జగన్ నోట.. లోకేశ్ రోజూవారీ ఆదాయం?

Update: 2015-12-23 12:04 GMT
ఏపీలోని అధికార.. విపక్షాల మధ్య మాటల దాడి మరింత ముదిరింది. అసెంబ్లీ శీతాకాల సమావేశాల సందర్భంగా కాల్ మనీ.. రోజా వ్యవహారం రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా మీడియాతో మాట్లాడిన ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు.. ఆయన కుమారుడు లోకేశ్ మీద తీవ్ర ఆరోపణలు చేశారు. అబద్ధాలతో.. మోసాలతో బాబు పాలన చేస్తున్నారంటూ తీవ్రస్వరంతో విరుచుకుపడిన జగన్.. లోకేశ్ రోజువారీ ఆదాయం భారీగా వస్తుందంటూ సరికొత్త ఆరోపణలు చేశారు.

ఇసుక ధరను రూ.40 నుంచి రూ.700 వరకు పెంచారని.. ఆ లెక్కన రూ.1500కోట్ల ఆదాయం రావాల్సి ఉన్నా.. రూ.800 లెక్కలే చూపిస్తున్నారంటూ లెక్కలు విప్పారు. తూర్పు.. పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఇసుక దందా ఎక్కువగా ఉందని.. ఈ రెండు జిల్లాల నుంచే లోకేశ్ కు రోజుకు రూ.కోటి ఆదాయం అందుతుందని ఆరోపించారు. ఇసుక దందాలో భాగంగా నేతలు లోకేశ్ కు రోజువారీ వాటాలు ఇస్తున్నారని.. దీంతో ఆయనకు రోజుకు కోటి రూపాయిల ఆదాయం వస్తుందని జగన్ ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు.. తాజాగా లోకేశ్ మీద అవినీతి మరక వేసిన జగన్ పై తెలుగు తమ్ముళ్లు ఎలా స్పందిస్తారో చూడాలి.
Tags:    

Similar News