గ్రేటా థన్ బెర్గ్..బాలయ్య సినిమాను నిజం చేసిందా?

Update: 2019-11-21 13:32 GMT
పర్యావరణ పరిరక్షణ కోసం లక్షల గొంతులకను ఏకం చేసిన స్వీడన్ కు చెందిన క్లైమేట్ ఛేంజ్ కార్యకర్త గ్రేటా థన్ బెర్గ్ కు సంబంధించి ఇప్పుడు సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన ఆసక్తికర విషయం... టాలీవుడ్ లో అప్పుడెప్పుడో నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన ‘ఆదిత్య 369’ను గుర్తు చేసిందని చెప్పక తప్పదు. బాలయ్య సినిమాలో టైమ్ మెషీన్ తో గతంలోకి వెళ్లడంతో పాటుగా భవిష్యత్తులోకి కూడా వెళ్లి ఆయా కాలమాన పరిస్థితులను చూపించే యత్నం చేశారు. ఇప్పుడు గ్రేటా కూడా రీల్ బాలయ్య మాదిరే రియల్ లైఫ్ లో భవిష్యత్తులోకి వచ్చేసిందట. అది కూడా ఏకంగా 121 ఏళ్ల ముందుకు గ్రేటా ఎంట్రీ ఇచ్చేసిందని ఇప్పుడు ఓ ఆసక్తికర చర్చ జరుగుతోంది.

ఆ వివరాల్లోకి వెళితే.... ప్రస్తుతం 16 ఏళ్ల వయసున్న గ్రేటా... పర్యావరణ పరిరక్షణ కోసం తనదైన శైలిలో పోరాటం సాగిస్తోంది. పర్యావరణంపై ఆ బాలిక చేస్తున్న ప్రసంగాలు దేశాధినేతలనే నివ్వెరపరుస్తున్నాయి. వెరసి క్లైమేట్ ఛేంజర్ గా బిరుదును సొంతం చేసుకున్న గ్రేటా... ప్రపంచంలోని దాదాపుగా అన్ని దేశాల వాసులకు చిరపరచితురాలిగానే మారిపోయింది. ఇలాంటి నేపథ్యంలో సరిగ్గా 121 ఏళ్ల క్రితం 1898లో కెనడాలోని యుకాన్‌ టెరిటరీలో ఇద్దరు పిల్లలతో కలిసి ఓ బాలిక ఓ బావి నుంచి నీళ్లు తోడుతున్న ఫొటో అందరినీ ఆశ్యర్యానికి గురి చేసింది. ఇప్పటి గ్రేటా, 1898నాటి ఫొటోలో ఉన్న బాలిక అచ్చుగుద్దినట్టుగా ఒకేలా ఉండటం ఈ ఆసక్తికి కారణంగా నిలుస్తోంది. వాషింగ్టన్‌ యూనివర్సిటీ పురావస్తు విభాగంలో లభించిన నాటి ఫొటోను యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో పోస్ట్‌ చేయగా, అచ్చంగా ఆమె మన గ్రేటాలాగా ఉందంటూ మరో నెటిజన్‌ రెండు ఫొటోలను కలిపి పోస్ట్‌ చేయడంతో... ఇప్పుడా రెండు ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

ఈ ఫొటోలపై నెటిజన్లు కూడా తమదైన శైలి కామెంట్లు సంధిస్తున్నారు. ‘నిజంగా ఆమె టైమ్‌ ట్రావెలర్‌. మన భవిష్యత్తు రక్షించేందుకు గతం నుంచి ఆమె భవిష్యత్తులోకి వచ్చారు. బ్యాక్‌ టు ది వ్యూచర్‌ సినిమా ఇది సాధ్యమని చెబుతోంది’ అని ఓ నెటిజన్ ట్వీట్‌ చేయగా - పలువురు ఆయనతో ఏకీభవిస్తూ ట్వీట్‌ చేస్తున్నారు. ‘ఇదంతా ట్రాష్‌. కాకమ్మ కథలు మేము నమ్మం’ అన్నంటున్న వాళ్లు లేకపోలేదు. బాలయ్య సినిమాలో కూడా సరిగ్గా ఇలాగే... టైమ్ మెషీన్ లోకి వెళ్లిన హీరో హీరోయిన్లు తొలుత గతంలోకి వెళ్లి... శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఆడిపాడగా... ఆ తర్వాత భవిష్యత్తులోకి వచ్చి అత్యంత వేడి వాతావరణంతో భూమండలమంతా అగ్గిలా మారిపోగా... మనుషులంతా వ్యోమగాముల మాదిరిగా మారిపోయిన సన్నివేశాలను చూపించిన విషయం తెలిసిందే కదా.
    

Tags:    

Similar News