మహిళలు ఇంట్లో ఉన్నారు కదా..కేసీఆర్ కేబినెట్లో లేకపోతేనేం?

Update: 2019-02-20 17:09 GMT
తెలంగాణలో కేసీఆర్ ఎట్టకేలకు మంత్రివర్గాన్ని విస్తరించారు. ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత 70 రోజులకు ఆయన 10 మంది మంత్రులను నియమించుకున్నారు. అంతవరకు బాగానే ఉంది. కానీ, కొత్త మంత్రివర్గంలోనూ ఒక్క మహిళ కూడా లేకపోవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2014లో తెలంగాణ వచ్చిన తరువాత కొత్త రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ నాలుగున్నరేళ్ల పాటు పాలించి ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. కానీ.. ఆ నాలుగున్నరేళ్ల కాలంలో తన మంత్రివర్గంలో ఒక్క మహిళ కూడా లేరు. దీంతో అప్పుడే విమర్శలు వచ్చాయి. ఇక రెండోసారి సీఎం అయిన తరువాతైనా ఆ లోటు భర్తీచేస్తారని అనుకున్నారు. కానీ, ఇప్పుడు కూడా మహిళలకు స్థానం కల్పించలేదు.
    
ఇలాంటి పరిస్థితుల్లో నిన్న కొత్త మంత్రులను చేర్చుకున్నతరువాత మీడియా వారితో మాట్లాడింది. కేసీఆర్ గత కేబినెట్లో ఉండి మళ్లీ రెండోసారి కూడా స్థానం సంపాదించుకున్న జగదీశ్వర్ రెడ్డిని విలేకరులు ఇదే విషయం అడిగారు. మహిళలకు ఎందుకు అవకాశమివ్వలేదు అని అడిగారు. దానిక ఆయన చెప్పిన సమాధానం విని విలేకరులే కాదు యావత్ తెలంగాణ ప్రజలూ షాకయ్యారు. ‘‘మహిళలు ఇంట్లో ఉన్నారు కదా..’’ అని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు.
    
దీంతో విలేకరులు.. ఇదేంటని ప్రశ్నించగా.. ఆయన కవర్ చేసుకుంటూ.. మహిళలు ఇంట్లో ఉంటూ మాకు సపోర్ట్ చేస్తున్నారు కదా అన్నట్లుగా మాట్లాడారు. దీనిపై సోషల్ మీడియాలోనూ దుమారం రేగింది. తెలంగాణ కాంగ్రెస్ మహిళా విభాగం అధ్యక్షురాలు నేరెళ్ల శారద దీనిపై స్పందిస్తూ... మంత్రి ఈ వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే.. కేసీఆర్ ఎందుకు మహిళలను మంత్రులుగా తీసుకోవడం లేదన్నది మాత్రం మిలియన్ డాలర్లగా ప్రశ్నగానే మిగిలిపోయింది.


Tags:    

Similar News