ఆగ్ర‌హంతో ఊగిపోతున్న జ‌గ‌న్‌!

Update: 2022-02-05 09:30 GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 2019  ఎన్నిక‌ల్లో ఘ‌న విజ‌యంతో అధికారంలోకి వ‌చ్చిన సీఎం జ‌గ‌న్‌ను ఇన్ని రోజులు ఎదురులేకుండా పోయింది. వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత జ‌రిగిన ప్ర‌తి ఎన్నిక‌ల్లోనూ ఆ పార్టీకి తిరుగులేని విజ‌యాలు సాధించింది. రాష్ట్రం ఆర్థిక ప‌రిస్థితి దిగ‌జారుతున్న‌ప్ప‌టికీ సంక్షేమ ప‌థ‌కాల పేరుతో ముందుకు సాగుతున్న జ‌గ‌న్‌పై ప్ర‌జ‌ల్లోనూ మంచి అభిప్రాయం ఉంద‌ని అంటున్నారు. నేరుగా డ‌బ్బులు ఖాతాల్లో వేస్తుండ‌డంతో జ‌గ‌న్‌కు జ‌నాలు అండ‌గా ఉంటార‌ని వైసీపీ భావిస్తోంది. అంతా బాగానే ఉంది ఇక ఆయ‌న‌కు తిరుగులేద‌ని అంతా అనుకుంటుండ‌డ‌గా.. ఇప్పుడు ఉద్యోగుల ఆందోళ‌న‌తో అంతా తారుమార‌య్యేలా క‌నిపిస్తోంది.

ఆ స‌క్సెస్‌తో..

త‌న రెండున్న‌రేళ్ల పాల‌న‌లో ఎప్పుడూ కోపం ప్ర‌ద‌ర్శించ‌ని జ‌గ‌న్ ఇప్పుడు ఉద్యోగుల‌పై తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్న‌ట్లు తెలుస్తోంది. పీఆర్సీ సాధ‌న స‌మితి పేరుతో ఉద్యోగ సంఘాల ఉద్య‌మంలో భాగంగా నిర్వహించిన చ‌లో విజ‌య‌వాడ కార్య‌క్ర‌మం స‌క్సెక్ కావ‌డం అందుకు ముఖ్య కార‌ణ‌మ‌ని స‌మాచారం. దీంతో ఆయ‌న తీవ్ర ఆగ్ర‌హం, అస‌హ‌నం వ్య‌క్తం చేసిన‌ట్లు తెలిసింది. విజ‌య‌వాడ‌కు ఉద్యోగులు రాకుండా అన్ని దిక్కులా పోలీసుల‌ను మోహ‌రించి అడ్డుకున్నప్ప‌టికీ ల‌క్ష‌కు పైగా ఉద్యోగులు బెజ‌వాడ ఎలా చేరుకున్నార‌ని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నార‌ని స‌మాచారం. ఈ విష‌యంలో పోలీసులు కూడా ఉద్యోగుల‌కు స‌హ‌క‌రించార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ నేప‌థ్యంలో డీజీపీని పిలిపించుకుని మ‌రీ జ‌గ‌న్ పోలీసుల వైఫ‌ల్యం గురించి అడిగిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.

ఆ ధిక్కార స్వ‌రం..

వైసీపీ ప్ర‌భుత్వాన్ని ధిక్క‌రిస్తూ ఉద్యోగ స్వ‌రాన్ని గ‌ట్టిగా వినిపిస్తున్న ఉద్యోగుల‌పై జ‌గ‌న్ గుర్రుగా ఉన్నారు. పీఆర్సీ విష‌యంలో అన్యాయం జ‌రిగింద‌ని భావిస్తున్న ఉద్యోగులు.. అనుమ‌తి లేకుండా స‌భ‌లు నిర్వ‌హించి ప్ర‌భుత్వంపై నిర‌స‌న వ్యక్తం చేస్తున్నారు. త‌మ డిమాండ్ల‌ను వినిపిస్తున్నారు. అక్క‌డితో ఆగ‌కుండా ప్ర‌భుత్వ ప‌త‌నాన్ని శాసిస్తామ‌ని రాజ‌కీయ ప్ర‌సంగాల త‌ర‌హాలో ఉద్యోగ  సంఘాల నాయ‌కులు మాట్లాడ‌డం జ‌గ‌న్ సీరియ‌స్‌ అవుతుండ‌డానికి ప్ర‌ధాన కార‌ణంగా తెలుస్తోంది. అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి త‌న‌పై తొలిసారి ఇలా వ్య‌తిరేక‌త రావ‌డం ఆయ‌న ఆగ్ర‌హానికి కార‌ణ‌మైంద‌న్న వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

ఇక్క‌డితోనే ఆగితే..

చ‌లో విజ‌య‌వాడ కార్య‌క్ర‌మం గురించి జ‌గ‌న్ లైవ్ అప్‌డేట్స్ తెప్పించుకున్నారు. మంత్రులు, స‌జ్జ‌ల‌తోనూ మాట్లాడి స‌మీక్షించారు. కానీ ఆ కార్య‌క్ర‌మం స‌క్సెస్‌తో ఇప్పుడు ఉద్యోగులు రెట్టించిన స్పీడ్‌తో ఈ నెల ఆరు అర్ధ‌రాత్రి నుంచి స‌మ్మెకు సిద్ధ‌మ‌య్యారు. వాళ్లు స‌మ్మెకు దిగితే అప్పుడు ప‌రిణామాలు మ‌రింత తీవ్రంగా మారే అవ‌కాశం ఉంది. ఈ నేప‌థ్యంలో మంత్రుల క‌మిటీ తాజాగా ఉద్యోగ సంఘాల నేత‌ల‌తో చ‌ర్చ‌ల‌కు దిగింది. మునుప‌టి చ‌ర్చ‌ల‌తో పోలిస్తే అందులో ప్ర‌భుత్వం నుంచి కాస్త సానుకూల వైఖ‌రి క‌నిపించంద‌ని చెబుతున్నారు. మ‌రి స‌మ్మెకు దిగ‌క‌ముందే ఉద్యోగుల‌ను జ‌గ‌న్ శాంతింప‌జేస్తారా అన్న‌ది చూడాలి.
Tags:    

Similar News