జగన్ నిర్ణయాన్ని ముందే పసి గట్టింది ఆ మీడియా మాత్రమే

Update: 2020-04-11 04:45 GMT
అనూహ్య నిర్ణయాన్ని తీసుకున్న ఏపీ సర్కారు.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తిని నియమించేలా చట్టంలో మార్పులు చేసింది. దీనికి సంబంధించి ఆర్డినెన్స్ ను తీసుకొచ్చింది. పంచాయితీరాజ్ చట్టం 1994 సెక్షన్ 200కు చేసిన సవరణ ఆర్డినెన్స్ కు ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ ఆమోదముద్ర వేశారు. శుక్రవారం దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రభుత్వం ఇంత పెద్ద నిర్ణయాన్ని తీసుకునే విషయాన్ని మీడియా సంస్థలు ముందే పసిగడతాయి.

తాజా ఎపిసోడ్ లో మాత్రం మీడియా సంస్థలన్ని ఫెయిల్ అయ్యాయి. దీనికి మినహాయింపు ఒక్క మీడియా సంస్థే కావటం గమనార్హం. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం.. మీడియా సంస్థల మధ్య పోటీ ఎంతలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ నిర్ణయాన్ని ముందుగా స్మెల్ చేసి.. దాన్ని చిలువలుపలువలుగా చిత్రీకరించే తీరు ఏపీలో కాస్త ఎక్కువే. అలాంటి వేళ.. ఎవరూ గుర్తించని రీతిలో తీసుకున్న నిర్ణయం ప్రభుత్వం అధికారికంగా వెల్లడించే వరకూ బయటకు రాలేదు.

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా ఎంపిక చేసే విషయంలో మారిన నిబంధనను తెలుగు మీడియా సంస్థలు ముందుగా గుర్తించటంలో ఫెయిల్ అయితే.. ఇంగ్లిషు మీడియా సంస్థ ‘ది ఇండియన్ ఎక్స్ ప్రెస్’ మాత్రం అందుకు భిన్నంగా నిలిచింది. ప్రభుత్వం ఫలానా నిర్ణయాన్ని తీసుకుంటుందన్న విషయాన్ని చెప్పేయటమే కాదు.. అధికారికంగా ఉత్తర్వులు ఎప్పుడు జారీ అవుతాయన్న విషయాన్ని సరిగానే అంచనా వేసింది. జగన్ ప్రభుత్వంలో చీమ చిటుక్కుమన్నా.. బ్రహ్మాండం బద్ధలైనట్లుగా భారీ ఎత్తున వార్తలు వేయటం ఏపీలోని మీడియాకు అలవాటుగా మారిన వేళ.. కీలక నిర్ణయాన్ని స్మెల్ చేయలేక పోయారని చెప్పక తప్పదు.
Tags:    

Similar News