జగన్‌ లో వచ్చిన ఈ మార్పు మంచికేనా?

Update: 2022-12-20 02:30 GMT
2019లో వైసీపీ గెలిచాక వైఎస్‌ జగన్‌ సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ప్రజలకు వివిధ సంక్షేమ పథకాలు, పింఛన్లు ఇలా వివిధ పథకాల లబ్ధిని ప్రజలకు నేరుగా వలంటీర్లు, సచివాలయాల వ్యవస్థ ద్వారానే అందిస్తున్నారు. దీంతో మంత్రులు, ఎమ్మెల్యేలు అసంతృప్తి చెందుతున్నారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

అన్ని పథకాలను సచివాలయాలు, వలంటీర్ల ద్వారానే అందిస్తుండటంతో ప్రజాప్రతినిధుల అవసరమే ప్రజలకు పట్టడం లేదని.. ఎవరూ తమను పట్టించుకోవడం లేదనే భావనను కొంతమంది ఎమ్మెల్యేలు సైతం వ్యక్తం చేశారు. ఇలా అయితే వచ్చే ఎన్నికల్లో ప్రజలకు తమకు ఎలా ఓటేస్తారని వైసీపీ ఎమ్మెల్యేలు మథనపడినట్టు గాసిప్స్‌ వినిపించాయి.

ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో 175 కి 175 సీట్లు సాధించాలని ఉవ్విళ్లూరుతున్న సీఎం జగన్‌ ఎమ్మెల్యేలు, మంత్రుల అసంతృప్తిని గమనించారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ దిశగా ఆయన ఇటీవల గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో సంకేతాలు కూడా ఇచ్చారని అంటున్నారు.

జనవరిలో ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ట్యాబులు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. బైజూస్‌ ఎడ్యుటెక్‌ కంపెనీ కంటెంట్‌ ను ఆ ట్యాబుల్లో అప్‌ లోడ్‌ చేయించి అందించనుంది.

ఈ నేపథ్యంలో గతంలో అయితే వీటిని వలంటీర్లు, సచివాలయాల సిబ్బందే ఇవ్వాల్సి వచ్చేది. అయితే ప్రజాప్రతినిధులు వీలైనంత మేర ప్రజలకు అందుబాటులో ఉండాలని.. వారిని తరచూ కలుస్తూ ఉండాలని జగన్‌ చెబుతున్న నేపథ్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలు చేతుల మీదుగా విద్యార్థులకు ట్యాబులు ఇప్పించాలని జగన్‌ నిర్ణయించారు.

అదేవిధంగా.. జనవరిలోనే డ్వాక్రా సంఘాల రుణమాఫీలో భాగంగా వైఎస్సార్‌ ఆసరా కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహించనుంది. ఇందులో భాగంగా ఆయా డ్వాక్రా సంఘాలకు మూడో విడత రుణమాఫీలో భాగంగా చెక్కులను అందించనుంది. ఈ కార్యక్రమంలోనూ ఎమ్మెల్యేలు, మంత్రులు పాల్గొనాలని జగన్‌ సూచించారు.

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాదికి పైగా సమయం ఉంది. ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్యేలు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ తిరుగుతున్నారు. అలాగే వారిని మరింత ప్రజలకు చేరువ చేయడానికి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల్లో వారిని భాగస్వాములను చేయాలని జగన్‌ నిర్ణయించారు. దీంతో వారిలో ఉత్సాహం కనిపిస్తోంది. సీఎంలో కనిపించిన మార్పు పార్టీకి కూడా మంచిదేనని భావిస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News