సిద్ధూకు స‌వాలు త‌ప్ప‌దా?

Update: 2022-02-06 23:30 GMT
పంజాబ్‌లో అధికారాన్ని కాపాడుకోవడం కోసం కాంగ్రెస్ కష్టాలు ప‌డుతోంది. ఓ వైపు సొంత పార్టీ నేత‌ల్లో అసంతృప్తి.. మ‌రోవైపు సీఎం అభ్య‌ర్థి కోసం ఆధిప‌త్య పోరు.. ఇంకో వైపు ప్ర‌త్య‌ర్థి పార్టీల నుంచి పోటి.. ఇలా ఆ రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ప‌రిస్థితులు ప్ర‌తికూలంగా మారాయి. అయిన‌ప్ప‌టికీ ఎన్నిక‌ల్లో విజ‌యం కోసం ఆ పార్టీ తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తోంది. బ‌ల‌మైన అభ్యర్థుల‌ను బ‌రిలో దించి గెల‌వాల‌ని చూస్తోంది. అయితే ఆ పార్టీ పంజాబ్ పీసీసీ అధ్య‌క్షుడు న‌వ‌జోత్ సింగ్ సిద్ధూకు ఈ సారి ఎన్నిక‌ల్లో స‌వాలు త‌ప్ప‌ద‌నిపిస్తోంది. ఇక్క‌డ ఆయ‌న ప్ర‌త్య‌ర్థి బిక్ర‌మ్ సింగ్ మ‌జీఠియా కావ‌డ‌మే అందుకు కార‌ణం.

తీవ్ర వైరం..

పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు న‌వ‌జోత్ సింగ్ సిట్టింగ్ స్థానం అమృత్‌స‌ర్ (తూర్పు) ఇప్పుడు అంద‌రి దృష్టినీ ఆక‌ర్షిస్తోంది. సీఎం అభ్య‌ర్థిగా నిల‌బ‌డాల‌ని అనుకుంటున్న సిద్ధూకు ఇక్క‌డ విజ‌యం సాధించ‌డం అత్యావ‌శ్య‌కం. కానీ శిరోమ‌ణి అకాలీద‌ళ్ నుంచి బిక్ర‌మ్ సింగ్ ఆయ‌న‌కు తీవ్ర‌మైన పోటీ ఇచ్చేలా క‌నిపిస్తున్నారు. పంజాబ్ రాజ‌కీయాల్లో ఎంతో కాలం నుంచి వీళ్ల ఇద్ద‌రి మ‌ధ్య వైరం ఉంది. ఈ ఇద్ద‌రు నేత‌ల మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమంటుంద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. అసెంబ్లీ సాక్షిగా చాలా సార్లు ఘ‌ర్ష‌ణ పడ్డారు. ఇక బ‌హ‌రంగంగా ఒక‌రిపై మ‌రొక‌రు విమ‌ర్శ‌లు, తీవ్ర వ్యాఖ్య‌లు చేసుకున్న సంద‌ర్భాలు అనేకం.

అప్ప‌టి నుంచి..

న‌వ‌జోత్‌, బిక్ర‌మ్ సింగ్ మ‌ధ్య వైరం ఈ నాటిది కాద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. సిద్ధూ బీజేపీలో ఉన్న‌ప్ప‌టి నుంచి ఇది కొన‌సాగుతోంది. శిరోమ‌ణి అకాలీద‌ళ్‌తో బీజేపీకి పొత్తు ఉన్న‌ప్ప‌టికీ బిక్ర‌మ్ సింగ్పై సిద్ధూ విమ‌ర్శ‌లు చేస్తూనే వ‌చ్చారు. ఇక సిద్ధూ కాంగ్రెస్‌లోకి చేరిన త‌ర్వాత అవి మ‌రింత పెరిగాయి. శిరోమ‌ణి అకాలీద‌ళ్ అధినేత సుఖ్‌బీర్ సింగ్ బాద‌ల్ బావ‌మ‌రిది కూడా అయిన బిక్ర‌మ్‌పై మాద‌క‌ద్ర‌వ్యాల కేసులున్నాయి. దీంతో సిద్ధూ ఆ పార్టీ నేత‌ల‌పై ఆరోప‌ణ‌లు చేస్తూనే ఉన్నారు. ఆ పార్టీ వ‌ర్గాల్లో సిద్ధూపై పీక‌ల్లోతు కోపానికి ఇదే కార‌ణ‌మైంది. అందుకే ఇప్పుడు సిద్ధూపై పోటీకి బిక్ర‌మ్‌ను రంగంలోకి దించింది.

నిజానికి బిక్ర‌మ్‌కు అమృత్‌స‌ర్ నియోజ‌క‌వ‌ర్గానికి ఎలాంటి సంబంధం లేదు. ఆయ‌న మ‌జీఠా సిట్టింగ్ ఎమ్మెల్యే. అక్క‌డి నుంచే మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ ఈ సారి మాత్రం త‌న భార్య‌ను అక్క‌డ బ‌రిలో దింపి ఆయ‌న సిద్ధూపై పోటీకి సిద్ధ‌మ‌య్యారు. దీన్ని బ‌ట్టి ఈ ఇద్ద‌రి నేత‌ల మ‌ధ్య వైరం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. ఇక ఇక్క‌డ ఆమ్ ఆద్మీ త‌ర‌పున జీవ‌న్ జ్యోత్ కౌర్‌, బీజేపీ నుంచి మాజీ ఐఏఎస్ అధికారి జ‌గ్‌మోహ‌న్ సింగ్ పోటీ చేస్తున్నారు. మ‌రి ఈ స‌వాలును దాటి న‌వ్‌జోత్ విజ‌యం అందుకుంటారేమో చూడాలి.

Tags:    

Similar News