వంద రూపాయలతో దేశాన్ని వణికించారు

Update: 2016-03-02 07:58 GMT
వంద రూపాయలకు ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ఏమొస్తుంది?  పిల్ల‌ల్ని తీసుకొని బేకరీకి వెళితే ఒక్క‌రికి కూడా వారు కోరిన‌న్ని స్నాక్సో - స్వీట్లో కొనివ్వ‌లేం. కానీ 100 రూపాయ‌ల ఖ‌ర్చు భార‌త‌దేశాన్ని వ‌ణికిస్తోందంటే న‌మ్ముతారా? న‌మ్మాల్సిందే. నిజంగా వంద రూపాయ‌ల ఖ‌ర్చు ఇపుడు మ‌న‌దేశంలో అంత‌ర్గ‌త ఆవేశాల‌కు, బ‌హిర్గ‌త‌మ‌వుతున్న ర‌చ్చ‌కు కార‌ణ‌మ‌యింది మ‌రి!

జాతీయ - అంతర్జాతీయ స్థాయిలో సంచలనాన్ని కలిగించి జేఎన్‌ యూ విద్యార్థుల అరెస్టుకు దారితీసిన కార్యక్రమ నిర్వహణకు అయిన ఖర్చు కేవలం వంద రూపాయలే! అవునట‌. ఈ విష‌యాన్ని జేఎన్‌ యూ విద్యార్థులు తెలిపారు. జేఎన్‌ యూ క్యాంపస్‌ లో జరిగే ఏ కార్యక్రమానికైనా అయ్యే ఖర్చు అతి తక్కువని, అంతేకాకుండా ఏ కార్యక్రమమైనా ఎలాంటి ప్రణాళిక లేకుండా గంట వ్యవధిలో నిర్వహించుకుంటామ‌ని జేఎన్‌ యూ స్టూడెంట్స్ యూనియన్ మాజీ ఉపాధ్యక్షుడు అనంత్ ప్రకాష్ నారాయణ్ పేర్కొన్నారు. దేశద్రోహ నేరం కింద కేసు నమోదైన విద్యార్థుల్లో అనంత్ కూడా ఒకరు! జాతి వ్యతిరేక కార్యక్రమంగా పేర్కొంటూ, విద్యార్థులకు ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలు చేస్తూ, కార్యక్రమాల నిర్వహణకు విదేశీ నిధులు అందుతున్నాయంటూ ఎవరికి తోచినట్లు వారు వ్యాఖ్యానాలు చేస్తున్నారని అనంత్ ఆవేదన వ్యక్తం చేశారు.

‘కోర్టు హాల్లోనూ - టీవీ స్టూడియోల్లోనూ, మా పేర్లు మారుమోగిపోతున్నాయి. పార్లమెంటులో గొంతులు చించుకుంటున్నారు. యావద్దేశమంతా మమ్మల్ని ఉగ్రవాదులుగా చూస్తున్నారు. క్యాంపస్‌ లో సర్వసాధారణంగా జరిగే కార్యక్రమాల గురించి వీరందరికి తెలిసింది చాలా తక్కువ’ అంటూ జేఎన్‌ యూ యూనియన్ మాజీ అధ్యక్షుడు అశుతోష్ కుమార్ అంటున్నారు. అఫ్జల్ గురు ఉదంతంపై చర్చ జరిపేందుకు మాకు ఏ ఉగ్రవాద సంస్థనుంచి నిధులు అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. దేశంలో ఏ యూనివర్శిటీకైనా అవసరమా అని అశుతోష్ ప్రశ్నించారు. ‘మేము విద్యార్థులం. చర్చించడం - ప్రశ్నించడం - అభిప్రాయాల్ని వ్యక్తపరచడమే మా ఉద్దేశం. దీన్ని ప్రభుత్వం - పోలీసులు భూతద్దంలో చూపిస్తున్నారని - దేశంలో ఉన్న అసహనానికి ఇదొక నిదర్శనం’ అని వ్యాఖ్యానించారు.

ఫిబ్రవరి 9వ తేదీన జరిగిన ఘటనకు బాధ్యులైన ఆరుగురు విద్యార్థుల్లో అనంత్ - అశుతోష్ కూడా ఉన్నారు. వీరిద్దరూ పీహెచ్‌ డీ విద్యార్థులు. ఫిబ్రవరి 12 కన్హయ్య కుమార్‌ ను అరెస్టు చేసిన తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిన ఐదుగురిలో వీరిద్దరు కూడా ఉన్నారు. పది రోజుల అనంతరం క్యాంపస్‌ కు విచ్చేసిన వీరిలో ఉమర్ - అనిర్‌ బన్ పోలీసులకు లొంగిపోగా మిగిలినవారు లొంగిపోమ‌ని తెలిపారు. విచారణ అవసరమైనప్పుడు పోలీసులకు ఎప్పుడూ అందుబాటులో ఉంటామని వివరణ ఇచ్చుకున్నారు. ప్రస్తుతం జరుగుతున్న జేఎన్‌ యు ఉద్యమాన్ని జేఎన్‌ యూ యూనియన్ ప్రస్తుత ఉపాధ్యక్షుడు షెహ్లా రషీద్ నడుపుతున్నారు. ఈ ఆరుగురు విద్యార్థుల్ని యూనివర్శిటీ డిబార్ చేసినా, హాస్టల్‌ లో గెస్టులుగా కొనసాగేందుకు అనుమతినిచ్చింది.
Tags:    

Similar News