కరోనా కట్టడికి పకడ్బందీగా సర్వే..జగన్‌ ప్రత్యేక దృష్టి

Update: 2020-03-25 06:46 GMT
కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణలో భాగంగా మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటి సమగ్ర సర్వే చేపడుతున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సర్వేపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఇంటింటికి తిరిగి ఇతర దేశవిదేశాల నుంచి ఎవరైనా వచ్చారా? వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతున్నారా? అనే విషయాలు ఆరా తీస్తున్నారు. ఈ సర్వే మొత్తం కరోనా వైరస్‌ ను కట్టడి చేసేందుకు పకడ్బందీగా చేపట్టాలని సీఎం సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారంలోగా ఈ సర్వేను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. లాక్‌ డౌన్‌ అమల్లో ఉన్నంత వరకు ప్రజలందరూ ఇళ్లలోనే ఉండాలని విజ్ఞప్తి చేశారు. సర్వే పూర్తి కాగానే మరికొన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ఇప్పటివరకు విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వారు - వారి సంబంధితుల వివరాలు సేకరిస్తున్నారు. గ్రామస్థాయి నుంచి వలంటీర్లు - ఏఎన్‌ ఎంలు - ఆశా వర్కర్లతో రాష్ట్రంలో ప్రతి ఇంటినీ సర్వే చేస్తున్నారు. తెలుగు వారి గొప్ప పండుగ అయిన ఉగాది నాడు కూడా క్షేత్రస్థాయి సిబ్బంది ఈ సర్వే చేపడుతున్నారు.

కరోనా లక్షణాలు ఉన్న వారికి సత్వరమే వైద్య సహాయం అందిస్తే కోవిడ్‌–19 వ్యాపించకుండా అడ్డుకట్ట వేయగలుగుతామని సీఎం జగన్‌ వైద్య సిబ్బందికి సూచించారు. ప్రజలు బయట తిరిగితే ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాపిస్తుండడంతో బాధ్యతాయుతంగా ప్రజలంతా లాక్‌ డౌన్‌ ను ఇళ్లకే పరిమితం కావాలని సీఎం జగన్‌ పిలుపునిచ్చారు. ప్రజలంతా ఇంట్లో ఉంటే వలంటీర్లు - ఏఎన్‌ ఎంలు - ఆశా వర్కర్లు చేసే సర్వేలో వివరాలు తెలిపే అవకాశం ఉందని.. అందుకే లాక్‌ డౌన్‌ ను పక్కాగా అమలుచేయాలని పోలీస్ - రెవెన్యూ శాఖ అధికారులకు ఆదేశించారు.

రాష్ట్రంలో కరోనా కేసులు రెండో దశకు చేరకుండా ఉండేందుకు ఈ సర్వే ఉపయోగపడుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటివరకు పాజిటివ్‌గా తేలిన కేసులన్నీ విదేశాల నుంచి వచ్చిన వారు - వారితో సన్నిహితంగా ఉన్నవారివే ఉండడంతో వారిపై ప్రత్యేక దృష్టి సారించారు. సామాన్య ప్రజలకు వ్యాపించకుండా ఉండాలంటే వైద్య - ఆరోగ్య శాఖ - ప్రభుత్వ సూచనలను తప్పనిసరిగా పాటించాలని సూచిస్తున్నారు. ఈ రెండోసారి సర్వేలో వచ్చే వివరాలను బట్టి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కరోనా లక్షణాలు ఉన్న వారు విధిగా హోం ఐసోలేషన్‌ పాటించేందుకు ఈ సర్వే దోహదం చేయనుంది.

Tags:    

Similar News