ఆర్కే బీచ్ ఆందోళ‌న‌కు వైసీపీ యువ‌నేత మ‌ద్ద‌తు

Update: 2017-01-24 06:36 GMT
ఏపీకి ప్ర‌త్యేక హోదా ఆంధ్రుల హ‌క్కు అనే నినాదంతో విశాఖ‌లోని ఆర్కే బీచ్‌ లో గ‌ణ‌తంత్ర దినోత్స‌వం సంద‌ర్భంగా చేప‌ట్టనున్న కొవ్వొత్తుల ప్ర‌ద‌ర్శ‌న‌కు వైసీపీ యువ‌నేత ఐవీ రెడ్డి సంపూర్ణ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. పార్లమెంట్‌ సాక్షిగా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తున్నామని చెప్పిన హామీ అమ‌లు కోసం వైఎస్‌ ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గత మూడేళ్లుగా అలుపెరగని పోరాటం చేస్తూనే ఉందని - గల్లీ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయికి ఉద్యమాన్ని తీసుకెళ్లిందని ఐవీ రెడ్డి ఈ సంద‌ర్భంగా గుర్తుచేశారు. ఇటీవ‌లే త‌మ పార్టీ అధినేత - ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌ వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆంధ్రుల ఆకాంక్ష అయిన ప్ర‌త్యేక హోదా కోసం జ‌రిగే ఏ పోరాటానికి అయిన వైఎస్ ఆర్ కాంగ్రెస్ ముందుండి మ‌ద్ద‌తిస్తుంద‌ని ప్ర‌క‌టించిన విష‌యాన్ని గుర్తుచేశారు. ఈ క్ర‌మంలో పార్టీ ఆద‌ర్శాలు - ఆంధ్రుల ఆకాంక్ష‌ను వినిపించే బాధ్య‌త‌గ‌ల నాయ‌కుడిగా తాను ఆర్కే బీచ్ సాక్షిగా వినిపించ‌నున్న ఆంధ్రుల గళానికి మ‌ద్ద‌తు ఇస్తున్న‌ట్లు ఐవీ రెడ్డి వివరించారు.

శాంతియుత పోరాటాలు - బ‌ల‌మైన గ‌ళం వినిపించ‌డం ప్ర‌జాస్వామ్యయుత‌ విజ‌యాన్ని సాధించి పెడుతుంద‌నేందుకు జాతిపిత గాంధీజీ న‌డిపించిన స్వాతంత్య్రోద్య‌మం చక్క‌టి ఉదాహ‌ర‌ణ అని ఐవీ రెడ్డి ఈ సంద‌ర్భంగా ఉద‌హ‌రించారు. ఆంధ్రుల ఆకాంక్ష‌ను సాధింప‌జేసుకునేందుకు స్వాత్రంత్యోద్య‌మం మార్గ‌ద‌ర్శ‌కంగా తీసుకుకొని ఐక్యతగా ముందుకు సాగాల్సిన అవ‌స‌రం ఉంద‌ని పేర్కొన్నారు. ఆర్కే బీచ్ సాక్షిగా శాంతియుతంగా గ‌ళం వినిపిస్తూ ముందుకు సాగాలని ఈ సంద‌ర్భంగా జెండాలు - ఎజెండాలు ప‌క్క‌న‌పెట్టాల‌ని ఐవీ రెడ్డి కోరారు.

ప్ర‌త్యేక హోదా ఆంధ్రప్ర‌దేశ్‌ కు సంజీవనిగా మారుతుంద‌ని ఐవీ రెడ్డి ధీమా వ్య‌క్తం చేశారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌త్యేక హోదా ప్ర‌యోజ‌నాల‌ను ఆయ‌న వివ‌రించారు. "సాధారణంగా రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చే గ్రాంట్లు 30 శాతానికి మించి ఉండవు. అంటే ఏ పథకం - కార్యక్రమం చేపట్టినా.. కేంద్రం గ్రాంట్‌ పోనూ మిగతా 70 శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. అదే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తే కేంద్ర గ్రాంట్‌ 90 శాతం అందుతుంది. రాష్ట్ర ప్రభుత్వం కేవలం 10 శాతం భరిస్తే చాలు. ఒకవేళ ఆ మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చుకోలేని పరిస్థితి ఉంటే.. అప్పుడు కూడా కేంద్రమే సమకూరుస్తుంది. కేంద్రం గ్రాంట్‌ గా ఇచ్చే ఏ నిధి కూడా తిరిగి ఇవ్వాల్సిన అవసరం ఉండదు. సత్వర సాగునీటి ప్రయోజనం (ఏఐబీపీ) కింద మంజూరైన ప్రాజెక్టులకు కూడా ఇదే వర్తిస్తుంది. 90 శాతం నిధులను కేంద్రమే భరిస్తుంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే పారిశ్రామిక యూనిట్లకు 100 శాతం ఎక్సైజ్‌ డ్యూటీ మినహాయింపు లభిస్తుంది. దీంతో పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి పారిశ్రామికవేత్తలు - ఔత్సాహికులు ముందుకు వస్తారు. పారిశ్రామిక వృద్ధి  వేగవంతం కావడానికి ఇది దోహదం చేస్తుంది. ప్లాంట్లు - యంత్రాల మీద పెట్టే పెట్టుబడిలో 30 శాతం రాయితీ లభిస్తుంది. కొత్తగా ఏర్పాటయ్యే పరిశ్రమలతో పాటు, ప్రత్యేకహోదా ప్రకటన నాటికే ఏర్పాటై.. ఆ తర్వాత విస్తరణ చేపట్టిన పరిశ్రమలకు కూడా ఇది వర్తిస్తుంది. మధ్య, చిన్నతరహా పరిశ్రమల ఏర్పాటుకు ఇలాంటి రాయితీలు పనికి వస్తాయి. పరిశ్రమల ఏర్పాటుకు తీసుకునే వర్కింగ్‌ క్యాపిటల్‌ పై 3 శాతం వడ్డీ రాయితీ లభిస్తుంది. పరిశ్రమలకు 20 ఏళ్ళకు తగ్గకుండా విద్యుత్‌ ఛార్జీలపై 50 శాతం రాయితీ లభిస్తుంది.  ఇవే కాకుండా ఇన్సూరెన్స్ - రవాణా వ్యయంపైనా రాయితీలు ఉంటాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఈ తరహా పరిశ్రమలు భారీగా వస్తాయి. గ్రామీణ యువతకు, మహిళలకు ఉపాధి పెరుగుతుంది. నిరుద్యోగ సమస్య తీరుతుంది. త‌ద్వారా ఆంధ్ర‌ప్ర‌దేశ్ అభివృద్ధి ప‌థంలో న‌డుస్తుంది" అని ఐవీ రెడ్డి హోదా ప్ర‌యోజ‌నాల‌ను విశ‌దీక‌రించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News