విజయమ్మను అంత మాట అనటమా? గతాన్ని మర్చిపోయారా సాకే?

Update: 2021-07-09 04:39 GMT
రాజకీయాల్లో తల పండిన నేతలుగా పేరున్న వారు.. గతాన్ని అప్పుడప్పుడు మర్చిపోతుంటారు. కానీ.. ప్రజలకు మాత్రం అంత తేలిగ్గా మర్చిపోరు. రాజకీయ నేతలు తమకు అనుకూలంగా మాట్లాడటం.. పరిస్థితులకు తగ్గట్లుగా వ్యాఖ్యలు చేయటం.. చేదు అనుభవాల్ని మర్చిపోవటం లాంటివి చేస్తుంటారు. తాజాగా అలాంటి పనే చేశారు ఏపీకి చెందిన ఏపీ పీసీసీ అధ్యక్షుడు మాజీ మంత్రి సాకే శైలజానాథ్. తాజాగా కాంగ్రెస్ పార్టీపై విజయమ్మ చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు.

తన కుమార్తె తెలంగాణలో పార్టీని ఏర్పాటు చేస్తున్న వేళ.. విజయమ్మ కీలక వ్యాఖ్యలు చేయటం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీపై ఆమె విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ తమ కుటుంబాన్ని రోడ్డును పడేసిందంటూ విజయమ్మ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచనలంగా మారాయి. దీనిపై సాకే శైలజానాథ్ తీవ్రంగా స్పందించారు. విజయమ్మ వ్యాఖ్యల్ని తాను ఖండిస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా విజయమ్మపై ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి మీ కుటుంబ సభ్యులే ద్రోహం చేశారంటూ ఎదురుదాడికి దిగటం గమనార్హం.

‘‘విజయమ్మ చర్యతో వైఎస్సార్ ఆత్మక్షోభిస్తుంది. వైఎస్సార్ పేరును అమ్ముకోవటం మానుకోండి విజయమ్మ గారు. మీ బిడ్డల గురించి మార్కెటింగ్ మానుకోండి’’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే.. శైలజానాథ్ వ్యాఖ్యల్ని పలువురు తప్పు పడుతున్నారు. దివంగత మహానేత వైఎస్ మరణం తర్వాత.. కాంగ్రెస్ అధిష్ఠానం తీసుకున్న నిర్ణయాల్ని గుర్తు చేసుకోవాలని చెబుతున్నారు. తండ్రి మరణంతో వేదనతో పలువురు తనువు చాలించిననేపథ్యంలో.. అలాంటి వారిని ఓదార్చేందుకు వీలుగా ఓదార్పు యాత్రను చేపట్టటం.. దీన్ని అధిష్ఠానం తీవ్రంగా పరిగణించటం తెలిసిందే. ఆ సందర్భంగానే జగన్ మీద చర్యలు తీసుకుంది కాంగ్రెస్ పార్టీ.

వైఎస్ లాంటి మహానేత మరణించినప్పుడు.. ఆయన కుటుంబ సభ్యులు ఓదార్పుయాత్రను చేపడితే వచ్చే నష్టం ఏమిటన్న వాదన అప్పట్లో బలంగా వినిపించేది. అంతేకాదు.. కాంగ్రెస్ నేతల దన్ను ఉన్న జగన్ ను ముఖ్యమంత్రిని చేసే విషయంలో కాంగ్రెస్ అనుసరించిన విధానాన్ని పలువురు తప్పు పడతారు. తాము చెప్పినట్లుగా వినాలన్న అల్టిమేటంతో పాటు.. హెచ్చరికలు తెలిసిందే. ఇలాంటివి చోటు చేసుకున్న తర్వాతే కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ జగన్ బయటకు వచ్చారే కానీ.. మరో కారణంతో కాదన్న విషయాన్ని సాకే శైలజానాథ్ మర్చిపోకూడదని హితవు పలుకుతున్నారు. ఇప్పటికి కాంగ్రెస్ నేతలు తాము చేసిన తప్పుల్ని పట్టించుకోకుండా విజయమ్మ  మీద విరుచుకుడితే.. వారికే నష్టమన్న విషయాన్ని సాకే లాంటి నేతలు ఎప్పటికి గుర్తిస్తారో?
Tags:    

Similar News