రాజ్యసభ మెజార్టీ బీజేపీకి అందని ద్రాక్షే

Update: 2021-05-23 12:30 GMT
గత యూపీఏ హయాం ముగిశాక దేశంలో బీజేపీ గద్దెనెక్కింది. అఖండ మెజార్టీ సాధించి లోక్ సభలో బలంగా ఉన్న బీజేపీ రాజ్యసభలో మాత్రం బలం లేక చాలా బిల్లులు నెగ్గించుకోలేక మొదటి హయాంలో ఇబ్బందులు పడింది. అయితే రెండోసారి అధికారంలోకి వచ్చాక.. చాలా రాష్ట్రాల్లో గెలిచి రాజ్యసభలో మిత్రుల సాయంతో బిల్లులు గట్టెక్కించింది.

అయితే తాజాగా బీజేపీకి వరుసగా రాష్ట్రాల్లో ఓటములతో మరోసారి రాజ్యసభలో మెజార్టీ అందని ద్రాక్షగానే మారింది. ఏడేళ్లుగా రాజ్యసభలో మెజార్టీ కోసం బీజేపీ ప్రయత్నిస్తున్నా సాధ్యపడడం లేదు. ఎప్పటికప్పుడు మెజార్టీకి చేరువగా వస్తున్నా మెజారిటీ సాధించలేక చతికిలపడింది.

రాష్ట్రాల ఎన్నికల్లో ఓడిపోవడమే రాజ్యసభలో బీజేపీ మెజార్టీ సాధించకపోవడానికి ప్రధాన కారణంగా చెబుతున్నారు. ఇక వచ్చే ఏడాది జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలవకపోతే మెజారిటీ మాట అటుంచి ప్రస్తుతం ఉన్న సభ్యుల సంఖ్య కూడా కూడా కోల్పోక తప్పదని అంటున్నారు.

రాజ్యసభలో మొత్తం 245 ఎంపీలుంటారు. బీజేపీ ఎంపీల సంఖ్య 93 మాత్రమే. ఈ ఏడేళ్లలో పలు రాష్ట్రాల ఎన్నికల్లో ఓటములతో రాజ్యసభలో బీజేపీ బలం చేకూరలేకపోతోంది. బీజేపీకి రాజ్యసభలో మెజారిటీ మార్క్ సాధించడం అనేది అందని ద్రాక్షగా మారిపోతోంది.

రాజ్యసభలో మెజారిటీకి అవసరమైన మేజిక్ మార్క్ 123. ఇంకా 30 ఎంపీలు బీజేపీకి అవసరం. బీజేపీ ఇప్పట్లో సాధించే అవకాశాలు లేవు. మరో 9 నెలల్లో యూపీ ఎన్నికలు జరుగుతున్నాయి. అక్కడ ఓడిపోతేబీజేపీ బలం మరింత కోల్పోతుంది. యూపీలో 11 రాజ్యసభ సీట్లు వచ్చే ఏడాది ఖాళీ అవుతాయి. బీజేపీకి అందులో 5 ఎంపీలున్నారు. యూపీ ఎన్నికల్లో ఓడిపోతే బీజేపీ రాజ్యసభ బలం మరింతగా దిగజారుతుంది.

వచ్చే ఏడాది 71 మంది రాజ్యసభ ఎంపీలు రిటైర్ కాబోతున్నారు. ఏపీ, రాజస్థాన్, చత్తీస్ ఘడ్ మూడు రాష్ట్రాలు బీజేపీ చేతుల్లో లేవు. దీంతో యూపీలో ఓడితే బీజేపీ రాజ్యసభ సభ్యుల బలం దారుణంగా పడిపోతుంది. వచ్చే ఏడాది ఏపీ, తెలంగాణలో బీజేపీ నలుగురు రాజ్యసభ ఎంపీల పదవికాలం ముగుస్తోంది. వీరిలో ఏపీకి చెందిన ముగ్గురు ఎంపీలు ఉన్నారు. ఇవి వైసీపీ ఖాతాలోకే చేరనున్నాయి. తెలంగాణ సీటు టీఆర్ఎస్ కే పోతుంది. సో బీజేపీకి తెలుగు రాష్ట్రాల్లో ఒక్క ఎంపీ కూడా లేనట్టే అవుతుంది. ఇలా రాజ్యసభలో బలం పుంజుకోవడం భవిష్యత్ లోనూ బీజేపీకి కష్టమే అంటున్నారు.
Tags:    

Similar News