వైర‌స్‌ కు దేశాధ్య‌క్షుడు బ‌లి? క‌ప్పిపుచ్చుతున్న బురుండి దేశం

Update: 2020-06-11 02:30 GMT
మహ‌మ్మారి వైర‌స్‌కు ప్ర‌జ‌ల‌తో పాటు ప్ర‌ముఖులు, సెల‌బ్రిటీలు, రాజులు, మంత్రులు, సైనికులు ఇలా అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు బ‌ల‌వుతున్నారు. ఆ వైర‌స్ బారిన ప‌డి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప‌రిస్థితులు. ప్ర‌స్తుతం ఆ వైర‌స్ కొన్ని దేశాల్లో తీవ్రంగా విజృంభిస్తోంది. ఈ క్ర‌మంలో ఓ దేశాధ్య‌క్షుడు కూడా బల‌య్యాడ‌ని తెలుస్తోంది. ఆ వైర‌స్‌తో బాధ‌ప‌డుతూ మృతి చెందాడ‌నే వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. దీంతో ఆ దేశంలో ప‌రిస్థితులు భ‌యాందోళ‌న‌గా మారాయి.

ఆఫ్రికా ఖండంలో బురుండి అనే ఓ దేశం ఉంది. ఆ దేశ అధ్యక్షుడు ఎన్. కురుంజిజా (55). అతడు బుధవారం మరణించినట్లు ఆ దేశ అధికారులు ప్రకటించారు. శనివారం (జూన్ 6) స్వల్ప అనారోగ్యంతో ఆయ‌న ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందిన అనంత‌రం పూర్తిగా కోలుకున్నారు. అయితే బుధ‌వారం అక‌స్మాత్తుగా కురుంజిజా మరణించాడ‌ని వైద్యులు ప్రకటించారు. చికిత్స పొందుతున్న స‌మ‌యంలో అత‌డు గుండెపోటుకు గుర‌వ‌డంతో ప‌రిస్థితి విష‌మించి మరణించినట్లు వైద్యులు చెబుతున్నారు. అయితే ఇది అవాస్త‌వ‌మ‌ని, ఆయనకు మ‌హ‌మ్మారి వైరస్ సోకిందనే వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇటీవల కురుంజిజా భార్యకు పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం ఆమె కెన్యాలోని ఆగాఖాన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. భార్య ద్వారా భ‌ర్త కురుంజిజాకు వైర‌స్ సంక్ర‌మించి ఉంటుంద‌ని, ఈ క్రమంలోనే అనారోగ్యానికి గురై కురుంజిజా మృతి చెందాడ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే ఆ దేశ ప్ర‌భుత్వం మాత్రం గుండెపోటుతోనే మృతి చెందాడ‌ని ప్ర‌క‌టించింది.
Tags:    

Similar News