ఏపీ మాదిరిగానే యూపీలోనూ అంతేనా?

Update: 2022-09-07 05:18 GMT
ఏ రాష్ట్రంలో అయినా అధికారంలోకి రావాలంటే బీజేపీ చెప్పే మాట‌.. కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే పార్టీ ప్ర‌భుత్వం ఉండాలి అని. దేశంలోనే ఎమ్మెల్యేలు, ఎంపీల సంఖ్య ఆధారంగా పెద్ద రాష్ట్రమైన ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో గ‌త రెండు ప‌ర్యాయాలుగా బీజేపీనే అధికారంలో ఉంది. కేంద్రంలో మోదీ ప్ర‌భుత్వం ఉంది. బీజేపీ నేత‌లు చెబుతున్న డ‌బుల్ ఇంజ‌న్ స‌ర్కార్ కేంద్రంలో, యూపీలో ఉంది. అయినా ఏకంగా 20 వేల మంది ఉద్యోగుల‌కు ఏడు నెల‌లుగా జీతాలు ఇవ్వ‌లేని దుస్థితిలో యూపీలోని యోగి ప్ర‌భుత్వం ఉంద‌ని మీడియా క‌థ‌నాలు పేర్కొంటున్నాయి.

దేశంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా యూపీ త్వరలోనే అవతరిస్తోంద‌ని.. ధనిక రాష్ట్రంగా మారుతోంద‌ని ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇటీవ‌ల కాలంలో ప్ర‌తి స‌భ‌లోనూ ఆర్భాటంగా ప్ర‌క‌టిస్తున్నారు. అయితే, క్షేత్ర‌స్థాయిలో వాస్త‌వాలు మాత్రం చేదుగా ఉన్నాయ‌ని అంటున్నారు.

ఏడు నెలలుగా జీతాలు లేక జల్‌ నిగమ్‌ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నార‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఏకంగా 20 వేల మందికి పైగా ఉద్యోగులు జీతాలంద‌క‌ అవస్థలు పడుతున్నారు. దీనిపై ప్ర‌తిప‌క్ష పార్టీలు మండిప‌డుతున్నాయి. బీజేపీ చెబుతున్న డ‌బుల్ ఇంజ‌న్ స‌ర్కారు ఫ‌లితాలు ఇవేనా అని నిల‌దీస్తున్నాయి.

గడిచిన ఏడు నెల‌లుగా తమకు వేతనాలు అందట్లేదని ఉత్తరప్రదేశ్‌ జల్‌ నిగమ్‌ (వాటర్‌ కార్పొరేషన్‌)కు చెందిన వేలాదిమంది ఉద్యోగులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. దీంతో నిత్యావ‌స‌ర‌రాల‌కు, పిల్ల‌ల చ‌దువుల‌కు, ఇంటి అద్దెల‌కు అప్పులు చేస్తున్నామ‌ని వాపోతున్నారు. పింఛన్‌ డబ్బులను కూడా విడుదల చేయట్లేదని విశ్రాంత ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిధుల విడుదలలో యోగి ఆదిత్య‌నాథ్ సర్కారు ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేస్తున్నదని నిప్పులు చెరుగుతున్నారు.

ఇప్ప‌టికే జీతం బకాయిల చెల్లింపు కోసం స‌మ్మె చేశామ‌ని ఇప్ప‌టికైనా బకాయిలను చెల్లించకపోతే మరోసారి నిరవధిక సమ్మెకు దిగుతామని ఉద్యోగులు బీజేపీ ప్ర‌భుత్వానికి హెచ్చ‌రిక‌లు జారీ చేశారు.  జీతాల చెల్లింపులు నిలిపివేయడంతో గత మార్చిలో జల్‌ నిగమ్‌కు చెందిన వందలాది మంది ఉద్యోగులు నిరసనలు చేప‌ట్టిన సంగ‌తి తెలిసిందే. దీంతో జనవరి వరకు ఉన్న బకాయిలను మాత్రమే యోగి ప్రభుత్వం అందించింది.

ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్‌, మే, జూన్‌, జూలై, ఆగస్టు వేతనాల విడుదలను యోగి ప్ర‌భుత్వం పెండింగ్‌లోనే ఉంచింది. ఇంకా వీటిని విడుద‌ల చేయ‌లేదు. దీంతో ప్రస్తుత, రిటైర్డ్‌ ఉద్యోగులు మండిప‌డుతున్నారు. వేతనాలు, పింఛన్లు వెంటనే విడుదల చేయాలని.. లేకపోతే సెప్టెంబర్‌ 9న రాష్ట్రవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేపడుతామని హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. ఆ రోజున నల్లటి రిబ్బన్లు ధరించి 'బ్లాక్‌ డే'గా పాటిస్తామని ఉద్యోగులు పేర్కొన్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News