సిత్రంగా కనిపించే ఆ మాస్కుతో భద్రత ఎక్కువే.. ధర కూడా ఎక్కువే

Update: 2020-08-16 07:50 GMT
మొన్నటి వరకు మాస్కు గురించి దేశ ప్రజలకు అవగాహన తక్కువే. కరోనా పుణ్యమా అని జీవితంలో అదో భాగమైంది. మాయదారి వైరస్ బారిన పడకుండా ఉండాలంటే.. తప్పనిసరిగా మాస్కులు వాడాల్సిన పరిస్థితి. మాస్కులు లేకుండా బయటకు వస్తే.. ఎక్కడ ముప్పు ముంచుకొస్తుందన్న భయాందోళనలు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. ఇలాంటివేళ.. పది మంది కలిసే చోటుకు వెళ్లే వేళలో మరింత అప్రమత్తత అవసరం.

ఆ విషయాన్ని చెప్పేలా.. ఒక పెద్ద మనిషి పెట్టుకున్న మాస్కు ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. ఈ మాస్కు రోటీన్ కు భిన్నంగా ఉండటమే కాదు.. చిన్నసైజు యుద్ధ పరికరాన్ని ముఖానికి తగిలించుకున్నట్లుగా ఉండటం గమనార్హం. ఇంతకీ ఈ ఫోటోలో మాస్కు పెట్టుకున్న వ్యక్తి ఎవరంటే.. విశాఖ ఆంధ్ర వైద్యకళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి.వి. సుధాకర్. శనివారం నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు హాజరైన ఆయన ధరించిన మాస్కు అందరి చూపు పడేలా చేసింది.

ఆయన ధరించిన మాస్కును హాఫ్ ఫేస్ పీస్ గా వ్యవహరిస్తారు. సాంకేతిక భాషలో చెప్పాలంటే క్లినికల్ కెమికల్ ఫ్యూమ్ రెస్పిరేటరీ మాస్కుగా చెబుతారు. దీన్ని ధరించటం రెగ్యులర్ మాస్కుల కంటే కాస్త ఇబ్బంది. ముఖానికి దీన్ని తగిలించుకున్నంతనే ఉక్కిరిబిక్కిరి కావాల్సిందే. కాకుంటే.. ఇది పూర్తిగా సురక్షితమైనది.

ఈ మాస్కుకు రెండువైపులా ఉండే ఫిల్టర్లు నెల రోజుల పాటు ఏకథాటిగా వాడొచ్చని.. నెల తర్వాత మాత్రం వాటిని కొత్తగా అమర్చుకోవాలని చెబుతున్నారు. అమెరికాలో ఈ తరహా మాస్కుల్ని కొందరు వాడతారని చెబుతారు. ఇప్పుడు వినియోగించే మాస్కులతో పోలిస్తే.. వందల రెట్లు సురక్షితమైనదిగా చెబుతున్నారు. తన కోసం అమెరికాలోని మిత్రుడు ఒకరు పంపినట్లు చెప్పారు. కాకుంటే.. దేశీయ మార్కెట్లో దీని ధర భారీగా ఉంటుందని చెబుతున్నారు. ఒక్కో మాస్కు విలువ తక్కువలో తక్కువ రూ.6వేల వరకు ఉంటుందని చెబుతున్నారు.సాదాసీదా వారికి కష్టమేమో కానీ.. డబ్బుల విషయంలో లోటు లేని వారికి మాత్రం దీన్ని ఉపయోగించే వీలుందని చెప్పకతప్పదు.
Tags:    

Similar News