మూడు రాజధానులే ప్రధాన ఎజెండానా?

Update: 2022-09-14 06:42 GMT
వచ్చే ఎన్నికల్లో ప్రధాన ఎజెండాను సెట్ చేయటంలో వైసీపీకి బాగా క్లారిటీ ఉన్నట్లుంది. మూడు రాజధానులే ప్రధాన ఎజెండాగా 2024 ఎన్నికలను ఎదుర్కోబోతున్నట్లు మంత్రి అమర్ నాథ్ చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఏ అంశం ఆధారంగా ఎన్నికల్లో ప్రజా మద్దతు కూడగట్టాలని వైసీపీలో క్లారిటీ ఉన్నపుడు మరి తెలుగుదేశం పార్టి ఏం చేయబోతోంది ? మూడు రాజధానులు వద్దని అమరావతి మాత్రమే ఏకైక రాజధానిగా ఉండాలని చంద్రబాబు నాయుడు పదే పదే డిమాండ్ చేస్తున్నారు.

అమరావతికి అనుకూలంగా డిమాండ్ చేస్తున్నారే కానీ ఇదే అంశంపై వచ్చే ఎన్నికల్లో జనాల మద్దతును కూడగడతామని ఎప్పుడూ చెప్పలేదు. కాకపోతే జగన్ ప్రతిపాదించిన మూడు రాజధానుల విషయంలో ప్రజల తీర్పు కోరాలని మాత్రమే చంద్రబాబు అండ్ కో డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వాన్ని రద్దు చేసి మూడు రాజధానులకు జనామోదం కోరాలని మాత్రమే చంద్రబాబు, అచ్చెన్నాయుడు లాంటి వాళ్ళు పదే పదే చెప్పారు.

ఈ డిమాండును అధికారపార్టీ పట్టించుకోలేదు. అవసరమైతే టీడీపీ ఎంఎల్ఏలే రాజీనామాలు చేసి ఉపఎన్నికలకు వెళ్ళాలని మంత్రులు ఎదురుదాడి చేశారు. దాంతో ఆ విషయం వివాదాస్పదమైపోయింది. ఈ వివాదాలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు ఇలా ఉంటూనే ఉంటాయి.

ఈ విషయం ఇలాగుండగానే రాష్ట్రంలో జరిగిన స్ధానిక సంస్ధల ఎన్నికల్లో వైసీపీ అఖండ విజయం సాధించింది. మరి ఈ నేపథ్యంలో జగన్ ప్రతిపాదించిన మూడు రాజధానులకు జనాల మద్దతున్నట్లేనా ? అన్నదే తేలలేదు.

గుంటూరు, విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీకి ఓట్లేయద్దని చంద్రబాబు చెప్పినా జనాలు మాత్రం అధికార పార్టీనే గెలిపించారు. సరే స్ధానికసంస్ధల ఎన్నికల్లో అధికార పార్టీ గెలవటం పెద్ద విషయం కాదు. కాబట్టి దాన్ని ప్రామాణికంగా తీసుకునేందుకు లేదు.

అందుకనే వచ్చే ఎన్నికల్లో మూడు రాజధానులే ముఖ్యమైన ఎజెండాగా ప్రజాభిప్రాయాన్ని కూడగడతామని మంత్రి తాజాగా చెప్పారు. కాబట్టి ఏ అంశంతో ఎన్నికలను ఎదుర్కోవాలన్నది టీడీపీనే డిసైడ్ చేసుకోవాలి.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News