తెలంగాణ కాంగ్రెస్ కు సరికొత్త వ్యూహకర్త వచ్చేశారా?

Update: 2022-02-25 04:37 GMT
గతానికి భిన్నమైన పరిస్థితులు దేశ రాజకీయాల్లో కనిపిస్తున్నాయి. ఒకప్పుడు రాజకీయాల్లో రాణించాలంటే రాజకీయ నాయకుడిగా తల పండిన అనుభవం ఉండాల్సిన అవసరం ఉండాలన్న భావన ఉండేది. ఆ భావనను తీసి పారేసేలా చేసిన ఘనత మాత్రం ప్రశాంత్ కిశోర్ దేనని చెప్పాలి. ఎలాంటి రాజకీయ అనుభవం కానీ.. ఎలాంటి రాజకీయ పదవిని చేపట్టకుండానే..రాజకీయ పార్టీలను అధికార పార్టీగా అవతరించే విషయంలో అనుసరించే ఆయన వ్యూహం దేశ రాజకీయ సమీకరణాల్ని మాత్రమే కాదు.. ఎత్తుగడలను మార్చేసింది.

ప్రశాంత్ కిశోర్ అలియాస్ పీకే తీరు దేశ రాజకీయాలకు వరమా? శాపమా? అన్నది వేరే ప్రశ్న. కానీ.. రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తి రాజకీయాల్ని తన కంట్రోల్ లోకి తెచ్చుకోవటం.. తాను ఏ రాష్ట్రంలో అయినా.. ఏ పార్టీకి సేవలు అందిస్తే.. సదరు పార్టీ అధికార పార్టీగా అవతరిస్తుందన్న ట్రాక్ రికార్డును సొంతం చేసుకున్నారని చెప్పాలి.

ఇదిలా ఉంటే.. తాజాగా తెలంగాణ అధికార పక్షమైన టీఆర్ఎస్ పీకే ఆధ్వర్యంలో నడుస్తోందన్న అనుమానాలు ఉన్నాయి.  అందుకు తగ్గట్లే ఇటీవల కాలంలో ఆ పార్టీ అనుసరిస్తున్న విధానాలు.. వేస్తున్న అడుగులు రోటీన్ కు భిన్నంగా ఉన్నాయని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే.. పీకే వ్యూహాలను అధిగమించేందుకు కాంగ్రెస్ ముల్లును మల్లుతోనే తీయాలన్న పాత సామెతను ఫాలో అవుతున్నారు.

పీకే టీంలో కీలకంగా వ్యవహరించిన సునీల్ కణుగోలును తెలంగాణ కాంగ్రెస్ కు సలహాలు.. సహాయ సహకారాలు అందించేందుకు వీలుగా సిద్దం చేసుకుందని చెబుతున్నారు. తమిళనాడులో అన్నాడీఎంకే దారుణ పరాజయానికి బదులు.. గౌరవ ప్రదమైన సీట్లు.. బలమైన పోటీ ఇవ్వగలిగిన రాజకీయ పక్షంగా అవతరించిందంటే దానికి కారణం సునీల్ గా చెబుతారు. పీకే టీంలో కీలకంగా వ్యవహరించి.. ఈ మధ్యనే బయటకు వచ్చేసి.. సొంతంగా తన పని తాను చేసుకుంటున్న సునీల్ ఇప్పుడు తెలంగాణ.. కర్ణాటక రాష్ట్రాల్లోని కాంగ్రెస్ పార్టీకి వ్యూహకర్తగా వ్యవహరిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఒప్పందం పూర్తి అయ్యింది.

ఈ నేపథ్యంలో అంతర్గత కుమ్ములాటల్లో మునిగే పార్టీలో.. నేతల మధ్యన సయోధ్య విషయంలో ఆయన కీ రోల్ ప్లే చేస్తున్నట్లు చెబుతున్నారు. ఇటీవల తిరుగుబాటు స్వరం వినిపించి.. సొంతంగా పార్టీ పెట్టుకోవటానికి సిద్ధమైన జగ్గారెడ్డిని కంట్రోల్ చేయటం.. ఆయన్ను బుజ్జగించటంలో సునీల్ టీం కీలక భూమిక పోషించినట్లుగా చెబుతున్నారు.

మరి.. వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ కు.. కాంగ్రెస్ మధ్యనే పోటీ అంతా అన్న భావన తేవటంలో సునీల్ సక్సెస్ అవుతారా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. అదే చేయగలిగితే.. ఆయనకు దేశీయంగా మరింత డిమాండ్ పెరగటం ఖాయమంటున్నారు.
Tags:    

Similar News