ఏపీలో ఆ వివాదాస్ప‌ద మాజీ ఎమ్మెల్యే స‌ర్వే నిజ‌మేనా?

Update: 2022-08-20 08:42 GMT
ఫేక్ పోస్టులు ఆయా పార్టీల నేత‌ల‌ను ఇబ్బంది పెడుతున్నాయి. ముఖ్యంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో టీడీపీ నేత‌లు ఈ ఫేక్ పోస్టులు, ఫేక్ కామెంట్ల బారిన‌ప‌డుతున్నారు. వాళ్లు అన‌ని మాట‌ల‌ను అన్న‌ట్టు, వారి సొంత సోష‌ల్ మీడియా ఖాతాల ద్వారా కామెంట్లు చేసిన‌ట్టు పోస్టుల‌ను ప్ర‌త్య‌ర్థి పార్టీ వైర‌ల్ చేస్తోంద‌ని విమ‌ర్శ‌లు ఉన్నాయి. అందులోనూ ఆయా నేత‌లు వారి సొంత సోష‌ల్ మీడియా ఖాతాల ద్వారానే కామెంట్లు చేసిన‌ట్టు.. ఇవి వారి అధికారిక ఖాతాలే అన్న‌ట్టు వారి పేర్ల ప‌క్క‌నే బ్లూ టిక్కు ఉండేట‌ట్టు జాగ్ర‌త్త ప‌డుతున్నారు. అయితే వీటిని ఎప్ప‌టిక‌ప్పుడు ఫ్యాక్ట్ చెక్ పేరుతో టీడీపీ ఖండిస్తూ వ‌స్తోంది.

తాజాగా శ్రీకాకుళం జిల్లా ఆమ‌దాల‌వ‌ల‌స టీడీపీ నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్ కూన ర‌వికుమార్ చేసిన‌ట్టు చెబుతున్న వ్యాఖ్య‌లు వైరల్ అయ్యాయి. ఆ ఫేక్ పోస్టు ఇలా ఉంది.. 'టీడీపీ మాజీ ఎమ్మెల్యే కూన రవి కుమార్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 'రాబోయే రోజుల్లో జగన్‌ రాక్షస పాలన అంతం అవ్వడం ఖాయం. అందుకోసమే మన నాయకుడు చంద్రబాబు కూడా పవన్‌ కళ్యాణ్‌‌ని కలుపుకోడానికి ప్రయత్నిస్తున్నాడు.. అవసరం అయితే జనసేన పార్టీకి 15 ఎమ్మెల్యే సీట్లు, 2 ఎంపీ సీట్లు ఆఫర్‌ చేయడానికి చంద్రబాబు సిద్దంగా ఉన్నారు'.. ఇదీ ఫేక్ పోస్టు.

కూన రవికుమార్ చేసిన వ్యాఖ్యల్ని దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సమర్థించినట్లు మరో పోస్ట్ వైరల్ అయ్యింది. ఈ ఫేక్ పోస్టు ప్ర‌కారం.. జగన్‌ పాలన అంతమవ్వాలంటే విపక్ష పార్టీలన్నీ త్యాగాలకు సిద్ధపడాలి. దీనికి సంబంధించి మేము చేయించిన వివిధ సర్వేలలో జనసేన 15, బీజేపీ 4 ఎమ్మెల్యే స్థానాలలో బలంగా ఉన్నాయి. ఇప్పటికే ఈ సమాచారాన్ని ఆయా పార్టీల అధినాయకత్వానికి అందించాం. కాబట్టి ఎవరి బలాన్ని బట్టి వాళ్ళు పోటీ చేస్తే ఫలితాలు ఆశాజనకంగా వస్తాయి'... ఇదీ చింత‌మనేని పేరుతో వైర‌ల్ అవుతున్న ఫేక్ పోస్టు.

ఈ నేప‌థ్యంలో టీడీపీ.. టీడీపీ ఫ్యాక్ట్ చెక్ పేరుతో ట్విట్ట‌రులో స్ప‌ష్ట‌త ఇచ్చింది. ఈ ఫేక్ పోస్టులు అబ‌ద్ధ‌మ‌ని తెలిపింది. లేని గుండెపోటుని ఉందని, ఉన్నా వీడియో తనది కాదని, బుకాయించే చిల్లర కూలీలకు అనని మాటలు అన్నారని సృష్టించడం ఎంతసేపు..!! అంటూ టీడీపీ ప‌రోక్షంగా ఈ ఫేక్ పోస్టులు వైర‌ల్ చేస్తోంది.. వైఎస్సార్సీపీయేన‌ని తేల్చిచెప్పింది.

అలాగే ఈ ఫేక్ పోస్టును చింత‌మనేని ప్ర‌భాక‌ర్ కూడా ఖండించారు. త‌న పేరుతో వ‌చ్చిన స‌ర్వే అన్న‌ది పేటీఎం కూలీలు అల్లిన అబద్ధ‌పు మాట‌ల‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. అలాగే కూడుకి చిల్ల‌ర లేక‌పోతే చింత‌ల‌పూడి రండిరా.. కూలీలు. క‌డుపు నిండా అన్నం పెట్టి పంపిస్తా.. ఇలా ఫేక్ కూత‌లు కూయొద్దు అని తీవ్ర స్థాయిలో చింత‌మనేని మండిప‌డ్డారు.

కాగా గ‌త కొంత‌కాలంగా టీడీపీకి ఫేక్ పోస్టుల బాధ త‌ప్ప‌డం లేదు. ఇటీవ‌ల ఆ పార్టీ సీనియ‌ర్ నేత గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి, టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడు, విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నాని, తదిత‌రుల పేర్ల‌తోనూ ఫేక్ పోస్టులు వైర‌ల్ అయ్యాయి. వీటిని ఆయా నేత‌లు ఖండించిన సంగ‌తి తెలిసిందే.
Tags:    

Similar News