మోడీ కి వచ్చే సీట్స్ అవేనా..?

Update: 2019-04-27 14:30 GMT
భారతీయ జనతా పార్టీకి గత ఎన్నికల్లో వచ్చిన స్థాయిలో మాత్రం సీట్లు వచ్చే అవకాశాలు లేవని అన్ని సర్వేలూ తేల్చేస్తున్నాయి. గత ఎన్నికల్లో బాగా సీట్లు వచ్చిన రాష్ట్రాల్లోనే ఈ సారి బీజేపీకి సీట్లు బాగా తగ్గిపోతాయనేదే అందరూ చెబుతున్న మాట. పైకి అయితే కమలనాథులు తమకు గతానికి మించిన స్థాయిలో ఎంపీ సీట్లు వస్తాయని అంటున్నారు కానీ, వాస్తవంలో మాత్రం పరిస్తితి అలా లేదని తేటతెల్లం అవుతూ ఉంది.

గతంలో బీజేపీ స్వీప్ చేసిన రాష్ట్రాల్లో ఈ సారి ఆ పరిస్థితి లేకపోవడమే ఈ సారి ఆ పార్టీకి సీట్ల సంఖ్య బాగా తగ్గిపోయేలా చేస్తోందని సమాచారం.

యూపీలో గత ఎన్నికల్లో బీజేపీకి తొంభై శాతం ఎంపీ సీట్లు దక్కాయి. అయితే అక్కడ ఈ సారి ఎస్పీ-బీఎస్పీలు జత కలిశాయి. ఆ రాష్ట్రంలో రెండు బలమైన ప్రాంతీయ పార్టీలు చేతులు కలపడంతో కమలం పార్టీకి విజయం తేలిక కాదని స్పష్టం అవుతోంది. బీజేపీ బాగా రానిస్తే ఆ పార్టీకి వచ్చేది ముప్పై ఎంపీ సీట్ల వరకూ అని అంచనా! అక్కడే కమలం పార్టీకి నలభై వరకూ ఎంపీ సీట్లు తగ్గిపోయే అవకాశాలున్నాయి.

ఇక రాజస్తాన్, మధ్యప్రదేశ్, బిహార్ లలో కూడా గత ఎన్నికల్లో బీజేపీ స్వీప్ చేసినంత పని చేసింది. ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ ను, ప్రాంతీయ పార్టీలనూ చిత్తు చేసి బీజేపీ సంచలన విజయం సాధించింది. అయితే ఈ సారి ఈ రాష్ట్రాల్లోనూ బీజేపీ వెనుకంజ వేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి.

ప్రత్యేకించి రాజస్తాన్, మధ్యప్రదేశ్ లలో ఇటీవలే అసెంబ్లీ ఎన్నికల్లో కమలం పార్టీ అధికారాన్ని కోల్పోయింది కూడా. ఇప్పుడు ఈ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. సహజంగానే ఆ ప్రభావం పడే అవకావాలున్నాయి. ఐదేళ్ల వ్యతిరేకత, కాంగ్రెస్ ఆ రాష్ట్రాల్లో అధికారంలో ఉండటం.. ఈ రెండూ కూడా అక్కడ బీజేపీని దెబ్బతీసే అవకాశాలున్నాయి.

ఒక్క బిహార్ లో మాత్రమే భారతీయ జనతా పార్టీ పరిస్థితి మెరుగ్గా కనిపిస్తూ ఉంది. అక్కడ నితీష్ కుమార్ పార్టీతో కలిసి బీజేపీ కాస్తో కూస్తో సీట్లను సంపాదించుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి.

ఏతావాతా.. హిందీ మాట్లాడే ప్రాంతాల్లో, ఆ రాష్ట్రాల్లో బీజేపీకి భారీ గా సీట్లు మైనస్ అయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తూ ఉన్నాయి. అందుకే కమలం పార్టీ రెండు వందల ఇరవై సీట్ల స్థాయికి పడిపోయినా, అంతకన్నా ఇంకాస్త కిందకే వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
Tags:    

Similar News