అటు జగన్ ఇటు షర్మిల వారధిగా విజయసాయి ?

వైఎస్సార్ కుటుంబంలో రాజకీయ విభేదాలు ఎవరికీ తెలియనివి కావు. ఆ మాటకు వస్తే రాజకీయాలలో ఇవేమీ కొత్త కూడా కాదు.

Update: 2025-02-03 18:30 GMT

వైఎస్సార్ కుటుంబంలో రాజకీయ విభేదాలు ఎవరికీ తెలియనివి కావు. ఆ మాటకు వస్తే రాజకీయాలలో ఇవేమీ కొత్త కూడా కాదు. రాజకీయ ఇంట్లోకి ఒంట్లోకి కూడా వస్తుంది. కర్ణాటకలో ఒకనాడు రాజకీయాల కోసం అక్కడ తండ్రీ కుమారుడు మధ్యనే విభేదాలు తీవ్ర స్థాయిలో వచ్చిన సంగతి విధితమే. ఇక ఏపీలో చూస్తే వైఎస్సార్ కుటుంబం గొడుగున ఉన్న వైఎస్ జగన్ షర్మిల మధ్యలో కూడా తీవ్రాతి తీవ్రమైన రాజకీయం నడచింది.

సరిగ్గా ఎన్నికలకు ముందు ఏపీ పీసీసీ చీఫ్ పదవిని అధిష్టించిన వైఎస్ షర్మిల తన అన్న జగన్ ఎట్టి పరిస్థితుల్లోనూ సీఎం గా ఉండరారాదని పంతమే పట్టారు. ఆమె దానిని తన వంతు ప్రయత్నం ద్వారా నెరవేర్చుకున్నారు. జగన్ మీద హాట్ కామెంట్స్ చేస్తూ ఆ పార్టీ మీద ప్రభుత్వం మీద జనంలో వ్యతిరేకతను పెంచడంతో షర్మిల పాత్ర అతి ముఖ్యంగా ఉంది అని విశ్లేషకులు చెబుతారు.

ఇదిలా ఉంటే రాజకీయాలలో రక్తబంధాలు ఎలా ఇమడలేక వేరు పడతాయో అంతే ఆశ్చర్యంగా అవి కలిసేందుకు కూడా అవకాశం ఉంటుంది. రాజకీయం అంటేనే అది. కేంద్రంలో వాజ్ పేయి ప్రధానిగా ఉన్నపుడు బాహాటంగా ఆయన మీద విమర్శలు చేసిన పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆయనకు ఇష్టమైన గులాబ్ జాం లను ఆ తరువాత పంపించిన రాజకీయాన్ని అంతా చూశారు.

అంటే బహిరంగ సభలలో మీడియా ముందు మాట్లాడే మాటలకుతెర వెనక బంధాలకు కూడా అర్ధాలు మారిపోతూంటాయి. ఎవరికి వారుగానే వీటిని నిర్వచించుకోవాల్సిందే. అందువల్ల వైఎస్ జగన్ షర్మిల మధ్య విభేదాలు వచ్చాయన్నది ఎంత నిజమో వారు మళ్ళీ కలవవచ్చు అన్నది కూడా అంతే నిజం.. ఎందుకంటే అది రక్త బంధం. జగన్ ఏ రోజూ నోరు విప్పి తన చెల్లెల మీద విమర్శలు చేయలేదు.

ఇక షర్మిల ఆవేశంతో చేసిన విమర్శలను వర్తమాన రాజకీయాల్లో ఎవరూ పట్టించుకోరనే అంటారు. ఇవన్నీ పక్కన పెడితే విజయసాయిరెడ్డి అంటేనే జగన్ ఆత్మగా చెబుతారు. ఆయన రాజకీయాల్లో ఉన్నది రెండు సార్లు ఎంపీగా చేసినది అంతా జగన్ చొరవ ప్రోత్సాహంతోనే. ఆయన రాజకీయం అంతా జగన్ కొరకు జగన్ చేత జగన్ వల్ల అని చెప్పక తప్పదు.

అలాంటి విజయసాయిరెడ్డి ఇపుడు వైసీపీని వీడారు. అందుకే ఆయన స్వేచ్చగా తన వారు అనుకున్న అందరినీ కలుస్తున్నారు. ఇక ఆయన వైఎస్ షర్మిల ఉంటున్న లోటస్ పాండ్ కి గత శనివారం వెళ్ళారని అక్కడ ఆయన మూడు గంటల పాటు ఉన్నారని షర్మిలతో రాజకీయ అంశాలు చర్చించారని ప్రచారం సాగింది. ఆమె పీసీసీ చీఫ్ గా ఉంటూ విజయసాయిరెడ్డిని కూడా విమర్శించేది.

అయితే రాజకీయాల్లో ఏదైనా సాధ్యం కాబట్టి విజయసాయిరెడ్డి ఇపుడు వాటికి దూరంగా ఉన్నారు కాబట్టి షర్మిల ఇంటికి వెళ్ళారని అంటున్నారు. ఇక ఆయనను పిలిచింది కూడా ఒక పెద్ద పని మీద అని అంటున్నారు. వైఎస్సార్ సతీమణి అయిన విజయమ్మ అన్నా చెల్లెళ్ళ మధ్య రాజీ కుదర్చమని విజయసాయిరెడ్డిని ఈ విషయంలో మధ్యవర్తిగా రాయబారిగా వారధిగా ఉండమని కోరింది అని అంటున్నారు.

ఆమె విజయసాయిరెడ్డి పట్ల సోదరభావంతో మెలుగుతారు. అందువల్ల ఆయన ద్వారానే తన పిల్లలు ఇద్దరూ తిరిగి కలుస్తారు అన్న నమ్మకంతో ఆయన సాయం కోరారని ప్రచారం సాగుతోంది. ఇక చూస్తే కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్నా షర్మిల రాజకీయంగా పెద్దగా సాధించినది ఏమీ లేదు అని అంటున్నారు. వైసీపీలో నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడడంతో ఆ పార్టీ ఇబ్బందులో ఉంది.

దాంతో అన్నా చెల్లెళ్ళ రాజకీయ జీవితం ఇపుడు ఇబ్బందులో ఉన్న వేళ వారి మధ్య రాజీ కుదిర్చితే వైఎస్సార్ వారసత్వం మళ్ళీ ఒక వెలుగు వెలుగుతుందన్న ఆలోచన కూడా ఉందని అంటారు. షర్మిల జగన్ ల మధ్య ఉన్న విభేదాలు అన్నీ కలసి కూర్చుని అంతర్గతంగా చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చు అన్నది తల్లి విజయమ్మ ఆలోచనగా ఉందని అంటున్నారు

దానికి సారధిగా వారధిగా విజయసాయిరెడ్డి మీద పెద్ద పని పెట్టి సాయం కోరారు అని ప్రచారం అయితే సాగుతోంది. ఈ రకమైన మధ్యవర్తిత్వం చేయడానికి సరైన వ్యక్తి విజయసాయిరెడ్డి తప్ప మరొకరు కారని అంటున్నారు. ఆయనకు వైఎస్సార్ కుటుంబంతో తరాల అనుబంధం ఉంది. అలాగే జగన్ కి ఆయన ఎంతో సన్నిహితుడు. పైగా పార్టీని వీడినా రాజకీయాలకు దూరం అని చెప్పినా జగన్ ని వీడిపోలేని బంధం కూడా ఉందని అంటున్నారు.

మొత్తానికి పెద్దాయనగా విజయసాయిరెడ్డి మీద ఈ కీలకమైన బాధ్యతలు పెట్టారని అంటున్నారు. దానిని ఆయన ఏ మేరకు నెరవేరుస్తారు అన్నది చూడాలని అంటున్నారు. ప్రస్తుతానికి ఇవన్నీ ఊహాగానాలుగా కనిపిస్తున్నా ఏదో నాటికి వీటి వెనక విషయాలు వెలుగు చూస్తాయని అంటున్నారు.

Tags:    

Similar News