`పీవీ`కి భారత రత్న...జగన్ తీర్మానం చేస్తారా?: ఐవైఆర్

Update: 2020-09-08 17:33 GMT
భారత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు శతజయంతి సంవత్సరంలో ఆయనకు భారతరత్న ఇవ్వాలని తెలంగాణ అసెంబ్లీలో కేసీఆర్ ప్రవేశపెట్టిన తీర్మానం ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో పీవీకి `భారతరత్న` ప్రకటించాలని, పార్లమెంటులో పీవీ విగ్రహం పెట్టాలని, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి పీవీ పేరు పెట్టాలని కేసీఆర్ ప్రవేశపెట్టిన తీర్మానాన్నీ సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై మాజీ ఐఏఎస్ అధికారి, బీజేపీ నేత ఐవైఆర్ కృష్ణారావు స్పందించారు. తెలంగాణ మాదిరిగానే ఏపీ అసెంబ్లీలోనూ ఇదేవిధంగా తీర్మానం ప్రవేశపెట్టాలని ఐవైఆర్ అభిప్రాయపడ్డారు. ఈ అంశంలో కేసీఆర్ స్పష్టమైన నిర్ణయం తీసుకున్నారని, కేసీఆర్ బాటను జగన్ ఎప్పుడు అనుసరిస్తాంటూ ఐవైఆర్ ప్రశ్నించారు.

అంతేకాదు, ఈ విషయంలో ఇగో పట్టింపులు అస్సలు ఉండకూడదని జగన్ ను ఉద్దేశించి ఐవైఆర్ హితవు పలికారు. గతంలోనూ వైసీపీ సర్కార్ కు, సీఎం జగన్ కు ఐవైఆర్ పలు సందర్భాల్లో సలహాలు, సూచనలు ఇచ్చి హితవు పలికిన సంగతి తెలిసిందే. నిమ్మగడ్డ విషయంలో జగన్ సర్కార్ వైఖరి సరిగా లేదన్న ఐవైఆర్...హైకోర్టు ఆదేశాల ప్రకారం నిమ్మగడ్డను ఎస్ఈసీగా ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.

కొన్ని కొన్ని విషయాలు తెగేదాకా లాగకూడదని, అలా లాగి ప్రతికూల పరిస్థితులు వచ్చేదాకా తెచ్చుకోవద్దని జగన్ సర్కార్ కు హితవు పలికారు. మరి, తాజాగా ఐవైఆర్ ఇచ్చిన సలహాను జగన్ ఎంతవరకు పాటిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
Tags:    

Similar News