టార్గెట్ కాంగ్రెస్ అంటూ మోడీ గురి పెట్టిన విభజన మాట దెబ్బేసిందిగా?

Update: 2022-02-09 05:47 GMT
మోకాలికి మెడకు లంకె వేస్తే ఎలా ఉంటుంది? తెలంగాణలోని కొన్ని రాజకీయ పక్షాలు వినిపిస్తున్న వాదన ఇప్పుడు ఇలానే ఉంది. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే క్రమంలో ప్రసంగించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసుకొని తీవ్ర స్థాయిలో విరుచుకుపడటం తెలిసిందే. ప్రధానమంత్రి పదవిని చేపట్టిన ఇన్నేళ్లలో ఇంత తీవ్రంగా కాంగ్రెస్ ను.. దాన్ని నడిపించిన గాంధీ ఫ్యామిలీని ఇంతలా లక్ష్యం చేసుకున్నది లేదు.

తాత..ముత్తాతల చరిత్రను ప్రస్తావిస్తూ.. ఒక రేంజ్ లో ఫైర్ అయిన మోడీ.. ఏపీ రాష్ట్ర విభజనను అవసరం లేకున్నా ప్రస్తావించారు. మోడీ లక్ష్యం.. కాంగ్రెస్ ను టార్గెట్ చేయటమే తప్పించి.. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల భావోద్వేగాలతో పని లేదు. తాను గురి పెట్టిన లక్ష్యం దిశగా అడుగులు వేయటం మినహా మరేమీ ఆయనకు అవసరం లేదు. ఈ వైఖరి ఆయనకు మొదట్నించి ఉన్నదే.

తాను రాష్ట్ర విభజన గురించి ప్రస్తావిస్తే.. ఆ సందర్భంగా ఇచ్చిన ప్రత్యేక  హోదా హామీ గురించి మాట్లాడకపోవటాన్ని ప్రస్తావిస్తారన్న విషయాన్ని పెద్దగా పట్టించుకోవటం చూస్తే.. మోడీ ఆలోచనా ధోరణి ఏ తీరులో ఉంటుందో ఇట్టే అర్థమవుతుంది. ఏపీ రాష్ట్ర విభజన సందర్భంగా నాడు పాలక పక్షంగా ఉన్న కాంగ్రెస్ ఏ రీతిలో వ్యవహరించిందన్న విషయాన్ని చెప్పాలన్న మోడీ మాటలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారాయి. కాంగ్రెస్ అనుసరించిన పద్దతి.. విభజనబిల్లును ఆమోదించేందుకు అనుసరించిన విధానాన్ని.. ఆ సందర్భంగా నాడు చోటు చేసుకున్న పరిణామాల్ని ప్రస్తావిస్తూ కాంగ్రెస్ వైఖరిని దునుమాడే ప్రయత్నం చేశారు.

మోడీ నోటి నుంచి వచ్చిన మాటల్ని తమకు అనుకూలంగా అన్వయించిన టీఆర్ఎస్.. ఇప్పుడు తెలంగాణను.. తెలంగాణ ఉద్యమాన్ని.. తెలంగాణ అమరవీరుల త్యాగాల్ని తక్కువ చేసేలా మాట్లాడారని.. ఆయన అవమానానికి నిరసనగా.. నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చాయి. మోడీ మాటలు ఏపీ వాసులకు మానిన పుండును కెలికిన చందంగా మారింది.నిజమే కదా.. ఆ రోజున అంత దారుణంగా విభజన చేసి పారేశారన్న భావన కలిగేలా చేసింది. మొత్తంగా మోడీ అనుకున్నట్లుగా కాంగ్రెస్ ను ఆయన సమర్థంగా విమర్శించగలిగారు.

అదే సమయంలో.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయన చేసిన వ్యాఖ్యలు బీజేపీకి నష్టం కలిగేలా.. ఆ పార్టీకి వారిని దూరం చేసేలా చేశాయని చెప్పకతప్పదు. మొత్తంగా చూస్తే.. ఆపరేషన్ సక్సెస్.. పేషెంట్ డెడ్ అన్నట్లుగా మారిందని చెప్పక తప్పదు.
Tags:    

Similar News