జగన్ 'సామాజిక న్యాయం' నిజమేనా?

Update: 2022-06-01 13:30 GMT
ఆంధ్రప్రదేశ్ లో కొద్ది రోజుల క్రితం జగన్ ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మంత్రులు సామాజిక న్యాయభేరి పేరిట బస్సు యాత్ర చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు అన్ని జిల్లాల్లో బస్సులో పర్యటించి మంత్రులు సీఎం జగన్ తమ సామాజికవర్గాలకు న్యాయం చేశారని ఊరూవాడా చెప్పుకున్నారు. సామాజిక న్యాయానికి అసలు సిసలు నిర్వచనం చెప్పింది కూడా జగన్ మాత్రమేనని నొక్కి వక్కాణించారు. అయితే దీనిపై రాజకీయ విశ్లేషకుల్లో, ఆయా కుల సంఘాల్లో భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి. జగన్ చెబుతున్న సామాజిక న్యాయం అంతా వట్టి మాటేనని వారు చెబుతుండటం గమనార్హం. ఇంతకూ రాజకీయ విశ్లేషకులు ఏం చెబుతున్నారంటే..

56 బీసీ కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేశామని జగన్ ప్రభుత్వం ఊరూవాడా ఊదరగొడుతోందని.. అయితే ఇవన్నీ విజయవాడలో ఒకే బిల్డింగులో కొనసాగుతున్నాయని అంటున్నారు. ఇందులో ఒక్కటంటే ఒక్క కార్పొరేషన్ కు కూడా కోటి రూపాయలు నిధులు కూడా లేవని ఆయా కులాల ప్రతినిధులే చెబుతున్నారు. ఆయా కార్పొరేషన్ల చైర్మన్ల మాట కూడా ఇలాగే ఉందని అంటున్నారు. దీనిపై వారు లోలోపల తీవ్ర ఆందోళన చెందుతున్నారని చెబుతున్నారు. ఇలా నిధులు, విధులు, అధికారాలు లేని పదవులను అలంకారప్రాయంగా ఇచ్చి ఇదే సామాజిక న్యాయమంటూ జగన్ ప్రభుత్వం సామాజిక న్యాయభేరి బస్సు యాత్రలు నిర్వహించడమేంటని రాజకీయ విశ్లేషకులు మండిపడుతున్నారు.

నిధులు, అధికారాలు లేని పదవులను బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు కేటాయించి.. ఇదే సామాజిక న్యాయం అంటే ఎలాగని రాజకీయ విశ్లేషకులు, ఆయా కుల సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. కార్పొరేషన్ చైర్మన్ల పదవుల విషయానికొస్తే కేబినెట్ మంత్రి హోదా ఉన్న ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ) పదవిని రెడ్డి సామాజికవర్గానికే కేటాయించారని గుర్తు చేస్తున్నారు. మెట్టు గోవిందరెడ్డి ఏపీఐఐసీ చైర్మన్ గా ఉన్నారు. అంతకుముందు ఈ పదవిని ప్రస్తుతం మంత్రిగా ఉన్న నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాకు కేటాయించారు. ఇక కార్పొరేషన్ పదవుల్లో ముఖ్యమైన ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ కార్పొరేషన్ చైర్మన్, ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్, శాప్ (ఏపీ క్రీడా ప్రాధికార సంస్థ), ఏపీ డిజిటల్ కార్పొరేషన్, హౌసింగ్ కార్పొరేషన్, ఏపీ మార్క్ ఫెడ్, స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్, ఫైబర్ నెట్, తిరుమల తిరుపతి దేవస్థానం, శ్రీశైలం దేవస్థానం చైర్మన్ ఇలా పేరున్న ముఖ్య పదవులన్నింటిలోనూ రెడ్డి సామాజికవర్గంవారే ఉన్నారని చెబుతున్నారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీలకు, ముస్లింలకు కేవలం నిధులు, అంతగా ప్రాధాన్యత లేని కార్పొరేషన్ చైర్మన్ పదవులు మాత్రమే ఇచ్చారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. సాహిత్య అకాడమీ, సంస్కృతి - కళలు అకాడమీ, నాటక అకాడమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ అకాడమీ, హిస్టరీ అకాడమీ, గ్రంథాలయ కార్పొరేషన్ ఇలా ఊరూపేరూ లేని, నిధులు, అధికారాలు అస్సలే లేని కార్పొరేషన్లను బడుగు, బలహీనవర్గాలకు కేటాయించి సామాజిక న్యాయమంటూ ఊదరగొట్టడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. అలాగే జగన్ ప్రభుత్వం మునిసిపాలిటీల్లో రెండో వైస్ చైర్మన్, నగరపాలక సంస్థల్లో రెండో డిప్యూటీ మేయర్, మండల, జిల్లా పరిషత్ ల్లో రెండో వైస్ ఎంపీపీ, రెండో డిప్యూటీ చైర్మన్ అంటూ ఎప్పుడూ లేని కొత్త పదవులను సృష్టించింది. వీటివల్ల కలిగే ప్రయోజనం ఏమిటో ముఖ్యమంత్రి జగనే చెప్పాలని నిలదీస్తున్నారు.

అలాగే జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం నియమించుకున్న సలహాదారుల్లోనూ నూటికి 90 శాతానికి పైగా రెడ్లే. సజ్జల రామకృష్ణారెడ్డి, ధనుంజయరెడ్డి, బత్తుల బ్రహ్మానందరెడ్డి, కృష్ణారెడ్డి ఇలా అంతా రెడ్లేనని గుర్తు చేస్తున్నారు.

ఇక ఎంపీల విషయానికొస్తే రాజంపేట నియోజకవర్గంలో బలిజలు, కాపులు, ఇతర బీసీ కులాల జనాభా ఎక్కువ. ఎన్నో దశాబ్దాలుగా ఈ సామాజికవర్గాలే రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నాయి.. గెలుస్తున్నాయి. దీన్ని గత రెండు పర్యాయాలు వైఎస్ జగన్ బ్రేక్ చేశారు. రెడ్డి సామాజికవర్గానికి చెందిన మిథున్ రెడ్డికి రాజంపేట సీటు కేటాయించారని గుర్తు చేస్తున్నారు.

వాస్తవానికి ఏపీలో కాపుల జనాభా ఎక్కువ. ఈ సామాజికవర్గం 27 శాతం మంది ఉన్నారు. రెడ్డి సామాజికవర్గం జనాభా కేవలం 6 శాతం మాత్రమే. అయితే అసెంబ్లీ (మొత్తం సీట్లు 175)లో రెడ్డి ఎమ్మెల్యేలు 48 మంది ఉండగా.. కాపులు అందులో సగం కూడా లేకపోవడం ఏ సామాజికన్యాయమో జగనే చెప్పాలని నిలదీస్తున్నారు. ఇక బీసీల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. అలాగే రెడ్డి ఎంపీలు లోక్ సభలో ఐదుగురు ఉంటే, కాపులు ఇద్దరే ఉన్నారు. ఇక తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సిటీ, కొత్తపేట వంటి నియోజకవర్గాల్లో రెడ్ల ఓట్లు 100 కూడా లేవు. కానీ అక్కడ నుంచి ఆ కులాల ఎమ్మెల్యేలే ఉండటం గమనార్హమని చెబుతున్నారు.

రాజ్యసభలోనూ రెడ్ల ఎంపీలు ఏకంగా నలుగురు (ఇప్పుడు ఎంపిక చేసిన విజయసాయిరెడ్డి, నిరంజన్ రెడ్డితో కలిపి) ఉన్నారని అంటున్నారు. ఏపీలో అత్యధికంగా జనాభా ఉన్న కాపుల నుంచి, ఎస్సీల నుంచి ఒక్కరూ రాజ్యసభలో లేకపోవడం గమనార్హం. ఇక మంత్రి పదవుల్లో ఎక్కువ బీసీలకు, ఎస్సీలకే కేటాయించినా విడదల రజిని బీసీ అయినప్పటికీ ఆమె భర్త కాపు. అలాగే ఇంకో, ఒకరిద్దరు ఎస్సీ, బీసీ మంత్రుల భర్తలు లేదా భార్యలు అగ్ర కులాలకు చెందినవారే ఉన్నారని చెబుతున్నారు.

అలాగే రవాణా శాఖ మంత్రి విశ్వరూప్ ఎస్సీ అయనప్పటికీ ఆయన భార్య రెడ్డి. హోం మంత్రిగా ఎస్సీ ఉన్నప్పటికీ అసలు సిసలు అధికారాలన్నీ ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్సీపీలో నెంబర్ టూ స్థానంలో ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డే నిర్వహిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇక దేశంలోనే తొలిసారిగా దళిత మహిళకు హోం మంత్రి పదవి ఇచ్చామనే మాటకు అర్థం ఎక్కడుందని విమర్శలు వినిపిస్తున్నాయి.
Tags:    

Similar News