రెచ్చిపోయిన తీన్మార్ మల్లన్న.. బీసీ యుద్ధబేరిలో వివాదాస్పద వ్యాఖ్యలు!
వచ్చే ఎన్నికల తర్వాత బీసీ నాయకుడే తెలంగాణ సీఎం అవుతారంటూ జోస్యం చెప్పారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మరోసారి రెచ్చిపోయారు. వరంగల్ లో నిర్వహించిన బీసీ రాజకీయ యుద్ధభేరిలో రెండు ప్రధాన సామాజికవర్గాలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో రేవంత్ రెడ్డే చివరి ఓసీ సీఎం అంటూ వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల తర్వాత బీసీ నాయకుడే తెలంగాణ సీఎం అవుతారంటూ జోస్యం చెప్పారు.
కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్సీగా ఎన్నికైన తీన్మార్ మల్లన్న ఎప్పటికప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటారని విమర్శలు వినిపిస్తున్నాయి. బీసీ ఉద్యమ నేతగా ఎదగాలనే తన ఆకాంక్షను నెరవేర్చుకోడానికి ఓసీ సామాజిక వర్గాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఆయనకు పరిపాటుగా మారిందని పలువురు నేతలు ఆరోపిస్తున్నారు. ఇక తాజాగా బీసీ యుద్ధభేరిలో కూడా తీన్మార్ మల్లన్న పరుష పదజాలం వాడారు. రాయడానికి వీలు లేని భాష ప్రయోగించారు. జనాభాలో 50 శాతం ఉన్న బీసీలే తెలంగాణకు అసలైన ఓనర్లని వ్యాఖ్యానించారు.
బీసీల నుంచి ఏడాదికి లక్షా 20 వేల కోట్ల రూపాయల ఎకానమీ సంపాదిస్తున్న ప్రభుత్వం వారి సంక్షేమానికి కేవలం 9 వేల కోట్లు మాత్రమే కేటాయిస్తోందని విమర్శించారు. పిరికెడు మందిలేని వారు 60 మంది ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఇకపై అలా ఉండొద్దు.. నిన్నటిదాకా ఒక లెక్క ఇప్పటి నుంచి మరోలెక్క. రెడ్లు, వెలమలు అసలు తెలంగాణ వారే కాదంటూ ఆరోపించారు. ఇకపై రెడ్డి, వెలమలకు మాకు విడాకులే.. దానికి ఈ సభే వేదిక. బీసీలకు మీ ఓట్లు వద్దు అంటూ ప్రకటించారు. స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని, బీఆర్ఎస్ పార్టీని కొనేసే శక్తి బీసీలకు ఉందని వ్యాఖ్యానించారు.
బీసీ యుద్ధభేరిలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సామాజిక వర్గాల మధ్య చిచ్చు రేపేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని ఓసీ సామాజికవర్గం నేతలు మండిపడుతున్నారు. బీసీ నేతగా ఎదగాలంటే కష్టపడి పనిచేయాలని, వారికి సేవ చేసి ఉన్నత స్థానానికి రావాలని, కానీ, రెచ్చగొట్టడం ద్వారా ఎలాంటి ప్రయోజనం ఉండదని ఆయా సామాజికవర్గ నేతలు సూచిస్తున్నారు. గతంలో కూడా తీన్మార్ మల్లన్న ఇలాంటి వ్యాఖ్యలే చేశారని అంతా గుర్తు చేస్తున్నారు.