'నాటో' రంగంలోకి.. రష్యాతో ఫైట్ తప్పదా?

Update: 2022-12-28 06:30 GMT
2022 మరికొన్ని రోజుల్లో కాలగర్భంలో కలిసిపోతోంది. 2023లో పరిస్థితులు ఎలా ఉంటాయోనని వివిధ రంగాలకు చెందిన వారు ఇప్పటికే అంచనా వేసుకుంటున్నారు. కొందరు జ్యోతిష్యులు చెబుతున్న ప్రకారం 2023 ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు గడ్డు పరిస్థితులే ఉంటాయని అంటున్నారు. ముఖ్యంగా ప్రపంచం మొత్తం యుద్ధ వాతావరణంతో నిండిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

జ్యోతిష్యుల వాదన అటుంచితే.. ఇప్పుడు అచ్చం అలాంటి పరిణామాలే చోటుచేసుకుంటున్నాయి. యూరప్ లో పరిస్థితులు చేజారుతున్నాయి. దేశాల మధ్య యుద్ధాలు భీకరమయ్యే ప్రమాదం ఉందని తెలుస్తోంది. ప్రధానంగా తైవాన్ ను ఆక్రమించుకునేందుకు చైనా ఇప్పటికే తీవ్రంగా ప్రయత్నిస్తోంది. తాజాగా చైనాకు చెందిన 84 విమానాలు తైవాన్ గగనతలంలో చక్కర్లు కొట్టాయి. అటు రష్యా, ఉక్రెయిన్ల మధ్య జరుగుతున్న పోరు మరింత ఉధృతంగా మారే ప్రమాదం ఉందని తెలుస్తోంది. తాజాగా రష్యాతో స్నేహంగా మెలిగిన సెర్బియాపై నాటో దళాలు దాడికి వెళ్తున్నాయి. ఇప్పటికే సెర్బియా అధ్యక్షుడు ఉసిక్ కు హెచ్చరికలు వెళ్లాయి.

రష్యా, ఉక్రెయిన్ల మధ్య యుద్ధ వాతావరణం ఇప్పట్లో సమసినట్లు కనిపించడం లేదు. ఇరు దేశాలు పోటా పోటీ  బాంబుల దాడులు కొనసాగిస్తూనే ఉన్నాయి. ఎవరికి వారు తగ్గకుండా పోరాటం చేస్తుండడంతో 2023 సంవత్సరం కూడా యుద్ధం కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్ కు యూరప్ దేశాలు నేరుగా కాకుండా పరోక్షంగా మద్దతు ఇస్తూ ఆయుధ సాయం చేస్తుండడంతో రష్యాపై ఉక్రెయిన్ పోరు కొనసాగిస్తోంది. ఇదే సమయంలో రష్యా మిత్ర దేశాలను కూడా విడిచిపెట్టడం లేదు. ఇప్పటి వరకు రష్యా సహకారంతో దర్జాగా ఉన్న సెర్బియా ఇప్పుడు నాటో దళాల దాడిని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

తాజాగా యూరప్ దేశాలైన అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ దేశాలన్నీ కలిసి సెర్బియాను హెచ్చరించారు. కొసావో స్వతంత్ర్యం కోసం పోరాడుతోంది. కోసావాతో సెర్బియాకు ఉన్న గొడవలకు సంబంధించి, కొసావో ప్రజలను ఆపడానికి ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని నాటో దేశాలు హెచ్చరించాయి. హెచ్చరికలు జారీ చేసిన 24 గంటల తరువాత నాటో బృందంపై సెర్బియా నుంచి కాల్పులు జరిగాయి. దీంతో నాటో దళాలు సెర్బియాపై యుద్ధానికి రెడీ అవుతున్నారు.

కొసావో; లేక కొసోవ్ ఒక వివాదాస్పదమైన భూభాగంగా సెర్బియా దేశంలో  అంతర్భాగంగా ఉంది. ఇది పాక్షికంగా గుర్తించబడిన రాజ్యం. ఆగ్నేయ ఐరోపా‌లో ఉన్న కొసావో 2008లో సెర్బియా నుండి " కొసావో రిపబ్లిక్ "గా స్వాతంత్ర్యం ప్రకటించింది. కొసావో కేంద్ర బాల్కన్ ద్వీపకల్పంలోని భూబంధిత దేశంగా ఉంది. అయితే కోసావోను స్వతంత్ర దేశంగా గుర్తించడానికి సెర్బియా ఒప్పుకోవడం లేదు. తమ ప్రాంతంలోనిదే అంటూ అక్కడి ఆందోళనలను అణిచివేస్తోంది.

యూరోపియన్ యూనియన్ (ఈయూ)లో చేరడానికి 'కొసావో' దరఖాస్తు చేసుకుంది. అయితే ఇంకా ఆ ప్రక్రియ పూర్తికాకుండా సెర్బియా కొసావోపై కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. ఈ క్రమంలో నాటో దళాలు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. అయితే ఇంతకాలం సెర్బియాకు అండదండగా ఉన్న రష్యా ఇప్పుడున్న పరిస్థితుల్లో తన సైన్యాన్ని సెర్బియా కోసం పంపించే అవకాశం లేదు. ఈ పరిస్థితిని గమనించిన ఈయూ దేశాలు సెర్బియాపై దాడులు దిగేందుకు రెడీ అవుతున్నారు.

ఉక్రెయిన్ నాటో సభ్య దేశం కానందున రష్యా, ఉక్రెయిన్ల మధ్య జరుగుతున్న యుద్ధంలోకి నాటో దళాలు వెళ్లలేకపోతున్నాయి.. అయితే ఓవరాల్ గా రష్యాపై యుద్ధం చేయడానికి ఇప్పుడు కొసావో తరుపున సెర్బియాపై యుద్ధానికి వెళుతున్నారు. ఈ యుద్ధంలో సెర్బియా ఓడిపోతే రష్యా మిత్ర దేశాన్ని తాము ఓడించినట్లు గా చెప్పుకోవచ్చు.  దీంతో రష్యాపై నేరుగా కాకుండా దాని మిత్ర దేశమైన సెర్బియాపై అటాక్ కు రెడీ అవుతోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News