జగన్ అడిగేశారు.. మోడీ ప్రభుత్వం ఓకే చెప్పేసింది

Update: 2022-06-07 04:43 GMT
ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. రాజకీయాల్లో మిత్రపక్షాల్ని వాడుకొని వదిలేసే తత్త్వం కాంగ్రెస్ తోనే షురూ అయ్యింది. తనకున్న అలవాటును ఎప్పటికప్పుడు ప్రదర్శించే కాంగ్రెస్ కున్న పాడు అలవాటుకు చెక్ చెప్పిన క్రెడిట్ ఎవరికైనా ఇవ్వాలంటే అది.. సోనియాగాంధీకే ఇవ్వాలి. పార్టీ పగ్గాలు తన చేతికి వచ్చిన తర్వాత.. కాంగ్రెస్ తీరులో మార్పులు తేవటంలో కీలక పాత్ర పోషించారని చెప్పాలి. కాంగ్రెస్ వదిలేసిన అలవాటు బీజేపీని ఇప్పుడు పూర్తిగా పట్టేసింది. కష్టకాలంలో తనకు తోడుగా ఉన్న మిత్రుల్ని ఒకరి తర్వాత ఒకరిని దూరం చేసుకోవటంలో బీజేపీ తర్వాతే ఎవరైనా.

ఆ మాటకు వస్తే.. ఒకప్పుడు బీజేపీతో స్నేహానికి ఒక్కరంటే ఒక్కరు కూడా ముందుకు వచ్చేవారు కాదు. కేవలం రెండు ఎంపీల తేడాతో ప్రభుత్వం పడిపోయిన ఘన చరిత్ర బీజేపీకి ఉందన్న విషయాన్ని మర్చిపోకూడదు. అలాంటి పార్టీ ఆ తర్వాత మార్పు వచ్చింది. స్నేహ ధర్మాన్ని పాటించటంతో పాటు.. మిత్రులకు పెద్ద పీట వేసేవారు. మోడీషాల పరిధి జాతీయ పార్టీ మీద ప్రభావం చూపటం మొదలైన నాటి నుంచి స్నేహ ధర్మానికి ఈ ఇద్దరు ముఖ్యనేతలు ఇచ్చే ప్రాధాన్యతలో చాలానే మార్పు వచ్చిందని చెప్పాలి.

ఈ కారణంతో చాలామంది మిత్రులు బీజేపీకి దూరమయ్యారు. ఒకప్పుడు పటిష్టంగా కనిపించిన ఎన్ డీఏ ఇప్పుడు పేరుకు మాత్రమే అన్నట్లు నిలిచింది. మిగిలిన మిత్రుల సంగతిని పక్కన పెడితే.. శివసేన లాంటి నమ్మకమైన మిత్రుడ్ని పోగొట్టుకోవటం చూస్తే మోడీషాల తీరు ఇట్టే అర్థం కాక మానదు. అలాంటి ఆయనకు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విషయంలో ఇచ్చే ప్రాధాన్యత ఆశ్చర్యానికి గురి చేస్తుందని చెప్పాలి. పైకి ఎలాంటి స్నేహ ధర్మం లేనప్పటికీ ఆయన కోరుకున్న పనుల్ని కాదనకుండా పూర్తి చేసే విషయంలో మోడీషాల ప్రభుత్వం ముందు ఉంటుందని చెబుతారు.

అదే సమయంలో ఏపీకి ఇవ్వాల్సిన నిధులుకానీ ప్రాజెక్టుల విషయంలో ఆచితూచి అన్నట్లు వ్యవహరించే మోడీ ప్రభుత్వం.. పరిమితికి మించిన అప్పు అడిగితే కాస్త ఎక్కువగా అడిగించుకొని.. బాగా తిప్పించుకొని ఇస్తోంది. ఇదిలా ఉండగా.. ఏపీ ప్రభుత్వం కోరే వినతుల విషయంలోనూ మోడీ సర్కారు సానుకూలంగా స్పందిస్తూ ఉంటుంది. తాజాగా అలాంటి తీరునే ప్రదర్శించింది.

తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా వ్యవహరిస్తున్న ఏవీ ధర్మారెడ్డి డెప్యుటేషన్ ను మరో రెండేళ్ల పాటు పొడిగిస్తూ కేంద్రం తాజాగా నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన ఆదేశాలు జారీ అయ్యాయి. కేంద్ర రక్షణ శాఖకు చెందిన ఆయన డెప్యుటేషన్ మీద రెండేళ్లు టీటీడీ ఈవోగా వ్యవహరించనున్నారు. ఆయన డెప్యుటేషన్ గడువు పూర్తైంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కలుగజేసుకొని.. ఆయనకు మరో రెండేళ్లు (2022 మే 14 నుంచి 2024 మే 13వరకు) గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

దీనికి సంబంధించిన ఉత్తర్వులు తాజాగా విడుదలయ్యాయి. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఆయన గడిచిన ఏడేళ్లుగా డెప్యుటేషన్ మీదనే ఉండటం. ఏమాటకు ఆ మాటే.. ఇలాంటివి సీఎం జగన్ అడిగిన వెంటనే కాదనకుండా చేసే విషయంలో మోడీకి మంచి పేరే ఉందని చెప్పాలి.
Tags:    

Similar News