పంచాయితీలకు దిక్కులేదు కానీ అధికారంలోకి వచ్చేస్తారట

Update: 2021-02-16 14:30 GMT
బొంకరా బొంకరా పోలిగా అంటే మా ఊరిలో మిరియాలు తాటికాయలంత ఉంటాయి తెలుసా ? అన్నాడట వెనకటికెవడో. అలాగే ఉంది బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు అండ్ కో చెప్పే మాటలు. 2024లో రాబోయే ఎన్నికల్లో అధికారం మాదే అని ఇప్పటికి కొన్ని వందలసార్లు చెప్పుంటారు. అలాగే తొందరలో జరగబోయే తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో గెలుపు మాదే అంటు ఒకటే ఊదరగొట్టేస్తున్నారు కమలనాదులు.

ఇప్పుడిదంతా ఎందుకంటే చెప్పుకోవటం తాజాగా పంచాయితి ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. పూర్తయిన మొదటి రెండు విడతల్లో కలిసి బీజేపీకి వచ్చిన ఓట్లు ఎంతో తెలుసా ? .5 శాతం. మరి దీన్నిబట్టి జరగబోయే మిగిలిన రెండు విడతల పోలింగ్ లో ఎన్ని ఓట్లొస్తాయని ఎవరికి వారుగా అంచనా వేసుకోవచ్చు. పంచాయితీల్లో కనీసం ఒక్క శాతం ఓట్లు కూడా తెచ్చుకోలేని పార్టీ ఏకంగా అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం తమదే అని చెప్పుకోవటమే విచిత్రంగా ఉంది.

మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీకి వచ్చింది 0.84 శాతం ఓట్లు మాత్రమే. అంటే పోటీ చేసిన వారిలో ఏ ఒక్క అభ్యర్ధికి కూడా కనీసం డిపాజిట్ కూడా దక్కలేదు. అదే నిజమైన బీజేపీ బలమని అప్పుడే తేలిపోయింది. ఈ విషయంలో అందరికీ క్లారిటి ఉన్నా కమలనాదులకు మాత్రం ఎందుకో జ్ఞానోదయం కావటం లేదు. కేంద్రంలో అధికారంలో ఉన్న విషయాన్ని చూసుకుని రాష్ట్రంలో బీజేపీ నేతలు రెచ్చిపోతున్నారు.

గడచిన ఏడేళ్ళుగా కేంద్రంలో అధికారంలో ఉన్నా రాష్ట్రంలో మాత్రం ఎందుకని ఓట్లు రావటం లేదనే విషయాన్ని ఒక్కసారి కూడా సమీక్షించుకుంటున్నట్లు లేదు. ఇక్కడ ఓట్లు ఎందుకని రావటం లేదంటే 2014 రాష్ట్ర విభజన సందర్భంగా ఏపి ప్రయోజనాలకు ఇచ్చిన హామీలను నరేంద్రమోడి సర్కార్ తుంగలో తొక్కేసింది. ఇచ్చిన ప్రతి హామీని ఏదో కసి పెట్టుకున్నట్లుగా దెబ్బ కొట్టేసింది. నమ్మించి ఓట్లేయించుకున్న బీజేపీని జనాలు మళ్ళీ ఎందుకు నమ్ముతారు ? అందుకనే 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ ను భూస్ధాపితం చేసినట్లుగానే తర్వాత ఎన్నికల్లో బీజేపికి కూడా అదే గతి పట్టిస్తున్నారు.


Tags:    

Similar News