పీఎస్ఎల్వీకి తిరుగు లేదంతే!

Update: 2017-06-23 06:45 GMT
భార‌త అంత‌రిక్ష ప‌రిశోధ‌నా సంస్థ (ఇస్రో) మ‌రో విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకుంది. నేటి ఉద‌యం మొత్తం 31 ఉప‌గ్ర‌హాల‌ను నింగిలోని వివిధ క‌క్ష్య‌ల్లోకి ప్ర‌వేశ‌పెట్టేందుకు ఉద్దేశించిన పీఎస్ ఎల్వీ-సీ 38 ప్ర‌యోగం విజ‌య‌వంత‌మైంది. స‌రిగ్గా ఉద‌యం 9.29 గంట‌ల‌కు ప్ర‌యోగించిన పీఎస్ ఎల్వీ-38 నిర్ణీత స‌మ‌యంలోనే మొత్తం 31 ఉప‌గ్ర‌హాల‌ను ప‌ది క‌క్ష్య‌ల్లో ప్ర‌వేశ‌పెట్టేసింది. పీఎస్ ఎల్వీ-సీ 38 నింగిలోకి తీసుకెళ్లిన మొత్తం 31 ఉప‌గ్ర‌హాల్లో రెండు మాత్ర‌మే స్వ‌దేశానికి చెందిన‌వి కాగా... మిగిలిన 29 ఉప‌గ్ర‌హాలు 14 దేశాల‌కు చెందిన‌వి.

ఇప్ప‌టిదాకా ఒక క‌క్ష్య‌లోకి ఒక‌టి కంటే ఎక్కువ ఉప‌గ్ర‌హాల‌ను ప్ర‌వేశ‌పెట్టేందుకు ఒక రాకెట్‌ నే వాడే వారు. అయితే ఇస్రో ఈ ద‌ఫా... ఆ సంప్ర‌దాయానికి తెర వేసేసింది. మొత్తం ప‌ది క‌క్ష్య‌ల్లోకి ప్ర‌వేశ‌పెట్టేందుకు మొత్తం 31 ఉప‌గ్ర‌హాల‌ను ఆకాశానికి తీసుకెళ్లిన పీఎస్ ఎల్వీ- సీ38 దిగ్విజయంగా ప‌నిని పూర్తి చేసింది. అంటే దాదాపుగా అంత‌రిక్ష రంగంలో ఈ త‌ర‌హా ప్ర‌యోగం ఇప్ప‌టిదాకా జ‌ర‌గ‌లేదు. అయితే ఇప్ప‌టికే అగ్ర‌రాజ్యాల‌ను త‌ల‌ద‌న్నేలా అంత‌రిక్ష రంగంలో దూసుకెళుతున్న ఇస్రో... ఎన్ని క‌క్ష్య‌ల్లోకైనా ఉప‌గ్ర‌హాల‌ను ఒకే రాకెట్ ద్వారా పంప‌గ‌లిగే స‌త్తాను సంపాదించుకున్న‌ద‌న్న మాట‌. ఈ అరుదైన ప్ర‌యోగానికి కూడా నెల్లూరు జిల్లా శ్రీహ‌రికోట‌లోని షార్ నే ఇస్రో వేదిక‌గా ఎంచుకుంది.

ఈ అరుదైన ఫీట్ తో పాటు ప్ర‌పంచంలోని ఏ దేశం కూడా సాధించ‌లేని మ‌రో రికార్డును కూడా ఇస్రో సొంతం చేసుకుంది. కేవ‌లం 50 రోజుల వ్య‌వ‌ధిలో షార్ కేంద్రం నుంచి ఇస్రో మూడు ప్ర‌యోగాలు చేసింది. ఈ మూడు ప్ర‌యోగాలు కూడా స‌క్సెస్ కావడంతో ఇస్రో శాస్త్రవేత్త‌ల్లో రెట్టించిన ఉత్సాహం తొణికిస‌లాడుతోంది. ప్ర‌పంచంలోని ఏ దేశాల‌కు సాధ్యం కాని రీతిలో వ‌రుస విజ‌యాల‌ను న‌మోదు చేస్తున్న ఇస్రో... తాజా ప్ర‌యోగాన్ని కూడా విజ‌యవంతంగా ముగించ‌డంతో రాష్ట్ర‌ప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ స‌హా ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు శాస్త్ర‌వేత్త‌ల‌ను అభినందిస్తూ సందేశాలు పంపారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News