కాంగ్రెస్ పార్టీకి గాంధీ ఫ్యామిలీయే దిక్కా?

Update: 2022-09-20 04:55 GMT
పేరుకు మాత్రమే పార్టీలో సంస్థాగత ఎన్నికలు. కానీ జరిగేదంతా ఏకగ్రీవమే. అందులోను గాంధీల కుటుంబంలోని వారు తప్ప ఇంకెవరికీ పార్టీ పగ్గాలు అందుకునే అర్హత లేదన్నట్లుగా నేతలు కూడా తయారైపోయారు.

సీనియర్లలో ఎవరైనా అధ్యక్ష పదవికి పోటీ చేయాలని అనుకున్నా మిగిలిన సీనియర్లు ఏదో పద్దతిలో ఉత్సాహం, ప్రయత్నాలపై నీళ్ళు చల్లేస్తున్నారు. ఇపుడిదంతా ఎందుకంటే కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ విషయంలోనే.

ఒకవైపు అధ్యక్ష పదవికి కేంద్ర మాజీమంత్రి, సీనియర్ నేత శశిథరూర్ రెడీ అవుతున్నారు. సోనియాగాంధీతో భేటీ అయి ఆమె ఆమోదం కూడా తీసుకున్నారు. ఇదే సమయంలో రాహుల్ గాంధీనే అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు ఏర్పాట్లు జరిగిపోతున్నాయి.

అన్నీ పీసీసీల నుండి రాహుల్ కు మద్దతుగా ఏకగ్రీవ తీర్మానాలు అందుతున్నాయి. పార్టీ అధికారంలో ఉన్న ఛత్తీస్ ఘడ్, రాజస్ధాన్ పీసీసీలు రాహుల్ కే మద్దతు పలుకుతు తీర్మానాలు ఏఐసీసీకి పంపాయి. దాంతో మిగిలిన పీసీసీలు కూడా అదే దారిలో నడుస్తున్నాయి.

ఒకవైపు ఎన్నికల నిర్వహణకు  ఏఐసీసీ ఎన్నికల కమిటీ ఏర్పాట్లు చేస్తుంటే మరోవైపు రాహుల్ కే మద్దతుగా పీసీసీలు తీర్మానాలు చేసి పంపటం ఏమిటో అర్ధం కావడం లేదు. పీసీసీలన్నీ రాహుల్ కు మద్దతుగా తీర్మానాలు చేస్తే ఇక ఎన్నికలు ఏమి జరుగుతాయి ? ఎవరు పోటీ చేయగలుగుతారు ? ఏకగ్రీవంగా ఎన్నుకుంటే ఇక ప్రజాస్వామ్య స్పూర్తితో ఎన్నికలు జరిగినట్లు ఎలాగవుతుంది ? 1991-96 మధ్యలో మాత్రమే పార్టీ పగ్గాలు పీవీ నరసింహారావు చేతిలోకి వచ్చింది. అంతకుముందు ఆ తర్వాత షరా మామూలుగానే పార్టీ పగ్గాలు గాంధీ కుటుంబం చేతిలో ఉన్నాయి.

గాంధీ కుటుంబం ఛాయల్లో నుంచి పార్టీ బయటకు రావాలని పలువురు సీనియర్లు చేస్తున్న డిమాండ్లు అందరికీ తెలిసిందే. కానీ డిమాండ్లు డిమాండ్లుగానే మిగిలిపోతున్నాయి. ప్రజాస్వామ్యబద్దంగా రాహూల్ తో పాటు ఇంట్రస్టున్న నేతలు పోటీచేస్తే అది ప్రజాస్వామ్యం అనిపించుకుంటుంది. ఇతర నేతలకు పదిఓట్లే వచ్చినా అసలు రాకపోయినా కూడా పర్వాలేదు ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికలు జరిగాయని అనుకుంటారందరు.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News