ఆ పార్టీతో జనసేన ఇక దూరం జరిగినట్టేనా?

Update: 2022-12-12 10:30 GMT
ఆంధ్రప్రదేశ్‌ లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఎట్టి పరిస్థితుల్లో చీలనివ్వబోనని ఇప్పటికే జనసేనాని పవన్‌ కల్యాణ్‌ పలుమార్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. 2014లో మాదిరిగా జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేయాలనేది పవన్‌ ఉద్దేశమని వార్తలు వచ్చాయి.

అయితే మరోవైపు బీజేపీ పవన్‌ ప్రతిపాదనకు సిద్ధంగా లేదు. వైసీపీ, టీడీపీ రెండూ అవినీతి, కుటుంబ పార్టీలని బీజేపీ చెబుతోంది. జనసేన –బీజేపీ కలసి పోటీ చేస్తాయని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని బీజేపీ నేతలు చెబుతూ వస్తున్నారు.

అయితే బీజేపీ ఆశిస్తున్నట్టు బీజేపీ – జనసేన, టీడీపీ–వామపక్షాలు వేర్వేరుగా పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఈ రెండు కూటముల మధ్య చీలిపోయి అంతిమంగా వైసీపీకి మేలు కలిగే అవకాశం ఉంది. దీన్ని గ్రహించే పవన్‌ కల్యాణ్‌ వైసీపీని గద్దె ధింపడానికి కలిసి రావాలని అన్ని పార్టీలకు పిలుపునిచ్చారు.

మరోవైపు టీడీపీ.. జనసేనతో పొత్తు కోసం చకోర పక్షిలా ఎదురుచూస్తోంది. తమ రెండు పార్టీలు కలిస్తే వైసీపీని సులువుగా ఓడించొచ్చని టీడీపీ నేతలు బలంగా విశ్వసిస్తున్నారు. చంద్రబాబు సైతం విజయవాడలో పవన్‌ కల్యాణ్‌ ను కలసి విశాఖపట్నంలో పోలీసులు, జగన్‌ ప్రభుత్వం పవన్‌ తో వ్యవహరించిన తీరును ఖండించారు.

ఇక జనసేన – టీడీపీల మధ్య పొత్తు కుదరడం ఖాయమనుకునే లోపే ప్రధాని నరేంద్ర మోడీ విశాఖపట్నం పర్యటనకు రావడం, పవన్‌ ను కలవడం జరిగిపోయాయి. ఆయన ఏం చెప్పారో గానీ ఆ తర్వాత పవన్‌ లో కొంత నిస్తేజం ఏర్పడిందని వార్తలు వచ్చాయి. టీడీపీతో మనకు పొత్తు వద్దు.. మన రెండు పార్టీలే కలసి పోటీ చేయాలని ప్రధాని మోడీ సూచించినట్టు వార్తలు హల్‌చల్‌ చేశాయి.

అయితే 2019 ఎన్నికల్లో బీజేపీకి ఏపీలో ఎన్నికల్లో వచ్చిన ఓట్లు ఒక్క శాతం కూడా లేవు. మరోవైపు జనసేన పార్టీకి ఇంచుమించుగా 7 శాతం వరకు ఓట్లు వచ్చాయి. వచ్చే ఎన్నికల్లో బీజేపీతో జనసేన కలిసి పోటీ చేసినా ఆ పార్టీతో జనసేనకు కలిగే లాభం సున్నా అని పవన్‌ కు తెలియందని కాదని అంటున్నారు.

ఈ నేపథ్యంలో టీడీపీని కూడా కలుపుకుని పోటీ చేయడానికి సిద్ధమైతే బీజేపీతో జనసేన పొత్తు ఉంటుందని.. లేకుంటే టీడీపీతో కలసి ఎన్నికల్లో పోటీ చేయాలని పవన్‌ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఆ పార్టీ ముఖ్య నేత నాదెండ్ల మనోహర్‌ ఎన్నికల పొత్తులపై త్వరలో ప్రకటిస్తామని చెబుతుండటం విశేషం. అంతేతప్ప తాము, బీజేపీ కలసి పోటీ చేస్తున్నామని.. ఇంకా పొత్తులు ఏమిటని నాదెండ్ల మనోహర్‌ అనకపోవడం ఇందుకు నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

వచ్చే ఎన్నికల్లో మూడు పార్టీలు కలసి పోటీ చేయడానికి బీజేపీ అంగీకరించకుంటే పవన్‌ బీజేపీకి రాంరాం చెప్పే అవకాశముందని చెప్పుకుంటున్నారు. జనసేన – టీడీపీ రెండూ కలసి పోటీ చేస్తాయని, నాదెండ్ల మనోహర్‌ తాజా వ్యాఖ్యల్లో మర్మం కూడా ఇదేనని చెబుతున్నారు.

మరోవైపు తెలంగాణలో బీజేపీకి మద్దతివ్వకుండా పవన్‌ ఒంటరిగా పోటీ చేయడానికి మొగ్గు చూపుతుండటం కూడా ఇందుకు నిదర్శనమని గుర్తు చేస్తున్నారు. బీజేపీతో పొత్తు విషయంలో పవన్‌ ఆసక్తిగా లేరని తేల్చిచెబుతున్నారు. తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 32 అసెంబ్లీ నియోజకవర్గాలకు పవన్‌ అభ్యర్థులను ప్రకటించడం ఇందుకు నిదర్శనమని అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News