క్ల‌ర్క్ నుంచి క‌ల్కికి..విదేశాల్లో వంద‌ల కోట్ల ఆస్తులు!

Update: 2019-10-17 17:14 GMT
దేశవ్యాప్తంగా అనేకమంది సంపన్నులతోపాటు ప్రవాస భారతీయులు కూడా భ‌క్తులుగా క‌లిగి ఉన్న వివాదాస్ప‌ద‌ క‌ల్కి భ‌గ‌వాన్‌పై వ‌రుస‌గా రెండో రోజు ఐటీ దాడులు కొన‌సాగుతున్నాయి. పన్ను ఎగవేత - నిధుల దుర్వినియోగానికి సంబంధించి ఐటీ అధికారులకు సమాచారం అందడంతో క‌ల్కి భగవాన్ కుమారుడు కృష్ణ - ఆయన వ్యాపార భాగస్వాముల కార్యాలయాలపైనా దాడులు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ - తమిళనాడులోని ఆశ్రమ కార్యాలయాలతోపాటు దేశవ్యాప్తంగా 40 ప్రాంతాల్లో ఏకకాలంలో ఈ తనిఖీలు నిర్వహించారు. ఏపీలో చిత్తూరు జిల్లా వరదాయపాలెంలోని కల్కి ప్రధాన ఆశ్రమం గోల్డెన్ సిటీలోనూ సోదాలు కొనసాగాయి. చెన్నై నుంగబాకం కార్యాలయంలో కల్కి కుమారుడు కృష్ణ - కోడలు ప్రీతిని ఐటీ అధికారులు విచారించినట్లు తెలిసింది.

తనిఖీలు చేపట్టిన సమయంలో కల్కి భగవాన్ - ఆయన భార్య పద్మావతి అందుబాటులో లేక‌పోవ‌డంతో...కల్కి ఆశ్రమ ట్రస్ట్ మేనేజర్ లోకేశ్ దాసాజీని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ట్రస్టుకు వచ్చిన విదేశీ విరాళాలపై అధికారులు ఆరా తీసినట్లు సమాచారం. ఈ రెండురోజుల వ్యవధిలో ఇప్పటిదాకా 33 కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.ఇందులో తొమ్మిది కోట్ల రూపాయల విలువ చేసే విదేశీ కరెన్సీ ఉందని అంటున్నారు. కొన్ని కీలక డాక్యుమెంట్లు - 25 కోట్ల రూపాయల లెక్క చూపని నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆశ్రమ నిధులను కృష్ణ దారిమళ్లించి చెన్నైలోని పలు ప్రైవేట్ కంపెనీల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టినట్లు ఐటీ వర్గాలు తెలిపాయి. కల్కి ఆశ్రమంలో చాలా మంది ప్రముఖులకు బినామీ ఆస్తులు ఉన్నట్లు స‌మాచారం. సోదాల్లో లభ్యమైన డాక్యుమెంట్లో చాలా వాటిపై కల్కి భగవాన్ - ఆయన భార్య - కుమారుడు కృష్ణాజీ - ఇన్ ఛార్జి లోకేష్ దాసాజీల సంతకాలు ఉన్నాయని అధికారులు గుర్తించారు.

మ‌రోవైపు - కల్కి భగవాన్‌ పై అనేక ఆరోపణలు ఉన్నాయి. ఆశ్రమానికి వచ్చిన భక్తులకు మత్తుపదార్థాలు ఇచ్చి లైంగిక వేధింపులకు పాల్పడినట్లు గతంలో ఆరోపణలు వినిపించాయి. కల్కి ఆశ్రమంలో చాలా మంది ప్రముఖులకు బినామీ ఆస్తులు ఉన్నట్లు ఆరోపణలున్నాయి. భూ కబ్జాకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 2010లో విచారణకు ఆదేశించింది. కల్కి భగవాన్ దంపతుల సాధారణ దర్శనానికి రూ.5 వేలు - ప్రత్యేక దర్శనానికి ఏకంగా రూ.25 వేలు చెల్లించుకునే ప‌రిస్థితి ఎదురైంది. గోవర్ధన్‌ పూర్‌ లోని కృష్ణ కార్యాలయంలోనూ తనిఖీలు నిర్వహించారు. బినామీల పేరుతో వేల ఎకరాల భూముల క్రయ విక్రయాలు జరిపినట్లు అధికారులు గుర్తించినట్లు తెలిసింది. కల్కి భగవాన్ ఆశ్రమానికి ఆఫ్రికాలో వ్యవసాయ భూములు ఉన్నట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. గల్ఫ్ లోని ఖతర్ లోనూ భూములను కొనుగోలు చేసినట్లు తేలిందని అంటున్నారు. అయితే, అధికారులు ఇంకా ధృవీకరించాల్సి ఉంది. తనిఖీలకు సంబంధించి కల్కి ఆశ్రమం నుంచి గానీ - ఐటీ శాఖ నుంచి గానీ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.




Tags:    

Similar News