విమర్శలు పక్కన పెట్టి... ప్లానింగ్ పై పడిన జగన్

Update: 2019-09-05 11:41 GMT
నవ్యాంధ్రప్రదేశ్ కు నూతన సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన ప్రసంగం విపక్షాలను కాస్తంత భయాందోళనలకు గురి చేసిందేనని చెప్పాలి. అవినీతి రహిత పాలన దిశగా సాగుతున్న తాను... వ్యవస్థలను చక్కదిద్దుతానని, అదే సమయంలో తప్పులు చేసిన వారిని ఉపేక్షించేది లేదని జగన్ చేసిన వ్యాఖ్యలు వైరి వర్గాల్లో ఒకింత భయాన్నే రేపాయి. ఆ భయం మాటేమో గానీ... చాలా ప్లాన్డ్ గానే ముందుకు సాగుతున్న జగన్... తాను అనుకున్న దిశగా పాలనను పక్కా గాడిలో పెట్టేస్తున్నారన్న మాట మాత్రం ఇప్పుడు బాగానే వినిపిస్తోంది.

రాష్ట్రంలో మద్యపాన నిషేధాన్ని దశలవారీగా అమలు చేస్తానని జగన్ చేసిన ప్రకటనతో చాలా మంది నొసలు చిట్లించారు. అసలే అప్పుల్లో ఉన్న రాష్ట్రానికి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న మద్యం అమ్మకాలను రద్దు చేస్తే ఎలాగంటూ పాలనలో తలపండిన వారంతా కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే జగన్ తాను అనుకున్నట్లుగానే ముందుకు  సాగారు. తాను చెప్పినట్లుుగానే రాష్ట్రంలో దశలవారీ మద్యనిషేదాన్ని అమలు చేసే దిశగా కదులుతున్న జగన్ ఇప్పటికే రాష్ట్రంలో 500లకు పైగా మద్యం షాపులను ఎత్తేశారు. అంతేకాకుండా ఇకపై మద్యం విక్రయాల కోసం ప్రైవేట్ వ్యాపారులను పక్కనపెట్టేసి సర్కారీ మద్యం షాపులను తెరిచేశారు. మొత్తంగా మద్యం వ్యాపారంలో జరుగుతున్న అక్రమాలకు  చెక్ పెట్టేశారు.

ఇలాంటి సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న జగన్... తాజాగా నిన్నటి కేబినెట్ సమావేశంలో భాగంగా రెండు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం ,చేసే దిశగా సంచలన నిర్ణయమే తీసుకున్న జగన్... అందులో భాగంగా ఆర్టీసీ ఉద్యోగులందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చేశారు. ఈ నిర్ణయంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో రాష్ట్రంలో గత టీడీపీ ప్రభుత్వంలోని పెద్దలు - ఆ పార్టీ ఎమ్మెల్యేలకు ప్రధాన ఆదాయ వనరుగా మారిన ఇసుక విక్రయాలను కూడా సరళం చేస్తూ.,.. అది కూడా ప్రభుత్వమే ఇసుకను అమ్మేలా జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇసుక విక్రయాల్లో ఇకపై ఎలాంటి అక్రమాలకు చోటు లేకుండా జగన్ తీసుకున్న నిర్ణయంతో అతి తక్కువ ధరకే జనానికి ఇసుక లభ్యం కానుంది. అంతేకాకుండా ఇసుక కోసం ఎక్కడికో వెళ్లకుండా అవసరం ఉన్నవారి ఇళ్ల వద్దకే ఇసుక వెళ్లేలా జగన్ సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు.

తాను సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత మూడు నెలల వ్యవధిలోనే ఏకంగా మూడు వ్యవస్థలను దారిలో పెట్టేస్తూ జగన్ తీసుకున్న నిర్ణయంపై కాకలు తీరిన రాజకీయ నేతలే నోరెళ్లబెడుతున్న పరిస్థితి. ఆర్టీసీ విలీనం ఎప్పటికి కావాలి? అంటూ విమర్శలు గుప్పించిన వారు...ఇప్పుడు జగన్ తీసుకున్న నిర్ణయంతో సైలెంట్ అయిపోక తప్పలేదు. అంతేకాకుండా ఎన్నికలకు ముందు తాను చేసిన పలు వాగ్దానాలను ఒక్కటొక్కటిగానే అమలులోకి పెడుతూ సాగుతున్న జగన్... త్వరలోనే రాష్ట్ర పాలనలోని అన్ని వ్యవస్థలను గాడిలో పెట్టేస్తారన్న మాట ఇప్పుడు బాగానే వినిపిస్తోంది.


Tags:    

Similar News