బ్లాక్ ఫంగస్ కు అదే కారణమా?

Update: 2021-05-30 00:30 GMT
ఓ వైపు కరోనా.. మరోవైపు బ్లాక్ ఫంగస్.. దేశ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇవి చాలవన్నట్టుగా వైట్ ఫంగస్, ఎల్లో ఫంగస్ కేసులు దడ పుట్టిస్తున్నాయి. ప్రపంచంలో ఎక్కడా లేని బ్లాక్ ఫంగస్ కేసులు మన దేశంలో అత్యధికంగా ఎందుకు నమోదవుతున్నాయనే చర్చ జరుగుతోంది.

దేశంలో మే 28నాటికి 12 వేల బ్లాక్ ఫంగస్ కేసులు నమోదైనట్టు కేంద్రం వెల్లడించింది. మామూలు రోజుల్లో ఏడాదికి 100 కేసులు నమోదవుతున్నట్టు వైద్య నిపుణులు చెబుతున్నారు. కానీ కరోనాతో రోజుకు 700పైగా కేసులు నమోదవుతుండడం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది.

ఇప్పటికే బ్లాక్ ఫంగస్ పై కర్ణాటక ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది. రోగుల కేస్ హిస్టరీని వైద్యుల బృందం పరిశీలిస్తోంది.  ఈ ప్రాణాంతక వ్యాధికి కారణాలు ఏమై ఉండొచ్చని అధ్యయనం జరుపుతోంది.

ఇక ఆక్సిజన్ సిలిండర్ల ద్వారానే బ్లాక్ ఫంగస్ సోకుతుందేమోన్న అనుమానాన్ని వైద్యులు, నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై నిజనిజాలు తేలాల్సి ఉంది. అధ్యయనం తర్వాతే అసలు నిజాలు వెల్లడికానున్నాయి.

ఇక ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మాత్రం కోవిడ్ వ్యాధికి వాడుతున్న జింక్, ఐరన్ ఔషధాల వల్ల కూడా బ్లాక్ ఫంగస్ సోకే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఇక ఇండస్ట్రీయల్ ఆక్సిజన్ సిలిండర్ల ద్వారా బ్లాక్ ఫంగస్ సోకుతోందని ముంబై డాక్టర్లు అనుమానపడుతున్నారు. నాణ్యత లేని ఆక్సిజన్ సిలిండర్ల ద్వారా బ్లాక్ ఫంగస్ సోకుతోందని బెంగళూరు వైద్యులు చంద్రప్రసాద్ అభిప్రాయపడ్డారు.  

అయితే మెడికల్ ఆక్సిజన్ ను ఫంగస్ లేకుండా ఫిల్టర్ చేస్తారని.. ఇండస్ట్రీయల్ ఆక్సిజన్ తయారీకి ఇలాంటి జాగ్రత్తలు తీసుకోరని శుభ్రపరచని సిలిండర్ల ద్వారా బ్లాక్ ఫంగస్ సోకే అవకాశాలున్నాయని నిఫుణులు అభిప్రాయపడుతున్నారు.

అయితే ఆక్సిజన్ సిలిండర్ల ద్వారా బ్లాక్ ఫంగస్ సోకుతుందనేది కేవలం వైద్యుల అనుమానాలు మాత్రమే. దీనిపై శాస్త్రీయ అధ్యయనం తర్వాతనే బ్లాక్ ఫంగస్ ఎలా సోకుతుందనేది తేలనుంది. అప్పటివరకు ఇదంతా ఊహాగానాలుగానే భావించాల్సి ఉంటుంది. 
Tags:    

Similar News