డేటా చోరీ నిజమే... ఐటీ గ్రిడ్స్ ఎండీ కోసం వేట

Update: 2019-04-16 09:35 GMT
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మరో పెను వివాదానికే తెర తీసేదిగా వెలుగులోకి వచ్చిన డేటా చోరీ కేసులో దర్యాప్తు ముమ్మరమైపోయింది. ఏపీలో అధికార పార్టీ కార్యకర్తల కోసం ఏర్పాటు చేయించుకున్న సేవా మిత్ర యాప్ నిర్వహణను పర్యవేక్షిస్తున్న ఐటీ గ్రిడ్స్ సంస్థ ఈ కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్న సంగతి తెలిసిందే. టీడీపీ కార్యకర్తల వివరాల సేకరణ అంటూ ఏకంగా ఏపీతో పాటు తెలంగాణకు చెందిన 7.58 కోట్ల మంది వ్యక్తిగత వివరాలను సేకరించిన ఐటీ గ్రిడ్స్... అత్యంత గోప్యంగా, ప్రభుత్వ సంస్థల వద్ద ఉండాల్సిన వివరాలను తన వద్ద ఉంచేసుకుంది. ఈ విషయంపై అందిన ఫిర్యాదుల మేరకు ఇప్పటికే మాదాపూర్ పోలీసులు... తెలంగాణ సర్కారు ఆదేశాలకు అనుగుణంగా కేసును సిట్ కు అప్పగించారు.

సీనియర్ ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్ర ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఈ సిట్... ఇప్పటికే ఐటీ గ్రిడ్స్ సంస్థలో సోదాలు చేసి కీలకమైన హార్డ్ డిస్క్ లను స్వాధీనం చేసుకుంది. అంతేకాకుండా సదరు హార్డ్ డిస్క్ ల్లో ఏం ఉందన్న విషయాన్ని తేల్చేందుకు వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వాతావరణం నేపథ్యంలో గత కొంతకాలంగా ఈ కేసు దర్యాప్తులో పెద్దగా కదలిక లేకున్నా.... పోలింగ్ ముగిసిన నేపథ్యంలో ఇప్పుడు ఈ కేసు దర్యాప్తులో కదలిక వచ్చేసింది. అంతేకాకుండా సెంట్రల్ ఐడెంటిటీ డేటా రిపోజిటరీ (సీఐడీఆర్), స్టేట్ రెసిడెంట్ డేటా హబ్స్ (ఎస్ ఆర్ డీఏఐ)ల వద్ద మాత్రమే భద్రంగా ఉండాల్సిన ప్రజల వ్యక్తిగత వివరాలు ఐటీ గ్రిడ్స్ సంస్థ వద్ద ఎలా ఉన్నాయంటూ తాజాగా ఆధార్ కార్డుల జారీ సంస్థ యూఐడీఏఐ... సిట్ కు ఫిర్యాదు చేసింది.

మరోవైపు ఐటీ గ్రిడ్స్ సంస్థ హార్డ్ డిస్క్ ల్లో 7.58 కోట్ల ప్రజలకు సంబంధించిన వ్యక్తిగత వివరాలున్నాయని ఫోరెన్సిక్ ల్యాబ్ .. సిట్ కు నివేదిక కూడా ఇచ్చేసింది. ఓ వైపు ఆధార్ జారీ సంస్థ ఫిర్యాదు, మరోవైపు ఫోెరెన్సిక్ నివేదిక చేతికందిన నేపథ్యంలో సిట్ తన దర్యాప్తును వేగిరం చేసింది. ఐటీ గ్రిడ్స్ సంస్థ ఎండీ అశోక్ ఇప్పటిదాకా అటు సిట్ ముందుకు గానీ, అటు కోర్టు ముందుకు గానీ రాలేదు. ఇప్పటికే సిట్ మూడు నోటీసులు జారీ చేసినా ఆయన నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఈ నేపథ్యంలో అశోక్ ను అరెస్ట్ చేసేందుకు సిట్ రంగం సిద్ధం చేసినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకోసం స్పెషల్ టీంలను ఏర్పాటు చేసిన సిట్... త్వరలోనే ఆ టీంలను ఏపీకి కూడా పంపే దిశగా ఆలోచన చేస్తున్నట్లుగా సమాచారం.

కేసు నమోదయ్యే దాకా హైదరాబాదులోని తన కార్యాలయంలోనే ఉన్న అశోక్... కేసు నమోదైన తర్వాత క్షణాల్లో మాయమైపోయారు. ప్రకాశం జిల్లాకు చెందిన ఆయన ఏపీలోనే సేఫ్ జోన్ లో ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ కేసు దర్యాప్తు పూర్తి కావాలంటే అశోక్ అరెస్ట్ తప్పనిసరి అన్న వాదన వినిపిస్తోంది. ఈ క్రమంలోనే ఆయనను అరెస్ట్ చేసేందుకు సిట్ ప్రత్యేక చర్యలకు శ్రీకారం చుట్టిందన్న వాదన వినిపిస్తోంది. మొత్తంగా యూఐడీఏఐ కంప్లెయింట్, ఫోరెన్సిక్ నివేదికలు వచ్చిన నేపథ్యంలో సిట్ ఈ కేసు దర్యాప్తును ముమ్మరం చేసిందనే చెప్పాలి.

    

Tags:    

Similar News