హద్దులు దాటి పోతున్నారా?

Update: 2022-09-05 07:44 GMT
మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో నేతలు హద్దులు దాటిపోతున్నారు. పార్టీల సిద్ధాంతాలు, అభ్యర్థుల మెరిట్, డీ మెరిట్ ఆధారంగా ప్రచారం చేసుకోవాల్సిందపోయి వ్యక్తిగతంగా తిట్టేసుకుంటున్నారు. తాజాగా మునుగోడు సభ తర్వాత మీడియాతో బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేయబోతున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై నోటికొచ్చినట్లు విరుచుకుపడ్డారు. వ్యక్తిగతంగా రేవంత్ ను కోమటిరెడ్డి నానా బూతులు తిట్టేశారు.

రేవంత్ ఒక బ్లాక్ మెయిలర్ అని, పీసీసీ అధ్యక్ష పదవిని డబ్బులిచ్చి కొనుక్కున్నారని, రేవంత్ కు ఎవరెవరితో సంబంధాలున్నాయో తనకు తెలుసంటు రాజగోపాలరెడ్డి రెచ్చిపోయారు. రేవంత్ కు ఎవరెవరితో సంబంధాలున్నాయో తనకు తెలుసంటే అర్ధమేంటో కోమటిరెడ్డే చెప్పాలి. ఇక్కడ సమస్య ఏమిటంటే ఉపఎన్నికలో గెలవటం రాజగోపాలరెడ్డికి అత్యంత ప్రతిష్టగా మారింది. ఏ కారణం చేతనైనా ఓడిపోతే బీజేపీలో పరువు పోతుంది.

ఇదే సమయంలో మునుగోడు సీటు తమదే కాబట్టి ఉప ఎన్నికను గెలుచుకోవటం కాంగ్రెస్ కు ప్రిస్టేజిగా మారింది. విచిత్రం ఏమిటంటే ఇక్కడ బీజేపీకంటు పెద్దగా ఓటు బ్యాంకు లేదు. కాబట్టి రాజగోపాల్ గెలవాల్సిందంతా కాంగ్రెస్+వ్యక్తిగత ఓటుబ్యాంకు+కేసీయార్ వ్యతిరేక ఓట్లతోనే.

ఇదే సమయంలో కాంగ్రెస్ అభ్యర్ధికి కూడా పార్టీ ఓటుబ్యాంకు+కేసీయార్ వ్యతిరేక ఓట్లు+రాజగోపాలరెడ్డి వ్యతిరేక ఓట్లే శరణ్యం. కాంగ్రెస్ తరపున అభ్యర్ధిని ప్రకటించలేదు కాబట్టి రేవంత్ రెగ్యులర్ గా నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ టార్గెట్ రాజగోపాలరెడ్డే కాబట్టి రేవంత్ అండ్ కో రాజగోపాలరెడ్డినే ప్రదానంగా టార్గెట్ చేస్తున్నారు.

రాజగోపాలరెడ్డిని టార్గెట్ చేయటంలో భాగంగా మాజీ ఎంఎల్ఏ తెచ్చుకున్న కాంట్రాక్టులు తదితరాలపై ఎక్కువగా ఆరోపణలు చేస్తున్నారు. దీన్నే రాజగోపాలరెడ్డి సహించలేకపోతున్నారు. అందుకనే రేవంత్ ను వ్యక్తిగతంగా నోటికొచ్చినట్లు తిట్టేస్తున్నారు.

మొత్తానికి ఇటు రాజగోపాలరెడ్డి అటు కాంగ్రెస్ నేతలు ఒకరిపై మరొకరు పై చేయి సాధించటంలో అన్నీ హద్దులను దాటిపోతున్నారు. పిట్ట పోరు పిట్టపోరు పిల్లి తీర్చిందన్నట్లుగా చివరకు ఈ ఇద్దరి గొడవలో టీఆర్ఎస్ గెలిచినా ఆశ్చర్యం లేదు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News