రిజర్వుడు నియోజకవర్గాలే బీజేపీ టార్గెట్టా ?

Update: 2022-01-22 00:30 GMT
బీజేపీ చీఫ్ బండి సంజయ్ ప్లాన్ ఏమిటో అర్థం కావటం లేదు. రాబోయే ఎన్నికల్లో రిజర్వుడు నియోజకవర్గాల్లో గెలవటమే టార్గెట్ గా బండి ప్లాన్ చేస్తున్నారు. రాష్ట్రంలో 19 ఎస్సీ, 12 ఎస్టీ నియోజకవర్గాలున్నాయి. ఈ నియోజకవర్గాలపై బండి పార్టీ నేతలతో సమీక్షలు నిర్వహించారు. రిజర్వుడు నియోజకవర్గాల్లో గెలవాల్సిన అవసరాన్ని ప్రత్యేకంగా చెబుతున్నారు. రాష్ట్రం మొత్తం మీద 119 నియోజకవర్గాలుంటే కేవలం రిజర్వుడు నియోజకవర్గాలపైన మాత్రమే బండి ఎందుకింత దృష్టి పెడుతున్నారు ?

రిజర్వుడు నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ కు కానీ లేకపోతే కాంగ్రెస్ కు కానీ వచ్చే ఎన్నికల్లో గెలిచే అవకాశాలు లేవని బండి అనుకుంటున్నారా ? మొదటి నుండి రిజర్వుడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి మంచి పట్టుంది. తర్వాత టీడీపీ వచ్చిన తర్వాత కొన్ని నియోజకవర్గాలు ఆ పార్టీ ఖాతాలో కూడా పడ్డాయి. 2014 రాష్ట్ర విభజన తర్వాత కూడా రిజర్వుడు నియోజకవర్గాలను కాంగ్రెస్, టీడీపీలు గెలుచుకున్నాయి.

అయితే కేసీయార్ అమలు చేసిన  ఫిరాయింపుల కారణంగా కాంగ్రెస్ దెబ్బతినగా టీడీపీ దాదాపు తుడిచిపెట్టుకుపోయింది.ఈ కారణంగానే రిజర్వుడు నియోజకవర్గాల్లో కూడా కొన్నింటిని టీఆర్ఎస్ తన ఖాతాలో వేసుకుంది. అంటే ఏ విధంగా చూసినా రిజర్వుడు నియోజకవర్గాలు మొదటినుండి బీజేపీకి దూరమనే చెప్పాలి. ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఏ నాలుగో ఐదు గెలుస్తుండేదంతే. వీటిల్లో రిజర్వుడు నియోజకవర్గం ఒక్కటి కూడా ఉండేదికాదు.

అలాంటిది ఇపుడు కొత్తగా రిజర్వుడు నియోజకవర్గాలన్నింటిలోను బీజేపీ గెలవాలనే నినాదాన్ని బండి కొత్తగా ఎత్తుకున్నారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చేసినట్లే అన్నంతగా బిల్డప్ ఇస్తున్నారు కమలనాదులు. మరి ఎంతవరకు నిజమనేది పక్కనపెడితే అన్నీ నియోజకవర్గాల్లోను పోటీ చేయటానికి గట్టి అభ్యర్ధులు దొరకుతారా అన్నదే అనుమానం. మొన్న గెలిచిన దుబ్బాక, హుజూరాబాద్ నియోజకవర్గాలను నిలబెట్టుకుంటే అదే పదివేలు. అందుకనే బండి కూడా ప్లాన్ మార్చి రిజర్వుడు నియోజకవర్గాలపై టార్గెట్ పెట్టినట్లున్నారు. మరి బండి ప్లాన్ ఎంతవరకు వర్కవుటవుతుందో చూడాలి.
Tags:    

Similar News