ఆ ఎమ్మెల్యే అక్ర‌మాస్తి జ‌స్ట్ 130 కోట్లు

Update: 2016-08-10 08:25 GMT
రాజ‌కీయాల్లో నాయ‌కులు ఎలా సంపాదిస్తున్నార‌నేందుకు  ఇదో ఉదాహ‌ర‌ణ‌. కొత్త రాజ‌కీయాల‌ను చేస్తామంటూ తెర‌మీద‌కు వ‌చ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ సైతం తాను ఆ తానులోని ముక్కేన‌ని నిరూపించుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే కర్తార్ సింగ్ తన్వర్ ఏకంగా 130 కోట్ల ఆస్తులు సంపాదించాడ‌ని తేల‌డం షాకింగ్‌లాగా మారింది.

ఆదాయం పన్నుశాఖ అధికారులు క‌ర్తార్ సింగ్ ఇంట్లో సోదాలు నిర్వహించగా రూ.130 కోట్ల అక్రమ సంపాదనను గుర్తించారు. తన్వర్, ఆయన సోదరుడి ఇంట్లో నుంచి సుమారు రూ. కోటి విలువైన బంగారు ఆభరణాలు, నగదు స్వాధీనం చేసుకొన్నారు. ఇటీవల రెండుసార్లు తన్వర్‌ను ప్రశ్నించిన ఐటీ శాఖ అధికారులు తాజాగా ఆయన ఇళ్ల‌పై దాడులు జరిపారు. గతంలో బీజేపీ నేత అయిన తన్వర్ 2014లో ఆప్‌లో చేరారు. ఢిల్లీ ప్రభుత్వాన్ని మోసగించి స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు ఎగొట్టి తన్వర్ భారీగా భూమి బదలాయింపులు చేశారని ఐటీ వర్గాలు తెలిపాయి. 30-35 కంపెనీల్లో ఆయనకు పెట్టుబడులున్నాయని పేర్కొన్నాయి. అక్రమ సంపాదన డాక్యుమెంట్లు, బీనామీ ఆస్తులు అనేకం ఉన్నాయని వెల్లడించాయి. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఐటీ దాడులకు ఉసిగొలుపుతున్నదని తన్వర్ ఆరోపించారు.

విప‌శ్య‌న ద్యాన కేంద్రంలో విశ్రాంతి పొందుతున్నందున ఆప్ అధినేత అర‌వింద్ కేజ్రివాల్ త‌మ ఎమ్మెల్యే అక్ర‌మాస్తుల  బాగోతంపై స్పందించ‌లేదు. వ‌చ్చే వారంలో ఆయ‌న తిరిగి ఢిల్లీకి రానున్నార‌ని, అపుడు ఈ ప‌రిణామాల‌న్నింటిపై స్పందిస్తార‌ని ఆప్ వ‌ర్గాలు తెలిపాయి.
Tags:    

Similar News