మునుగోడులో ఓటుందా? రూ.30వేలు మీవే!

Update: 2022-09-03 04:35 GMT
రెండు తెలుగు రాష్ట్రాల్లో అందరి చూపు ఇప్పుడు మనుగోడు మీదనే ఉంది. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్నిపూర్తిగా మార్చేయటంతో.. అంతో ఇంతో ఏపీ రాజకీయాల మీదా ప్రభావితం చూపే అవకాశం మునుగోడు ఉప ఎన్నిక మీద ఉందని చెప్పక తప్పదు. సీనియర్ కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. బీజేపీ తీర్థం పుచ్చుకోవటంతో అనివార్యమైన ఈ ఉప ఎన్నికకు సంబంధించి ఇప్పటివరకు అధికారికంగా నోటిఫికేషన్ వెల్లడైంది లేదు.

అన్ని అనుకున్నట్లు జరిగితే మరోరెండు.. మూడు నెలల్లో నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఇలాంటివేళ.. ఓటర్లను ప్రసన్నం చేసుకోవటానికి అధికార టీఆర్ఎస్ తో పాటు విపక్ష బీజేపీ.. కాంగ్రెస్ లు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రతి ఒక్క పార్టీకి జీవన్మరణ సమస్యగా తయారైన మునుగోడు ఉప ఎన్నికల్లో తమకు అనుకూలంగా ఫలితాన్ని మార్చుకునేందుకు ఉన్న ఏ చిన్న అవకాశాన్ని విడిచిపెట్టేందుకు ఎవరూ ఇష్టపడటం లేదు.

మూడు ప్రధాన రాజకీయ పార్టీలు మునుగోడు ఉప పోరును ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవటంతో ఓటర్లకు నోట్ల వరద పారించేందుకు సిద్ధమవుతున్నట్లు చెబుతున్నారు. ఇప్పటివరకు వినిపిస్తున్న అంచనాల ప్రకారం మూడు ప్రధాన రాజకీయ పార్టీలు ఓటర్లకు రూ.10వేల చొప్పున ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు చెబుతున్నారు. అంటే.. మూడు పార్టీలకు కలిపి ఒక్కో ఓటరుకు రూ.30 వేల వరకు అందే వీలుందన్న మాట వినిపిస్తోంది.

ఓటు విలువ భారీగా పెరిగిపోయిన నేపథ్యంలో..మునుగోడుకు చెందిన పలువురు ఇంతకాలం బయటప్రాంతాల్లో ఉన్న వారు సైతం తమ ఓట్లను ఓటరు జాబితాలో చేర్చుకునేందుకు పెద్ద ఎత్తున ఆసక్తిని ప్రదరశిస్తున్నారు. బయట ప్రాంతాల్లోని వారు తమ ఓటును మునుగోడుకు బదిలీ చేసే ప్రక్రియను షురూ చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఈ వైఖరి ఇతర రాష్ట్రాల్లో స్థిరపడినవారు సైతం చేసుకోవటం విశేషం.

ఇక.. ఇప్పటివరకు ఓటుహక్కు లేని వారు సైతం.. తమకున్న అవకాశాన్ని వదులుకోకూడదన్నట్లుగా.. ఓటరు నమోదు కోసం పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా వెలుగు చూసిన గణాంకాలు సైతం ఈ వాదనలో పస ఉందన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఆగస్టు 2 నుంచి సెప్టెంబరు 2 మధ్యలో మునుగోడు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో కలిపి 13 వేల మంది ఓట్ల కోసం దరఖాస్తు చేసుకోవటం గమనార్హం.

ఇందులో 8 వేలకు పైగా ఓట్లు మునుగోడుకు బయట ఉండే ప్రాంతాల వారు మునుగోడుకు తమ ఓటును బదిలీ చేసుకునేందుకు ఆసక్తిని ప్రదర్శిస్తూ అప్లికేషన్లు పెట్టుకోవటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రానున్న రోజుల్లో ఈ తరహా ఓట్ల బదిలీ కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతుందని.. భారీగా దరఖాస్తులు రావటం ఖాయమంటున్నారు. ఓటు నమోదు కోసం పెద్ద ఎత్తున వస్తున్న అప్లికేషన్ల నేపథ్యంలో దీనికి సంబంధించిన బాధ్యతను ప్రత్యేకంగా కొందరు అధికారులకు జిల్లా కలెక్టరర్ వినయ్ క్రిష్ణారెడ్డి నిర్ణయించారు.

కొత్తగా ఓటు కోసం అప్లికేషన్ పెట్టుకున్న వారు స్థానికంగా ఉంటున్నారా? వారు జత చేసిన ధ్రువీకరణ పత్రాలు సరిగా ఉన్నాయా? లేవా? అన్న వివరాల్ని తనిఖీ చేసేందుకు పెద్ద ఎత్తున సిబ్బందిని కేటాయిస్తున్నారు. మిగిలిన విషయాలు ఎలా ఉన్నా.. మునుగోడులో నమోదు అవుతున్న వేలాది కొత్త ఓటర్లు ఉప పోరు ఫలితాన్ని ఏ రీతిలో ప్రభావితం చేస్తారన్నది ఇప్పుడు మరో చర్చకు తెర తీసినట్లుగా చెప్పక తప్పదు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News