హైద‌రాబాద్‌లో కేఏ పాల్ స‌భ‌కు 28 మంది ప్ర‌ధానులు వ‌స్తున్నారా?

Update: 2022-09-03 06:37 GMT
సీరియ‌స్ పాలిటిక్స్‌లో ఆట‌లో అర‌టి పండు, క‌మెడియ‌న్‌గా ప్ర‌జా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ను అంద‌రూ భావిస్తున్నారంటే అతిశ‌యోక్తి కాదు. ఆయ‌న చేసే వ్యాఖ్య‌లు, ఇచ్చే హామీలు న‌మ్మ‌శ‌క్యం కాదు కాబ‌ట్టి ఆయ‌న మాట‌ల‌ను అంతా లైట్ తీసుకుంటూ ఉంటారు. కాబోయే తెలంగాణ ముఖ్య‌మంత్రిని తానేన‌ని, జ‌గ‌న్ త‌న పార్టీలో చేరితే ప్ర‌ధానిని చేస్తాన‌ని, ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న పార్టీలో చేరితే ఏపీ ముఖ్య‌మంత్రిని చేస్తాన‌ని కేఏ పాల్ చెప్పే మాట‌ల‌కు ప‌గ‌ల‌బ‌డి న‌వ్వుకునేవారే ఎక్కువ‌.

అయినా కేఏ పాల్ త‌న‌పై వ‌చ్చే మీమ్స్‌కు, సెటైర్ల‌ను పెద్ద‌గా ప‌ట్టించుకోరు. య‌థాలాపంగా తాను చెప్పాల‌నుకున్న‌ది చెప్పే తీరతారు. దేశంలో వ‌చ్చే పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో 175 స్థానాల్లో పోటీ చేస్తాన‌ని ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు.. కేఏ పాల్. తాజాగా మ‌రోమారు కేఏ పాల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. హైద‌రాబాద్‌లో అక్టోబ‌ర్ 2న జింఖాన గ్రౌండులో ప్ర‌పంచ శాంతి స‌మావేశాలు నిర్వ‌హిస్తున్నాన‌ని తెలిపారు. ఈ స‌భ‌ల‌కు ఏకంగా 28 దేశాల ప్ర‌ధాన‌మంత్రులు వ‌స్తున్నార‌ని వెల్ల‌డించారు. కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల కూడా త‌న త‌ర‌ఫున‌ అందర్ని ఆహ్వానించార‌ని కేఏ పాల్ తెల‌ప‌డం విశేషం.

మాజీ కేంద్ర మంత్రి మేనకాగాంధీ కుమారుడు బీజేపీ ఎంపీ అయిన‌ వరుణ్ గాంధీని కూడా ప్రపంచ శాంతి స‌భ‌ల‌కు ఆహ్వానించాన‌ని కేఏ పాల్ తెలిపారు. అయితే వరుణ్ గాంధీని రావద్దని తెలంగాణ‌ మంత్రి కేటీఆర్ చెప్పారని బాంబు పేల్చారు. స్వయంగా వరుణ్ గాంధీనే త‌నకు ఈ విషయాన్ని చెప్పార‌ని కేఏ పాల్ చెబుతున్నారు.

పనిలో పనిగా ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పై కూడా కేఏ పాల్  మండిప‌డ్డారు. ప్రశాంత్ కిషోర్ పొలిటికల్ ప్రాసిట్యూట్‌ అని కేఏ పాల్ సంచలన వ్యాఖ్య‌లు చేశారు. కాంగ్రెస్ పార్టీని బ‌ల‌హీన‌ప‌ర్చ‌డానికి కేసీఆర్ ను వాడుకుంటున్నారని విమ‌ర్శించారు.

అక్టోబర్ లో తాను నిర్వ‌హించ‌నున్న‌ ప్రపంచ శాంతి సమావేశాలను అడ్డుకునేందుకు సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని కేఏ పాల్ ఆరోపించారు. శాంతి సభల‌ను అడ్డుకునే వారు దేశ, రాష్ట్ర ద్రోహులని మండిప‌డ్డారు. శాంతి సభల‌ను అడ్డుకునే వారు దేవుడి శాపానికి గురవుతారని కేఏ పాల్ శపించారు.

మునుగోడులో జ‌రిగే ఉప ఎన్నిక‌లో బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నిక‌ల సంఘాన్ని కోరానన్నారు. ఈ మేర‌కు కేంద్ర ఎన్నికల కమిషనర్ ను స్వయంగా కలిసి విజ్ఞప్తి చేశానని కేఏ పాల్ వెల్లడించారు. హైదరాబాద్ లో త‌న‌కు ఓటర్ ఐడీ కార్డు ఇప్పించాలని కోరానని తెలిపారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News