు మాత్రమే కొనుగోలు చేసే వీలుంది. తాజా ఆంక్షల నేపథ్యంలో ఏదైనా అత్యవసరం మీద ఎక్కువ టిక్కెట్లను కొనుగోలు చేసే వారికి ఇబ్బందులు తప్పవు.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఐఆర్ సీటీసీ ద్వారా టిక్కెట్లు కొనుగోలు చేసే వారిలో 90 మంది 6 టిక్కెట్ల కంటే తక్కువగానే కొనుగోలు చేస్తున్నారు . కేవలం పది శాతం కంటే తక్కువ మంది మాత్రమే భారీగా కొనుగోలు చేస్తున్నట్లు గుర్తించారు. ఈ పదిశాతం మందిని నియంత్రించేందుకు 90 శాతం మంది కొనుగోళ్లపై ఆంక్షలు విధించటమేందో రైల్వే శాఖకే తెలియాలి. నిజంగా కొందరు గుట్టుగా టిక్కెట్లను గంపగుత్తగా కొట్టేస్తున్నారంటే వారికి గుర్తించి.. వారిపై చర్యలు తీసుకోవాలే కానీ.. ఉత్త పుణ్యానికి దేశ ప్రజల్ని ఇబ్బంది పెట్టేలా నిర్ణయం తీసుకోవటం ఐఆర్ సీటీసీకి తగదన్న విషయాన్ని మర్చిపోకూడదు
Tags:    

Similar News