పుష్కర స్నానానికి జగన్.. రాహుల్ కూడా..?

Update: 2015-07-12 01:53 GMT
అతి త్వరలోనే ప్రారంభం కానున్న గోదావరి పుష్కరాల్లో రాజకీయ నేతల హడావుడి కనిపించనుంది. పుష్కర స్నానాలు చేయడానికి సామాన్యులు భక్తి ప్రవత్తులతో సిద్ధం అవుతుండగా.. పొలిటికల్ లీడర్లు కూడా తమదైన శైలిలో పుష్కరాల్లో పాలు పంచుకోనున్నారు. ఈ మేరకు నేతల పుష్కరాల ప్రిపరేషన్ కు సంబంధించి వార్తలు వెల్లడి అవుతున్నాయి. తాజాగా  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి పుష్కర స్నానానికి సంబంధించిన వివరాలను ప్రకటించింది ఆ పార్టీ. 14 వ తేదీ నుంచి గోదావరి పుష్కరాలు మొదలు కానున్న నేపథ్యంలో.. పదిహేనో తేదీన జగన్ పుష్కర స్నానం చేయనున్నాడని వైకాపా ప్రకటించింది.

తూర్పుగోదావరి జిల్లా పర్యటనకు వచ్చి అలాగే.. రాజమండ్రిలో జగన్ పుష్కర స్నానం చేయనున్నాడని వైకాపా ప్రకటించింది. మరి జగన్ మోహన్ రెడ్డి పుష్కర స్నానం అంటే అది రాజకీయం అయ్యే అవకాశాలూ లేకపోలేదు. చాలా మందే ఈ అంశం గురించి స్పందిస్తారు. ఎవరెవరి స్పందనలు ఎలా ఉంటాయనేది ఆసక్తికరమైన అంశం. ఇదిలా ఉంటే కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీని కూడా పుష్కరాలకు రప్పించాలనేది ఆ పార్టీ నేతల వ్యూహంగా కనిపిస్తోంది.

రాహుల్ ఏపీ పర్యటన నేపథ్యంలో ఆయనను రాజమండ్రికి తీసుకెళ్లి గోదావరి జలాల్లో స్నానం చేయించాలనేది కాంగ్రెస్ నేతల భావన. మరి దీనికి రాహుల్ సమ్మతిస్తాడా? ఏఐసీసీ రాహుల్ షెడ్యూల్ లో గోదావరి పుష్కర స్నానాన్ని పెడుతుందా? అనేది సందేహాస్పదమైన విషయమే. అయితే ఈ మధ్య రాహుల్ కొన్ని హిందూ పుణ్యక్షేత్రాలను దర్శించాడు. ఈ నేపథ్యంలో ఆయన పుష్కర స్నానానికి వస్తాడేమో చూడాలి!
Tags:    

Similar News