జగన్ తో కోటం రెడ్డి...క్లాస్ పీకుడు స్టార్ట్ అయిందా... ?

Update: 2023-01-02 13:38 GMT
వైసీపీలో కాంగ్రెస్ ఉంది. అంటే కాంగ్రెస్ కల్చర్ ఉంది అని అర్ధం. కాంగ్రెస్ పార్టీ అయితే అది చెల్లుతుంది. ఎందుకంటే జాతీయ పార్టీ. లోకల్ గా లీడర్స్ ఒకరిని ఒకరు ఎంత విమర్శించుకున్నా అక్కడ అది తప్పు కాదు ఒప్పే. పైగా అంతా మావాళ్ళే అని కాంగ్రెస్ అధినాయకత్వం వాళ్ళ గొడవలు చూసి మురిసిపోతుంది. అలా కొట్టుకోవడమే కాంగ్రెస్ లాంటి జాతీయ పార్టీకి అతి పెద్ద బలం. కానీ వైసీపీ లాంటి ప్రాంతీయ పార్టీకి అందునా జగన్ లాంటి నాయకుడు ఉన్న చోట కుదిరే పనేనా.

కానీ వైసీపీలో చాలా మంది కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. వారు తమ పాత వాసనలు వదలలేకపోతున్నారు. తమ మనసుకు ఏది తోస్తే అది వారు బయటపెట్టేస్తున్నారు. కొందరు అయితే మీడియా ముఖంగా వెళ్ళి మరీ రచ్చ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో అయితే కొందరు ఎమ్మెల్యేలు దూకుడు ఎక్కువగా ఉంది. ఈ మధ్యనే మాజీ మంత్రి నెల్లూరు పెద్దాయన ఆనం రామ నారాయణరెడ్డి వైసీపీ ప్రభుత్వం మీద విమర్శల జల్లు ఇండైరెక్ట్ గా కురిపించారు. ఆయనకు ఇది తొలిసారి కాదు, ఇక్కడితో ఆగదు.

అయినా ఆయన విషయంలో వైసీపీ అధినాయకత్వం లైట్ తీసుకుంటోంది. అదే జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్యే ఉన్నారు. ఆయన కోటం రెడ్ది శ్రీధర్ రెడ్డి. ఆయన జగన్ కి సన్నిహితుడే. పార్టీ విపక్షంలో ఉన్నప్పుదు ఆయన నోరే అండగా ఉంది. ఇపుడు అదే నోరు వైసీపీకి మైనస్ అవుతోంది. ఆయన ఆనాడూ నేడూ కూడా ప్రజా సమస్యలను ప్రస్తావిస్తున్నారు. అధికారుల మీద గట్టిగా తగులుకుంటున్నారు.

తన నియోజకవర్గం సమస్యల మీద నిలదీస్తున్నారు. అచ్చం విపక్షం ఎమ్మెల్యే మాదిరిగా మారి నిరసలను తెలియ చేస్తున్నారు. ఉమ్మారెడ్డి గుంట మురుగునీటి కాల్వలో ఈ ఆ మధ్యన ఆయన  బైఠాయించిన విషయం తెలిసిందే. మురుగునీటి కాల్వ సమస్యను పరిష్కరించాలంటూ చాలాకాలం నుంచి డిమాండ్ చేస్తున్నారు అయినప్పటికీ అధికారులు ఏదో ఒక సాకుతో దాటవేస్తోన్నారంటూ కోటంరెడ్డి అప్పట్లో మండిపడ్డారు.

అది హాట్ టాపిక్ అయి మీడియా ఫుల్ ఫోకస్ పెట్టేసింది. ఇక రైల్వే, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఈ సమస్యపై దృష్టి సారించాల్సి ఉందంటూ అప్పట్లోనే మరో సందర్భంలో ఆయన  ధ్వజమెత్తారు. ఇక జిల్లా అభివృద్ధి మండలి సమావేశం రీసెంట్ గా జరిగితే అందులోనూ కోటం రెడ్డి వాయిస్ పెంచి అధికారులను కడిగి పారేశారు. ఇలా తరచూ వార్తలలో వ్యక్తిగా ఉంటూ కోటం రెడ్డి హాట్ హాట్ కామెంట్స్ చేస్తే అధికారుల సంగతి ఏమో కానే ప్రభుత్వానికి అది తెగ ఇబ్బందిగా ఉంది అంటున్నారు.

ఇక కోటం రెడ్డి జోరు ఎంతదాకా వెళ్ళింది అంటే ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి షంషేర్ సింగ్ రావత్ పైనా విమర్శలు గుప్పించారు. తన నియోజకవర్గంలో అనేక సమస్యలు అలా పెండింగ్ లో ఉన్నాయని అభివృద్ధి పనులు నిలిచిపోయాయని కోటం రెడ్డి విమర్శలు చేస్తున్నారు. ఇలా తరచూ కోటం రెడ్డి గొంతు పెంచుతూండడంతో జగన్ ఆయన్ని స్వయంగా పిలిపించుకున్నారు. కోటం రెడ్డికి జగన్ అంటే ఇష్టమే. మా జగన్ సీఎం కావాలని గట్టిగా కోరున్న వారు. అలాంటి నేత ఇపుడు ఇల్లా నోరు పెంచడం మీద కచ్చితంగా మనసులో ఏదో ఉండి ఉంటుంది అనే అంటున్నారు.

అది జగన్ ఆరా తీస్తారు అనే అంటున్నారు. అదే విధంగా ఒకరి తరువాత మరొకరు ఫైర్ బ్రాండ్స్ వైసీపీలో తయారైపోతూ వైసీపీని కాంగ్రెస్ టూ గా మార్చేస్తే జగన్ ఎలా ఊరుకుంటారు అన్న చర్చ వస్తోంది. నోరు పెంచితే క్లాస్ పీకుడే అన్నట్లుగా ఒక కాషన్ ఇవ్వడానికే ముందుగా కోటం రెడ్డిని పిలిచారు అని అంటున్నారు. ఇక మీదట 150 మంది ఎమ్మెల్యేలు ఏమి మాట్లాడాలి అన్నా ప్రభుత్వ సమస్యలు ప్రస్తావించాలన్నా కూడా ఆచీ తూచీ మాట్లాడాలంటూ జగన్ కోటం రెడ్డి వ్యవహారం ద్వారా టోటల్ పార్టీకే ఆదేశాలు జారీ చేయబోతున్నారు అని అంటున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News