సెంచరీ దిశగా రూపాయి.. పతనానికి హద్దు లేదోయి..జీవిత కాల గరిష్ఠానికి

దీని దెబ్బ.. కుమార్తె కోసం అతడు తీసుకునే బ్యాంక్ లోన్ మీద ప్రభావం పడుతుంది.. ఈ మొత్తం రూ.లక్షల్లో ఉంటుంది..

Update: 2025-02-03 12:04 GMT

డాలరు విలువతో పోలిస్తే రూపాయి పతనం అయితే ఏమవుతుంది..? సింపుల్ గా చెప్పాలంటే.. మీ జేబుకు పరోక్షంగా చిల్లు పడుతుంది.. ఉదాహరణకు ఒక వ్యక్తి తన కూతురును అమెరికా పంపాలని అనుకున్నాడు. అప్పటికి డాలరుకు రూపాయి విలువ 80. కొద్ది రోజుల్లోనే అది 86కు చేరింది అనుకోండి. దీని దెబ్బ.. కుమార్తె కోసం అతడు తీసుకునే బ్యాంక్ లోన్ మీద ప్రభావం పడుతుంది.. ఈ మొత్తం రూ.లక్షల్లో ఉంటుంది..

అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ అధికారంలోకి రాకముందే.. డాలరు-రూపాయి మధ్య దూరం బాగా పెరిగింది. ఇక ట్రంప్ వచ్చీ రావడంతోనే డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ భారీగా పతనం అవుతోంది. ఎన్నడూ లేని విధంగా చరిత్రలో తొలిసారి రూ.87 దాటింది.

సెంచరీ దిశగా

ఏడాది కిందటితో పోలిస్తే రూపాయి విలువ డాలరుతో పోలిస్తే రూ.7 వరకు పెరిగింది. ఇది ఇక్కడితో ఆగదని మరింత పతనం అవుతుందనే ఆందోళన వ్యక్తం అవుతోంది. ట్రంప్ చర్యలే దీనికి కారణం అని అంటున్నారు.

ఇటీవలి కాలంలో ఎన్నడూ లేనట్లుగా సోమవారం రూపాయి విలువ ఆల్ టైమ్ కనిష్టానికి (రూ.87) పడిపోయింది. డాలర్‌తో చూస్తే రూపాయి విలువ రూ. 87.20 వద్ద ట్రేడవుతోంది.

అమెరికా ప్రధాన వాణిజ్య భాగస్వాములైన కెనడా, మెక్సికో, చైనా లపై సుంకాల విధింపుతో డాలర్‌ బలపడుతోంది. ఇదే సమయంలో డాలర్‌పైనే ఎక్కువగా ఆధారపడి ఉన్న ఆసియా కరెన్సీలు పతనం అవుతున్నాయి.

కిందటి సెషన్లో రూపాయి విలువ రూ. 86.60 స్థాయిలో ఉండేది. సోమవారం ఒక్కసారిగా 0.70 శాతం పతనంతో రికార్డు స్థాయి కనిష్టాలకు పడిపోయింది. డాలర్ ఇండెక్స్ 0.30 శాతం పెరిగి 109.8 వద్ద కొనసాగింది. చైనా కరెన్సీ యువాన్ కూడా 0.50 శాతం తగ్గింది.

చైనా, మెక్సికో, కెనడాలపై ట్రంప్ సుంకాలు.. అంతర్జాతీయ అనిశ్చితి నేపథ్యంలో క్రూడాయిల్ ధరలు పెరిగిపోతున్నాయి. బ్రెంట్ క్రూడాయిల్ 0.73 శాతం పెరిగి బ్యారెల్‌పై 76.22 డాలర్ల వద్ద ఉంది. ఇలా దిగుమతి బిల్లు భారమై దేశానికి ఆర్థిక లోటు తీవ్రమవుతోంది. భారత స్టాక్ మార్కెట్ సూచీలు కూడా సోమవారం సెషన్లో తీవ్ర ఒడుదొడుకులకు లోనయ్యాయి. అంతర్జాతీయ అనిశ్చితి సహా క్రూడాయిల్ ధరలు, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై ప్రకటనలు మన కరెన్సీపై ప్రభావం చూపుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

రూపాయి ఇలానే పతనం అయితే, నిత్యావసర వస్తువుల ధరలు అంటే ముందుగా ద్రవ్యోల్బణం పెరుగుతుంది. దీనిని తగ్గించడానికి మళ్లీ ఆర్బీఐ వడ్డీ రేట్లను పెంచాల్సి వస్తుంది. స్టాక్ మార్కెట్లు దెబ్బతింటాయి. దిగుమతులు ఖరీదైపోతాయి.

Tags:    

Similar News