సీమ బరస్ట్ అవుతోందా...అందుకే అలా ?

Update: 2021-12-08 01:30 GMT
రాయలసీమకు ఎంతో విశిష్టత ఉంది. ఇప్పటికి అయిదు వందల ఏళ్ల క్రితం అత్యంత సంపన్న ప్రాంతం అంటే సీమనే చెప్పాలి. రాయలు ఏలిన నేల, రతనాలు పోసి అమ్మిన సీమ అని పేరు. అలాంటి సీమ గొప్పది కాబట్టే దత్త ప్రాంతాలుగా నాటి పరాయి ప్రభువులు కోరి మరీ తీసుకున్నారు. ఇక ఉమ్మడి మద్రాస్ స్టేట్ లో కూడా సీమ బాగానే రాణించింది. ఎపుడైతే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందో  అందులో చేరిన సీమకు నాటి నుంచి అన్యాయమే ప్రతీ అడుగు లోనూ పలకరిస్తోంది.

కర్నూల్ రాజధాని అని చెప్పినా శ్రీభాగ్ ఒప్పందాన్ని గౌరవిస్తామని పేర్కొన్నా కూడా జరిగిందీ ఒరిగిందీ లేదు. ఇక సీమ కు ఉమ్మడి ఏపీ లో ఎంతో కొంత బాగా నే ఉంది, కానీ విభజన ఏపీ లో ఏడేళ్లు అయినా ఎత్తి గిల్లలేదు. సీమకు నీటి కష్టాలు అలాగే ఉన్నాయి. ఉపాధి లేదు, అభివృద్ధి అంత కంటే లేదు, అన్నింటికీ మించి వివక్షకు గురి అవుతున్నామన్న భావనలో వారికి నానాటికీ పెరిగి పోతోంది.

దీంతో సీమ వాసులు రెండు పార్టీలు, ఇద్దరు ముఖ్యమంత్రుల పాలన చూసిన తరువాత పూర్తి నిర్వేదం లోకి వెళ్ళి పోయారు అంటున్నారు. చిత్ర మేంటి అంటే ఈ ఇద్దరు సీఎంలు సీమకు చెందిన వారే. అయినా సరే వారి మొగ్గు కోస్తా  ప్రాంతాల మీదనే ఉందని, సీమకు నిఖార్సైన న్యాయం జరగలేదని ఘోషిస్తున్నారు. సీమ కు చెందిన హంద్రీనీవా, గాలేరు పోతిరెడ్డిపాడు సహా అనేక నీటి ప్రాజెక్టుకలకు జీవాధారం క్రిష్ణా జలాలే, ఆ నీటి ప్రాజెక్టుల విషయంలో కొన్నిటికి నీటి కేటాయింపులు లేవు. వాటి విషయం పాలకులు పట్టించుకోవడంలేదు. ఈ లోగా క్రిష్ణా రివర్ బోర్డు ఏర్పాటు అయింది.

ఈ సమస్య ఇలా ఉంటే అన్ని విధాలుగా వెనక బడిన సీమ ప్రాంతానికి ప్రత్యేక ప్యాకేజిని ప్రకటించాలని, అలాగే కడప లో స్టీల్ ప్లాంట్ సహా అనేక అభివృద్ధి పధలాలకు శ్రీకారం చుట్టాలని డిమాండ్ ఉంది. అలాగే క్రిష్ణా  రివర్ బోర్డు రీజనల్  ఆఫీస్ ని కర్నూల్ లో ఏర్పాటు చేయాలని, వీలైతే హైకోర్టు లేక పోతే హైకోర్టు బెంచ్, మినీ సచివాలయం, ఒక సెషన్ అసెంబ్లీ సమావేశాలను సీమలో పెట్టాలని డిమాండ్లు అయితే ఉన్నాయి.

మరి వీటి విషయం లో నాడు చంద్రబాబు సర్కార్ పట్టించు కోలేదు, ఇపుడు జగన్ కూడా పాలనా రాజధాని విశాఖ అంటున్నారు. సీమకు హై కోర్టు అని ప్రకటించినా అది ఆచరణ లో ఎంత వరకూ సాధ్య పడుతుందో తెలియదు. మరో వైపు విశాఖలో క్రిష్ణా బోర్డు రీజనల్ ఆఫీస్ కి జగన్ సర్కార్ ప్రతిపాదించింది. ఇక సీమ లో అభివృద్ధి లేదు,  నీటి ప్రాజెక్టులకు అన్యాయం జరుగుతున్నా పట్టించుకోవడంలేదు అన్న బాధ ఉంది.

దీంతో సీమ లో రెండు రకాల డిమాండ్లు వినిపిస్తున్నాయి. మాజీ మంత్రి మైసూరారెడ్డి లాంటి వారు నెల్లూరు, ప్రకాశం తో పాటుగా ఆరు జిల్లాలతో ప్రత్యేక రాయల సీమ రాష్ట్రాన్ని  కోరుతున్నారు. మరి కొందరు అయితే ప్రత్యేక రాష్ట్రం అయ్యే పని కాదు కానీ రాయలసీమ నాలుగు జిల్లాలను తెలంగాణాలో కలిపేయమంటూ ఉద్యమించాలని చూస్తున్నారు. అంటే రాయల తెలంగాణా అన్న మాట. అలా అయితేతే తమకూ ఒక రాజధాని గా హైదరాబాద్ ఉంటుందని, అభివృద్ధి ఫలాలు కొంత అయినా తమకు దక్కుతాయని భావిస్తున్నారుట.

మొత్తానికి విభజన జరిగిన ఏడేళ్ల కాలం లోనే సీమ జనాలు విసిగి పోయారు అనుకోవాలి. మరి వారు కోస్తా వాసులతో కలసి ఉండే కంటే తెలంగాణా తోనే ఉండడం మేలు అనుకుంటున్నారుట. జగన్ మీద నమ్మకం ఉంచినా తమకు న్యాయం జరగ లేదని భావిస్తున్నారు. ఇక మీదట చంద్రబాబు వచ్చినా జగన్ మళ్ళీ వచ్చినా రాయల‌ సీమ కధ లో ఎలాంటి మార్పూ రాదని నిర్దారణకు వచ్చేశామని కూడా అంటున్నారు. మొత్తానికి సీమ నిర్వేదానికి సరైన తీరులో పరిష్కారం కనుగోనక పోతే అది రాజకీయం గానే కాదు అన్ని విధాలుగా ఇబ్బందులు తెచ్చే ప్రమాదం ఉంది. మరో వైపు శ్రీ భాగ్ ఒప్పందానికి కోస్తా పెద్దలతో సహా  అంతా కట్టుబడి ఉండాల్సిన తరుణం కూడా ఇదే అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.
Tags:    

Similar News