హంగ్ వస్తే పవనే కింగ్...బీజేపీ ఆశ దోశ....

Update: 2022-10-22 02:30 GMT
దేనికైనా ఒక ప్రాతిపదిక ఉండాలి. ఏపీలో చూస్తే హంగ్ వస్తుంది అని బీజేపీ నేతలు అంటున్నారు. కానీ చిత్రమేంటి అంటే ఏపీ హిస్టరీలో ఎపుడూ హంగ్ అన్న మాటే లేదు. సాలిడ్ గా ఒక పార్టీక ఓట్లేసి గెలిపించిన చరిత్ర ఏపీ ప్రజలది. అయితే పవన్ తో మిత్ర భేధం ఏర్పడడంతో ఒక్కొక్కరుగా బీజేపీ మేధావులు బయటకు వచ్చి గొంతు సవరించుకుంటున్నారు.

ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి బీజేపీలో చేరిన ఐవైఅర్ క్రిష్ణా రావు ఏపీలో హంగ్ వస్తుంది, పవన్ సీఎం అవుతాడు అని ఊరిస్తున్నారు. అయితే ఆయన బీజేపీతో కలసి పొత్తులో ఉంటేనే సుమా అని షరతు పెడుతున్నారు. అదేలా సాధ్యమంటే ఏపీలో త్రిముఖ పోటీ జరగాలట. అపుడు బీజేపీ జనసేన ఎక్కువ  సీట్లు సాధిస్తాయట. మరో వైపు అతి పెద్ద పార్టీగా టీడీపీ ఉన్నా ఉండవచ్చు అంటున్నారు. ఆయన ఎందుకో ఇక్కడ వైసీపీ ఊసు ఎత్తలేదు, అంటే ఐవైఆర్ అంచనాల్లో వైసీపీకి అందరి కంటే తక్కువ సీట్లు వస్తాయని ఉద్దేశ్యం ఉంది కాబోలు.

సరే వైసీపీ విషయం ఎలా ఉన్నా మ్యాజిక్ ఫిగర్ అయిన 88 సీట్లు మాత్రం ఏ పార్టీకి దక్కవని అపుడు ఏ రెండు పార్టీలు కలిస్తేనే సర్కార్ ఏర్పాటు చేయడం జరుగుతుందని అంటున్నారు. ఆ సమయంలో జనసేన బీజేపీ కలిసి ఎక్కువ సీట్లు తెచ్చుకుని రేసులో ఉంటే కనుక టీడీపీ అనివార్యమైన పరిస్థితులో మద్దతు ఇచ్చి పవన్ కే సీఎం గా పట్టం కడుతుందని ఆయన తన మార్క్ జోస్యం వినిపించారు.

అయితే ఇక్కడ ఎవరికైనా వచ్చే డౌట్ ఏంటి అంటే ఏపీలో బీజేపీకి ఎంత బలం ఉందని ఎక్కువ సీట్లు వస్తాయని ఐవైఆర్ అంచనా వేశారు అని. అలాగే జనసేనకు గతసారి ఆరు శాతం ఓట్లు వచ్చాయి. ఇపుడు ఆ సంఖ్య పెరగవచ్చు. ఇక ఏపీ ప్రజల నాడి వారి ఓటింగ్ స్వభావాన్ని మాత్రం ఐవైఅర్ తన ఇన్నేళ్ల అనుభవంతో అంచనా వేయలేకపోయారు అనుకోవాలేమో. ఏపీ జనాలు గెలుపు గుర్రం వైపే ఉంటారు. ఆ విధంగా ఆలోచిస్తే వారు కచ్చితంగా అయితే టీడీపీ లేకపోతే వైసీపీని ఎంచుకుంటే అపుడు జనసేన బీజేపీ కూటమి సంగతేంటి అన్న దానికి ఆయన దగ్గర బహుశా జవాబు ఉండదేమో అంటున్నారు.

ఇక ఆయన అనుకున్నట్లుగానే జనసేన బీజేపీ కూటమికి ఎక్కువ సీట్లు వచ్చినా చంద్రబాబు ఎందుకు మద్దతు ఇస్తారు అన్నది కీలకమైన ప్రశ్న. చంద్రబాబు తన అధికారం నిలబెట్టుకోవడం కోసం అవసరమైతే   రాజకీయ చాణక్యంతో జనసేన బీజేపీ కూటమిలో చీలిక తెచ్చి అయినా తన వైపు తిప్పుకుంటారు అన్న విస్తృతమైన అవకాశాలు ఉన్నాయన్న విషయం ఐవైఆర్ కి తెలియకపోవడమే ఇక్కడ అంచనా లోపమని అంటున్న వారు ఉన్నారు.

ఇక చూస్తే బీజేపీ రోడు మ్యాప్ సరైన సమయంలో ఇస్తుందని, పవన్ బీజేపీతో కలసి వెళ్తేనే ఆయనకు మంచిదని ఐవైఆర్ అంటున్నారు, కానీ ఐవైఆర్ బీజేపీ అధినాయకత్వం కాదు కదా ఆయన తన వ్యక్తిగత అభిప్రాయం చెప్పారనే అంటున్నారు అదే టైంలో పవన్ ఇప్పటికే బీజేపీతో విసిగి ఉన్నారు. ఆయన టీడీపీతో ప్రయాణం చేసేందుకు దాదాపుగా ఒక అంగీకారానికి వచ్చేశారు. ఆ విధంగా ఆయన తన రాజకీయ జీవితాన్ని టీడీపీతో కూటమి కట్టడం ద్వారా చూసుకోవాలనుకుంటున్నారు. అందువల్ల ఐవైఆర్ హంగ్ అన్నా కింగ్ అన్నా పవన్ నుంచి కానీ జనసేన నుంచి కానీ పెద్దగా రియాక్షన్ అయితే వచ్చే చాన్సే లేదు అంటున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News