ఐల‌య్య‌కు మ‌ద్ద‌తిచ్చిన జ‌గ‌న్‌..కేసు పెట్టాలన్న కోర్టు

Update: 2017-10-10 17:09 GMT
రిటైర్డ్  ప్రొఫెసర్ - రచయిత కంచ ఐలయ్య ర‌చించిన సామాజిక స్మగ్ల‌ర్లు కోమ‌టోల్లు పుస్త‌కం క‌ల‌క‌లం ఇంకా స‌ద్దుమ‌ణ‌గ‌లేదు. త‌న పుస్త‌కంలో కామెంట్ల‌పై పూర్తిగా క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని... త‌న‌తో చ‌ర్చ‌లు జ‌ర‌పాలంటే...బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా రావాల‌ని ఐల‌య్య ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అయితే ఐల‌య్య కామెంట్లపై ఆర్య‌వైశ్యులు పోలీస్ స్టేష‌న్‌ను ఆశ్ర‌యిస్తున్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ కంచ ఐలయ్యకు సమన్లు జారీ చేశారు.  అడ్వకేట్ బోయిని సత్యనారాయణ వేసిన పిటిషన్ పిర్యాదుదారు మంచాల జగన్ ``సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు అనే  పుస్తకం``  వ్రాసి మనోభావాలు దెబ్బ తేసినందుకు కేసు వేసినట్లు తెలిపారు. మ‌రోవైపు ఐలయ్య పై అట్రాసిటీ  కేసు నమోదు చేయాలని మల్కాజిగిరి కోర్టు ఆదేశించింది. ఇలా కోర్టు తీర్పు - పోలీసు కేసుల క‌ల‌క‌లం క‌ల‌క‌లం కొనసాగుతుండ‌గానే మావోయిస్టు పార్టీ ఆయ‌న‌కు మ‌ద్ద‌తు ప‌లికింది.

మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ ఐల‌య్య‌కు పూర్తి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. ఐలయ్యను బెదిరించడాన్ని మావోయిస్టు  పార్టీ ఖండిస్తోందని తెలిపారు. ఐలయ్య రాసిన విషయాలపై అభ్యంతరముంటే చర్చించాలని కానీ ఆయ‌న్ను బెదిరించ‌డం స‌రికాద‌న్నారు. కంచ ఐలయ్యకు అన్నిరకాలుగా మద్దతు ఇస్తామ‌ని పేర్కొంటూ.... ప్రజలు, ప్రజాస్వామిక వాదులు ఐలయ్యకు అండగా నిలబడాలని జ‌గ‌న్‌ కోరారు. ఐలయ్యతో రాజకీయ భేధాభిప్రాయాలున్నా కూడా ఆయన భావప్రకటన స్వేచ్చను గౌరవిస్తున్నామ‌ని మావోయిస్టు ప్ర‌తినిధి త‌న లేఖ‌లో పేర్కొన్నారు. కంచె ఐలయ్య భావప్రకటన స్వేచ్చను అడ్డుకునే హక్కు ఎవరికీ లేదుని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. సంఘ్ పరివార్ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం బ్రాహ్మణీయ హిందూ ఫాసిస్టు విధానాలు అమలు చేస్తోందని ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్ మండిప‌డ్డారు.

పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం అట్టడుగు వర్గాల ప్రజలపై బీజేపీ దాడులు చేస్తోందని మావోయిస్టు అధికార ప్ర‌తినిధి మండిప‌డ్డారు. ప్రజాస్వామిక అభిప్రాయాలను అణిచేసేందుకు సంఘ్ పరివార్ హత్యా రాజకీయాలు చేస్తోందని ఆక్షేపించారు. గౌరీ లంకేశ్ హత్య, కంచ ఐలయ్యపై దాడులు సంఘ్ పరివార్ హత్యా రాజకీయాల్లో భాగమేన‌ని ఆరోపించారు. మూఢవిశ్వాసాలు, అశాస్త్రీయ భావాలను ప్రశ్నించే హేతువాదులను ఆరెస్సెస్ చంపుతోందని విమ‌ర్శించారు. బ్రాహ్మణీయ హిందూ మతోన్మాదంపై గళమెత్తినందుకే ఆరెస్సెస్ గౌరీ లంకేశ్ ను చంపేసిందని విరుచుకుప‌డ్డారు. ఇప్పుడు వైశ్యులను కించపరిచాడంటూ ప్రొఫెసర్ కంచ ఐలయ్య భావప్రకటన స్వేచ్చపై జరుగుతున్న దాడివెనుక ఆరెస్సెస్ - కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాల కుట్ర ఉందని మావోయిస్టు అధికార ప్ర‌తినిధి దుయ్య‌బ‌ట్టారు. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌ మోడీ - తెలంగాణ సీఎం కేసీఆర్ తమ వర్గాన్ని ప్రశ్నించడాన్ని - విమర్శించడాన్ని సహించలేక పోతున్నారని ఆరోపించారు. అందుకే... వీరి నియంతృత్వ పాలనలో కంచ ఐలయ్యను తంపుతామని, నాలుక కోస్తామని బెదిరిస్తున్నారని అన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్ర‌బాబు ఏకంగా ఐలయ్య పుస్తకమే లేకుండా చేస్తానన్నార‌ని....అక్షరాల్ని నిషేధించాలనుకునే నియంతృత్వం చాలా ప్రమాదకరమ‌ని తెలిపారు.
Tags:    

Similar News